ఏప్రిల్ 19, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

Coronavirus Omicron: రాబోయే నాలుగు వారాలు ఎంతో కీలకం…

Coronavirus Omicron: రాబోయే నాలుగు వారాలు ఎంతో కీలకం...
  • కరోనా వైరస్ తో పాటు ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తి ప్రభావం..
  • ఇప్పటికే మొదలైన థర్ద్ వేవ్..
  • వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి..
  • రాబోయే నాలుగు నుంచి ఆరు వారాలు కీలకం..
  • ప్రతి ఒక్కరూ కోవిడ్-19 నిబంధనలు పాటించాల్సిందే..
  • రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు రద్దు చేసుకోవాలి..
  • వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస రావు వెల్లడి..

 ఆర్సీ న్యూస్, జనవరి 06 ( హైదరాబాద్):  కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో రాబోయే నాలుగు వారాలు ఎంతో కీలకంగా మారనున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రజా వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస రావు హెచ్చరించారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాబోయే నాలుగు నుంచి ఆరు వారాలు ఎంతో జటిలంగా మారనున్నాయని ఆయన అన్నారు. వైరస్ ఎంత వేగంగా వ్యాపించినా..వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసిందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే ప్రతి ఒక్కరు కోవిడ్-19 నిబంధనలు తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. తమను తాము కాపాడుకుంటూనే సమాజంలోని ఇతరులను కూడా కాపాడుకోవడానికి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఏ మాత్రం ఆలసత్వం వహించినా ఒమిక్రాన్ వైరస్ నుంచి తప్పించుకోలేరు అన్నారు్ తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వైరస్ నుంచి బయట పడాలి అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 100 శాతానికి పైగా ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. 71 శాతానికి పైగా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. ఈనెల 26వ తేదీ వరకు 100% రెండో డోస్ అంద జేయడానికి వైద్య ఆరోగ్య శాఖ తగిన ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే టీకాలు వేయించుకోవాలి అన్నారు. అంతేకాకుండా ఈ నెల 3వ తేదీ నుంచి 15 ఏళ్ల వయసున్న వారితో పాటు 17 ఏళ్ల వయసు ఉన్న వారందరికీ వ్యాక్సినేషన్ జరుగుతోందన్నారు. 15 నుంచి 17 వరకు వయస్సు ఉన్నవారు 18.41 లక్షలు ఉన్నారన్నారు. ఇందులో  ఇప్పటికే ఒక లక్షా 80 వేలకు పైగా టీకాలు అందజేశామన్నారు. పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి అవసరమైన విద్యార్థినీ విద్యార్థులందరికీ ఉచితంగా టీకాలను అందజేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 3వ, వేవ్ మొదలైనందున అన్ని రకాల రాజకీయ పార్టీల నాయకులు తమ సభలు, సమావేశాలు వెంటనే రద్దు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. రాబోయే 6 వారాల వరకు ఎలాంటి సమావేశాలను నిర్వహించ రాదన్నారు. కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ తమ రోజువారి దిన చర్యలను కొనసాగించాలన్నారు. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండటానికి కరోనా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఎక్కడ పూర్తిస్థాయి లాక్ డౌన్ కొనసాగడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ ఉండదన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ గుంపులు గుంపులు గా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. గత రెండేళ్లలో కరోనా వైరస్ వ్యాప్తి తో కలిగిన అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నమన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందన్నారు. అయితే రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం విధించిన ఆంక్షలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు.