ఏప్రిల్ 20, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

దేశం లో ముంచుకొస్తున్న ‘తౌక్టే ’ తుఫాన్..

దేశం లో ముంచుకొస్తున్న ‘తౌక్టే ’ తుఫాన్..

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): దేశంలో తౌక్టే తుఫాను ముంచుకొస్తోంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలపై ఈ తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు వేటకు అరేబియా సముద్రంలోకి వెళ్ల రాదన్నారు. తుఫాన్ సమాచారం వచ్చిన వెంటనే 50 ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి నేవీ సిద్ధం చేశారు. అరేబియా మహా సముద్రంలో లక్ష్య ద్వీప్ వద్ద ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ గా మారింది. దీన్ని తౌక్టే తుఫాన్ గా నామకరణం చేశారు. గోవాకు దక్షిణ నైరుతి దిశగా 330 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది రాగల సమయంలో తీవ్ర తుఫాన్ గా మారే అవకాశాలున్నాయన్నారు. ఈ నెల 18న, గుజరాత్ వద్ద తుఫాన్ తీరం దాటవచ్చని అధికారులు అంటున్నారు. ఈ నెల 31న కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. దేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న నేపథ్యంలో తౌక్టే తుఫాన్ ముంచుకురావడంతో దేశ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా  దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్ర ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని ప్రభుత్వాలు అప్రమత్త మవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో తుఫాన్ తీవ్ర ప్రభావం చూపితే..దాని పర్యవసానం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటుందంటున్నారు.

తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని…

తౌక్టే తుఫాను ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. తుఫాన్ పై ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో పలు సూచనలు చేశారు. తుఫాన్ నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. తౌక్టే తుఫాన్ పై దేశ ప్రధాని మాట్లాడుతూ..తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అవసరమైన మేరకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఐదు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించనున్నందున.. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్-19 రోగులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్  వైద్య సేవలు అందించే ఆసుపత్రుల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తుఫాను కారణంగా వచ్చే వర్షంతో పాటు జోరుగా వీచే గాలి దుమారానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశాలున్నందున..ముందుగానే జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. వైద్య సేవలకు ఎక్కడ ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు.

తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో జోరుగా వర్షాలు…

ఇలా తౌక్టే తుఫాన్ తీవ్రరూపం దాల్చితే దాని ప్రభావం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.హైదరాబాద్ నగరంలో గాలి దుమారం తో పాటు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశాయి. ఇప్పటికే గత రెండు రోజులుగా ఆకాశం మేఘావృతం అయ్యింది. అంతేకాకుండా ఇప్పటికే ఈ నెల 14న నగరంలో ఉరుములతో కూడిన వర్షం పడింది. జోరుగా  వీచిన గాలి దుమారానికి పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగింది.వెంటనే స్పందించిన టీఎస్ఎస్పీడీసీఎల్ సిబ్బంది చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. తౌక్టే తుఫాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే వర్షాలతో కోవిడ్ రోగులు ఇబ్బందులు కలగకుండా తగిన ముందస్తు చర్యలకు ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. తుఫాను కారణంగా వచ్చే వర్షాలతో కోవిడ్ వైద్య సేవలు స్తంభించకుండా ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకుంటున్నారు. లైఫ్ సేవింగ్ ఇంజక్షన్, ఆక్సిజన్ సరఫరా, విద్యుత్ అంతరాయం..ఇలా అత్యవసర సేవలంటికి ఎక్కడ అవాంతరాలు తలెత్తకుండా చూడాలని వైద్యాధికారులు ఆదేశాలు జారీ చేశారు.