ఏప్రిల్ 20, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రేషన్ దుకాణాల ద్వారా 5 కిలోల గ్యాస్ సిలిండర్ల పంపిణీ…

  • కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…
  • రేషన్ డీలర్లకు ఆర్దికంగా సహాకారం… వలన కూలీలకు అందుబాటులో మినీ సిలిండర్.
  • సఫ్లై చేయడానికి ముందుకు వచ్చిన ఆయిల్ కంపెనీలు.
  • త్వరలో సరఫరా చేయడానికి కార్యాచరణ సిద్దం..

ఆర్సీ న్యూస్, అక్టోబర్ 03 (న్యూ ఢిల్లీ): రేషన్ దుకాణాలను మరింత పటిష్టం చేయడంతో పాటు ఆర్థికంగా డీలర్లు అందరికీ వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం ఏర్పాటు చేసుకొని రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ తోపాటు 5 కిలోల గ్యాస్ సిలిండర్లను అందజేయడానికి ప్రతిపాదనలు రూపొందించి అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా అవసరమైన ప్రతి ఒక్కరికి 5 కిలోల గ్యాస్ సిలిండర్లను అందజేయనుంది. సబ్సిడీ బియ్యం, గోధుమలు, చక్కర తో పాటు 5 కిలోల గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరలకు అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రస్తుతం నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది గ్యాస్ సిలిండర్. నిరుపేదలు కట్టెల పొయ్యిపై వంట చేసుకోకుండా అందరికి గ్యాస్ సిలిండర్ అందించాలనే ఉద్దేశంతో కేంద్రం గ్యాస్ కనెక్షన్లను అందిస్తోంది. ఇక గ్యాస్ సిలిండర్ అయిపోతే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఇంటికి వచ్చేందుకు ఒకటి లేదా రెండు, అంతకన్న ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రేషన్ షాపుల ద్వారా చిన్న సిలిండర్లు అందుకోనున్నారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం లాంటి ఆయిల్ కంపెనీలన్నీ చిన్న సిలిండర్లను కూడా అమ్ముతుంటాయి. కమర్షియల్ సిలిండర్ 19 కిలోలు, డొమెస్టిక్ సిలిండర్ 14.2 కిలోల కెపాసిటీతో వస్తే ఈ చిన్న సిలిండర్లు కేవలం 5 కిలోల కెపాసిటీతో వస్తాయి. అత్యవసరంగా గ్యాస్ సిలిండర్ అవసరం అయినవారికి, వలస కూలీలకు ఈ చిన్న సిలిండర్లు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చిన్న సిలిండర్లను ఇకపై రేషన్ షాపుల్లో అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇండియన్ ఆయిల్ కంపెనీ చోటు పేరుతో, హిందుస్తాన్ పెట్రోలియం అప్పు పేరుతో, భారత్ పెట్రోలియం మినీ పేరుతో చిన్న సిలిండర్లను విక్రయించనున్నాయి. ఇవి ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్లు. వీటిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఈ చిన్న సిలిండర్లు కొనడానికి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. కేవలం ఐడీ ప్రూఫ్ చూపించి ఈ సిలిండర్ పొందవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లవచ్చు. ఎక్కడైనా రీఫిల్ చేసుకోవచ్చు. చిన్న సిలిండర్లను రేషన్ షాపుల్లో అమ్మేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేస్తోందని ఫుడ్ సెక్రెటరీ సుధాన్షు పాండే వెల్లడించారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న రేషన్ షాపులు ఆర్థికంగా పుంజుకోవడానికి తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక భాగమని ఆయన తెలిపారు.భారతదేశంలో మొత్తం 5.32 లక్షల రేషన్ షాపులు ఉన్నాయి. ఈ షాపుల ద్వారా 80 కోట్ల మంది లబ్ధిదారులకు సబ్సిడీ ధరలకే ఆహారధాన్యాలను జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా సరఫరా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. రేషన్ షాపుల ద్వారా చిన్న సిలిండర్లను అమ్మడంతో పాటు రుణాలు అందించడం లాంటి ఆర్థిక సేవలను కూడా ఈ నెట్వర్క్ ద్వారా అందించాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. అయితే రేషన్ షాపుల ఆర్థిక ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి గత బుధవారం వివిధ రాష్ట్రాల మంత్రులతో జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చించినట్టు సుధాన్షు పాండే తెలిపారు. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖతో పాటు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం ప్రతినిధులు ఆసక్తి చూపిన రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి..