మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఎట్టకేలకు రాష్ట్రం లో పది రోజుల పాటు లాక్ డౌన్.

ఎట్టకేలకు రాష్ట్రం లో పది రోజుల పాటు లాక్ డౌన్.

ఆర్సీ న్యూస్ (హైదరాబాద్):  ఎట్టకేలకు రాష్ట్రం లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రం లో రోజుకు 20 గంటల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కట్టడికి అవసరమైన చర్యలపై మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన కేబినెట్ మీటింగ్ లో లాక్ డౌన్ విధింపు,కరోనా కట్టడి తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియడంతో రాష్ట్రం ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురు చూశారు. ఎట్టకేలకు పది రోజుల పాటు రోజుకు 20 గంటల లాక్ డౌన్ విధిస్తు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఉంటుందని..నిత్యావసర వస్తువులతో పాటు అవసరమైన అన్ని లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయి. అన్ని రకాల దుకాణాలు, వ్యాపార సముదాయాలు పని చేస్తాయి. రేషన్ దుకాణాలు, మద్యం దుకాణాలు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పని చేస్తాయి. అంటే 20 గంటల లాక్ డౌన్…4 గంటల పాటు సడలింపు ఉంటుంది.

 లాక్ డౌన్ ప్రకటనతో కిటకిటలాడిన మార్కెట్లు…

 లాక్ డౌన్ ప్రకటన వెలువడిన వెంటనే నగరంలోని అన్ని ప్రధాన మార్కెట్ లన్నీ వినియోగదారులతో కిటకిటలాడాయి. రోడ్లన్నీ వాహనదారులతో రద్దీగా మారాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అంతర్గత రోడ్ల తో పాటు ప్రధాన రోడ్ లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. మందుబాబులు తమకు అవసరమైన మధ్యం సీసాలను స్టోర్ చేసుకోవడం కోసం వైన్ షాప్ ల వద్ద క్యూ కట్టారు. కొన్ని వైన్ షాపుల వద్ద మహిళలు సైతం క్యూ లో కనిపించారు. రేషన్ దుకాణాలు,మెడికల్ షాపుల వద్ద కూడా అంతగా క్యూ కనిపించ లేదుగానీ..వైన్ షాపుల వద్ద మాత్రం చాంతాడంతా క్యూ కనిపించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వైన్ షాప్ లు పని చేస్తాయని తెలిసినప్పటికీ..ఎందుకైనా మంచిది కొని పెట్టుకుంటే బావుంటుంది..అంటూ చాలా మంది మద్యం ప్రియులు వైన్ షాప్ లకు చేరుకుని తమకు అవసరమైన బ్రాండ్ లను ఖరీదు చేసుకుని తీసుకెళ్లారు.

ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువులు,కూరగాయల ధరలు...

ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువులు,కూరగాయల ధరలు…

ఇక నిత్యావసర వస్తువుల ధరలు ఏకంగా ఆకాశాన్ని చేరాయి. మంగళవారం ఉదయం అందుబాటులో ఉన్న ధరలు లాక్ డౌన్ ప్రకటన వెలువడిన వెంటనే రెట్టింపు అయ్యాయి. కూరగాయల ధరలు కూడా పెరిగిపోయాయి. తమ వద్ద ఉన్న స్టాక్ ను అధిక ధరలకు విక్రయించడానికే చిరు వ్యాపారలు పోటీ పడ్డారు. ప్రజలు గుంపులు, గుంపులుగా మార్కెట్ లను ఆశ్రయించడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఎక్కడ చూసినా… వినియోగదారులే కనిపించారు. ఎక్కడా భౌతిక దూరం కనిపించ లేదు.

గడువు లేకుండా లాక్ డౌన్ ఏమిటి: హైకోర్టు

కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర హైకోర్టు జోక్యం తేసుకుని మండిపడడంతో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆగమేఘాల మీద కేబినెట్ సమావేశం నిర్వహించి లాక్ డౌన్ విధింపు పై నిర్ణయం తీసుకుని హైకోర్టుకు వివరించింది. దీంతో ఎలాంటి గడుపు లేకుండా బుధవారం ఉదయం నుంచి లాక్ డౌన్ విధింపు ఏమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వలస కూలీలు, ఇతర పేద ప్రజలు తమ తమ గ్రామాలకు వెళ్ళడానికి సమయం సరిపోదని హైకోర్టు అభిప్రాయపడింది. 

ఇప్పటి వరకు కొనసాగుతున్న రాత్రిపూట కర్ఫ్యూ…

 గత నెల 20 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు లోకి వచ్చిన విషయం తెలిసిందే. మొదటగా..మే 1వ తేదీ వరకు..తర్వాత 8వ తేదీ వరకు..ఇప్పుడు 15వ తేదీ వరకు..ఇలా వారం వారం పొడిగిస్తూ వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ నెల 15 వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఇక నాలుగు రోజుల్లో రాత్రి కర్ఫ్యూ గడువు ముగియనుంది. హైకోర్టు మంగళవారం మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడింది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయని..కేవలం తెలంగాణలో లాక్ డౌన్ లేదని ప్రశ్నించింది. రంజాన్ మాసం చివరి రోజులు కొనసాగుతున్నందున లాక్ డౌన్ కు అవకాశం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్డు మందలించింది. రంజాన్ పండుగ తర్వాత అయితే…అప్పటి వరకు కరోనా వైరస్ వ్యప్తిని ఎలా అడ్డుకుంటారని..అప్పటి వరకు ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. దీంతో మధ్యాహ్నం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో 

ఈ నెల 12వ తేదీ నుంచి 22 వరకు 20 గంటల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.  

ఇప్పటికే దేశవ్యాప్తంగా…

ఇప్పటికే రాష్ట్రానికి అన్ని వైపుల బార్డర్ లోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఈ నెల 24 వరకు సంపూర్ణ లాక్ డౌన్ అమలులో ఉంది. న్యూ ఢిల్లీలో ఈ నెల 16 వరకు, మహారాష్ట్రలో 15 వరకు, ఉత్తర ప్రదేశ్ లో 17 వరకు, గోవాలో 24 వరకు, ఒరిస్సా 19 వరకు, బీహార్ లో 15 వరకు, కేరళలో 16 వరకు, రాజస్థాన్ లో 24 వరకు లాక్ డౌన్ అమలులో ఉండగా..జార్ఖండ్,ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇలా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ తో పాటు ఆంక్షలు కొనసాగుతున్నాయి.