ఏప్రిల్ 20, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహించిన బాలీవుడ్ నటుడు గోవిందా…

భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహించిన బాలీవుడ్ నటుడు గోవిందా...
  • తన భార్య సునీత అహుజ తో కలిసి పూజలు
  • దాదాపు గంట సేపు గడిపిన గోవిందా దంపతులు
  • తెలుగు ప్రజలు, ఈ నేలకు రుణపడి ఉన్నాను..
  • మంచి ఆఫర్లు వస్తే తిరిగి నటిస్తా: గోవిందా

 

ఆర్సీ న్యూస్, ఆగస్టు 10(హైదరాబాద్): బాలీవుడ్ నటుడు గోవిందా మంగళవారం పాతబస్తీలో సందడి చేశారు. తన భార్య సునీత అహుజతో కలిసి ఆయన పాతబస్తీని సందర్శించారు. చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా దేవాలయాన్ని సందర్శించిన గోవిందా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా తన భార్య సునీత అహుజ చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరుకోవడం తో తాము ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నామని బాలీవుడ్ నటుడు గోవిందా తెలిపారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు చీర, సారేలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన అర్చన,మహా హారతి పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవిందా విలేకరులతో మాట్లాడుతూ…భాగ్య లక్ష్మీ అమ్మవారికి తన భార్యతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహించాలనే తన భార్య కోరిక ఇప్పటికీ నెరవేరిందన్నారు. అమ్మవారి దయతో ఇప్పటి వరకు తనకు చక్కటి పేరు, ప్రతిష్టలు లభించాయన్నారు. హైదరాబాద్ నగరం అంటే తనకు ఎంతో ఇష్టమని.. తెలుగు ప్రజలు తన సినిమాలు అన్ని విజయవంతం చేశారన్నారు. తాను నటించిన సినిమాలు అన్నింటినీ తెలుగు ప్రజలు ఆదరించారన్నారు. రాబోయే రోజుల్లో మంచి ఆఫర్లు వస్తే…తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తన తల్లి విమలాదేవి గాయత్రి మాత ఉపాసన చేశారని… ఆమెకు కొడుకుగా పుట్టడం తన అద్రుష్టమన్నారు. అలాగే తన అత్తగారు సావిత్రిమాలకు సేవ చేసుకునే భాగ్యం లభించిందన్నారు. అమ్మవారి కరుణ, కటాక్షం ఉంటే ఎలాంటి సమస్య అయినా ఎదుర్కోవచ్చునన్నారు. గత కొంత కాలంగా ప్రజలు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారని.. వీరందరినీ శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారు ఆదుకుంటుందన్నారు. తాము పడే బాధ నుంచి ప్రజలను కాపాడటంలో భాగ్యలక్ష్మీ అమ్మవారు ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. తన సినిమాలు ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రజలతో పాటు ఇక్కడి నేలకు తాను రుణపడి ఉన్నానన్నారు. తనకు ఇంతటి పేరు, ప్రఖ్యాతులు మాతా తోనే లభించాయన్నారు.  మంగళవారం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి చేరుకున్న గోవింద దంపతులకు ఆలయ ట్రస్ట్ శశికళ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అమ్మవారి సన్నిధిలో దాదాపు గంట సేపు గడిపిన గోవిందా దంపతులను కలిసి సెల్ఫీ దిగడానికి పాతబస్తీ ప్రజలు ఉత్సాహం చూపించారు. అందరిని నవ్వుతూ పలకరించిన గోవిందా ఎంతో ఓర్పుతో స్థానికులకు సహకరించారు. ఆప్యాయంగా పలకరించారు. పూజల సందర్భంగా అమ్మవారి పాదాల చెంత నల్లపూసల తాడును ఉంచి… అనంతరం తన భార్య సునీత అహుజ  మెడలో కట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కార్యక్రమం ముగిసింది.చార్మినార్ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.