మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

నగరంలోని నెహ్రు జూ పార్క్ లో ఓ వ్యక్తి హల్ చల్..

నగరంలోని నెహ్రు జూ పార్క్ లో ఓ వ్యక్తి హల్ చల్..
  • లయన్ ఎన్ క్లోజర్ లోకి దూకడానికి ప్రయత్నం..
  • వ్యక్తిని చూసి పట్టుకోడానికి ఎగిరి గంతేసిన లయన్..
  • . వారించిన సందర్శకులు..వెంటనే స్పందించిన సిబ్బంది..
  • . వ్యక్తిని కాపాడి పోలీసులకు అప్పగించిన జూ సిబ్బంది..

ఆర్సీ న్యూస్, నవంబర్ 23 (హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మంగళవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి కొద్దిసేపు హల్ చల్ చేశాడు. అందరిలాగే టికెట్ ఖరీదు చేసుకొని జూ పార్కు లోకి ప్రవేశించిన అతను ఉన్నట్టుండి ఆఫ్రికన్ లయన్ (సింహాల) ఎన్ క్లోజర్ వద్దకు వెళ్లి కిందికి దూకేందుకు ప్రయత్నించాడు. అటు ఇటు చూస్తూ లోనికి పై నుంచి కిందికి దూకే ప్రయత్నం చేయగా… సందర్శకులు ఈ దృశ్యాన్ని చూసి గట్టిగా అరుస్తూ వారించారు. ఎన్ క్లోజర్ పైన వ్యక్తిని గమనించిన సింహం కింద నుంచి పైకి ఎగురుతూ అతనిని పట్టుకోవడానికి ఎగిరి గంతులు వేసింది. అటు ఇటు తిరుగుతూ అతని వైపే చూస్తూ ముందుకు కదిలింది. ఈ దృశ్యాన్ని కనులారా చూసిన జూ సందర్శకులు గట్టిగా అరుస్తూ ఆ వ్యక్తిని కిందికి దిగకుండా వారించారు. విషయం తెలుసుకున్న జూ సిబ్బంది వెంటనే స్పందించి అతని వద్దకు చేరుకొని ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం అతని గురించి వివరాలు సేకరించగా.. ఎన్ క్లోజర్ లోనికి దిగడానికి ప్రయత్నించినా వ్యక్తి సాయి కుమార్ గా తేలింది. 31 ఏళ్ల సాయి కుమార్ ఎర్రగడ్డ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. హోటల్లో హెల్పర్ గా పనిచేస్తున్న సాయి కుమార్ గత కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు. సాయి కుమార్ ను పట్టుకున్న జూ సిబ్బంది బహదూర్ పురా పోలీసులకు అప్పగించారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ లో గతంలో కూడా ఓ వ్యక్తి ఆఫ్రికన్ లయన్ ఎన్ క్లోజర్ లోకి దిగి హల్చల్ సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పుడు లయన్ ఎన్ క్లోజర్ లోకి దిగిన ఆ వ్యక్తి నీటి కొలను దాటి సింహాల వైపు కదలడంతో వెంటనే స్పందించిన జూ సిబ్బంది సింహాలను ఆ వ్యక్తి వైపు వెళ్లకుండా అడ్డుకుని… మాంసం ముద్దులను ఎన్ క్లోజర్ లోనికి విసిరేసి అటెన్షన్ డైవర్ట్ చేశారు. దీంతో సింహాలు ఆ వ్యక్తి వైపు కాకుండా మాంసం ఉన్న వైపు వెళ్లడంతో జూ సిబ్బంది ఆ వ్యక్తిని కాపాడారు. ఇలా అప్పుడప్పుడు మతిస్థిమితం లేని కొంతమంది వ్యక్తులు లయన్ ఎన్ క్లోజర్ లోకి దిగి తమ ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే కాకుండా ఇతర సందర్శకులను టెన్షన్ కు గురి చేస్తున్నారు. ఎన్ని కట్టు దిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ… అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదకర సంఘటనలు చోటుచేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.