మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రాష్ట్రంలో విజయవంతంగా మొదటి రోజు వాక్సినేషన్..

రాష్ట్రంలో విజయవంతంగా మొదటి రోజు వాక్సినేషన్..
  • మొదటి రోజు గ్రేటర్ లో 21,666 మంది సూపర్ స్ప్రెడర్స్ కు టీకాలు..
  • రాష్ట్రంలో విజయవంతంగా మొదటి రోజు వాక్సినేషన్
  • టీకా కేంద్రాలను పరిశీలించిన మంత్రులు,ఎంపీ,మేయర్,ఎమ్మెల్యేలు,సీఎస్
  • రాబోయే మూడు రోజుల్లో 1.4 లక్షల మందికి వాక్సినేషన్: సీఎస్
  • సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజా ప్రతినిధులు,సీఎస్ సోమేశ్ కుమార్
  • మీరాలంమండి,మాదన్నపేట్,గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లలో టీకా కేంద్రాలు కావాలంటున్నవ్యాపారులు

ఆర్సీ న్యూస్ (హైదరాబాద్): రాష్ట్రంలో శుక్రవారం ప్రారంభమైన సూపర్ స్ప్రెడర్స్   కు వాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మొదటి రోజు వాక్సినేషన్ ప్రశాంతంగా కొనసాగిందన్నారు. మొదటి దఫా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7.75 లక్షల మందికి టీకా చేయడానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తగిన ఏర్పాట్లు జరగడంతో మొదటి రోజు ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్త లేదని పేర్కొన్నారు. ప్రశాంతంగా వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగింది. మీరాలంమండి,మాదన్నపేట్,గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని స్థానిక కూరగాయల వ్యాపారులు కోరుతున్నారు. శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన వాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ,ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, ప్రకాష్ గౌడ్,మహిపాల్ రెడ్డి,సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, దానం నాగేందర్,మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన్ రావు, మేయర్ విజయలక్సీ, డిప్యూటీ మేయర్ శ్రీలత,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, గ్రేటర్ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు వివిధ ప్రాంతాల్లో పర్యటించి టీకా పంపిణీ స్వయంగా పరిశీలించారు. నాంపల్లిలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో కొనసాగుతున్న వాక్సినేషన్ సెంటర్ ను రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో 1.4 లక్షల మందికి వాక్సినేషన్ చేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 30 వేల మందికి వాక్సినేషన్ జరుగుతుందని చెప్పినప్పటికీ..మొదటి రోజైన శుక్రవారం 21,666 మందికి మాత్రమే టీకా పంపిణీ జరిగింది.

రాష్ట్రంలో ముప్పై లక్షల మంది సూపర్ స్ప్రెడర్స్…

రాష్ట్రంలో ముప్పై లక్షల మంది సూపర్ స్ప్రెడర్స్ ఉంటారు. ఇందులో ఇరవై వేల మంది జర్నలిస్టులు, నలభై తొమ్మిది వేలకు పైగా ఎల్పీజీ గ్యాస్ డెలివరి సిబ్బంది, ముప్పై మూడు వేలకు పైగా రేషన్ షాప్ డీలర్లు,వెయ్యి మందికి పైగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) సిబ్బంది, ముప్పై వేల మంది వ్యవసాయ సంబంధిత విత్తనాలు,ఎరువులు, మందులు అమ్మే దుకాణాల డీలర్లు,సిబ్బంది ఉన్నారు. వీరందరికి శుక్రవారం టీకా పంపిణీ ప్రారంభమైంది. ఈ మేరకు గ్రేటర్లో 3 లక్షల మందికి టీకాలు వేయడానికి ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు గ్రేటర్ పరిధిలోని సర్కిల్స్ వారీగా టీకా సెంటర్లను ఏర్పాటు చేసి..శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీకా వేశారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిల్స్ లో 30 టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి పది రోజుల పాటు టీకాలను అందజేయనున్నారు. ఒక్క సెంటర్ లో పది కౌంటర్లను ఏర్పాటు చేసి ఒక్కో కౌంటర్ లో వంద మంది చొప్పున రోజుకు ఒక్కో కేంద్రంలో వెయ్యి మందికి టీకాలను అందజేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 3 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది.  పది రోజుల్లో 3 లక్షల మందికి టీకాలను అందజేయనున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న వాక్సినేషన్ కేంద్రాలు…

కాప్రా సర్కిల్- లోని కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో వాక్సినేషన్ సెంటర్ కొనసాగుతోంది. అలాగే  రామంతాపూర్ ఫంక్షన్ హాల్, మన్సూరాబాద్ లోని కేబీఆర్ ఫంక్షన్ హాల్, వనస్థలిపురంలోని హుడా కమ్యూనిటీ హాల్, చంపాపేట్ లోని మల్టీ ఫర్ఫస్ ఫంక్షన్ హాల్, దిల్ సుక్ నగర్ రాజధాని థియేటర్ వెనుక నున్న గణేష్ ఫంక్షన్ హాల్, అక్బర్ బాగ్ లోని ముంతాజ్ కాలేజీ, గౌలిపుర లోని మిత్రా స్పోర్ట్స్ క్లబ్, రెయిన్ బజార్ లోని ఎస్సార్టీ స్పోర్ట్స్ గ్రౌండ్, చాంద్రాయణగుట్ట తాళ్ల కుంట రోడ్డులోని సుహానా ఫంక్షన్ హాల్, సర్దార్ మహల్ సమీపంలోని సనా గార్డెన్ ఫంక్షన్ హాల్,జూ పార్క్ సమీపంలోని తాడ్బన్ వద్ద నున్న కుడా పాలిటెక్నిక్ కాలేజీ, శివరాంపల్లి లోని ఎస్ ఎన్ సీ కన్వెన్షన్ హాల్,మెహదీపట్నంలోని ఎంపీ గార్డెన్స్, టోలిచౌకి లో ఇంపీరియల్ గార్డెన్, నాంపల్లి లోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్, ముషీరాబాద్ లోని గవర్నమెంట్  హై స్కూల్, అంబర్ పేట్ ఇండోర్ స్టేడియం,సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్,లేక్ వ్యూ బంజారా గార్డెన్ ఫంక్షన్ హాల్,మహమూద్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, గచ్చిబౌలి స్టేడియం, పీజేఆర్ స్టేడియం,చైతన్య నగర్ లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, ఎన్ కే ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్, నైనా గార్డెన్స్,కుత్బుల్లాపూర్లోని జీడిమెట్ల లోని సరోజినీ గార్డెన్స్,గాజుల రామారంలోని మహారాజా గార్డెన్, అల్వాల్లోని వీబీఆర్ గార్డెన్స్,మల్కాజిగిరిలోని జడ్పీహెచ్ఎస్, మల్కాజిగిరి క్రాస్ రోడ్,సికింద్రాబాద్ లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్,బేగంపేటలోని బన్సీలాల్ పేట్ లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లలో శుక్రవారం నుంచి వాక్సినేషన్ కేంద్రాలు పని చేస్తున్నాయి.