మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఉదయం 10.10 గంటలకు రోడ్లపై రాకపోకలు తగ్గాలి..సీఎం

ఉదయం 10.10 గంటలకు రోడ్లపై రాకపోకలు తగ్గాలి..సీఎం
  • పాస్ కలిగిన వారు తప్ప..మరెవరూ ఉండరాదు
  • లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలి
  • కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ సక్రమంగా అమలు జరగకపోవడం పట్ల సీఎం అసంతృప్తి

ఆర్సీ న్యూస్ ( వరంగల్ ): సడలింపు అనంతరం ప్రతిరోజు ఉదయం 10.10 గంటలకు రోడ్డుపై ఎవరు ఉండకుండా కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డీజీపీ తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ జిల్లాలో ఆయన పర్యటన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు డీజీపీ,ఎస్పీ,కమీషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ సక్రమంగా అమలు జరగకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల సర్పంచులు,ఇతర ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తుండగా.. నగరాలు,పట్టణాల్లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు జరగడం లేదన్నారు. దీనికి డీజీపీ తగిన చర్యలు తీసుకుని అత్యవర మెడికల్ పనులు, నిర్ధేశిత ఈ-పాస్ లు కలిగిన వారు తప్ప… ప్రతిరోజు ఉదయం 10.10 గంటలకు ఇతరులెవరూ రోడ్లపైకి వచ్చి రాకపోకలు సాగించకుండా కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఇష్టానుసారంగా రోడ్లపైకి గుంపులు, గుంపులుగా వస్తే..ఇక లాక్ డౌన్ అమలు చేసి ఏం ప్రయోజనమని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసి తీరాల్సిందేనని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నఆర్టీసీ డ్రైవర్లు,కండక్టర్లు,కూరగాయల వ్యాపారులు,సేల్స్ మెన్ తదితరులందరిని గుర్తించి వారికి వాక్సినేషన్ చేయించాలన్నారు. ఇందుకోసం జిల్లాల వారిగా వారి జాబితాలను రూపొందించి తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం..జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. యాదాద్రి,నాగర్ కర్నూల్ జిల్లాలలో కోవిడ్ కేసులు తగ్గడం లేదని..ఆయా జిల్లాలకు వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వినీ ఆదేశించారు. కోవిడ్ ఆసుపత్రులలో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ తోపాటు అన్ని జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలలో ధాన్యం సేకరణ వేగవంతం కావాలన్నారు. తాను హెలిక్యాప్టర్ నుంచి చూడగా కింద రోడ్లపై ధాన్యం ఆరబోసి కన్పించిందన్నారు. మధ్యాహ్నాం బోజన విరామం తర్వాత వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన ఆయన త్వరలో ఇక్కడి నుంచి జైలును తరలించి మరో ప్రాంతంలో విశాలంగా చర్లపల్లి సెంట్రల్ జైలు లాగా నిర్మిస్తామన్నారు. జైలు స్థలంలో సూపర్ స్సెషాలిటి ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు.

ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా రోగులను పరామర్శించిన సీఎం…

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కోవిడ్ రోగులను పరామర్శించారు. కరోనా వైరస్ సోకి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్న రోగులను సీఎం కేసీఆర్ శుక్రవారం పలకరించారు. వారికి మనోధైర్యం చెప్పారు. వారిలో మానసిక ధైర్యాన్ని నింపారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించినట్లు..వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని పీపీఈ కిట్లు వేసుకోకుండానే సందర్శించారు. ఆస్పత్రిని సందర్శించిన ఆయన ఆస్పత్రిలో అన్ని విభాగా లను పరిశీలించారు. కరోనా బాధితులకు ఇక్కడ అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు. కరోనా రోగుల బెడ్స్ వద్దకు వెళ్లి బాధితుల ఆరోగ్య, సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ పీపీఈ కిట్లు వేసుకోకుండానే ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి బాధితులను పరామర్శించారు. వారికి ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయనే విషయాలను రోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా సంబంధిత వైద్యులను ఆరా తీశారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా కొంతమంది రోగులు సీఎం కేసీఆర్ దేవుడు లాంటి మనిషని కొనియాడారు. మంచం పై నుంచి లేచి రెండు చేతులు జోడించి దండం పెట్టారు. కొంత మంది రోగులు తమ సమస్యలు వినిపించారు. ఆయా రోగుల సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. వార్డులో వైద్య సేవలు పొందుతున్న కరోనా రోగుల వద్దకు వెళ్లి అందరి ఆరోగ్యం నయమవుతాయి, ధైర్యంగా ఉండండి..మీకు ఏమి కాదంటూ సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. బెడ్స్ వద్దకు వెళ్లి రెండు చేతులు జోడించి రోగులకు దండం పెట్టారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇతరుల ప్రాణాలను రక్షించడానికి వరంగల్ వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను సీఎం కేసీఆర్ కొనియాడారు. వైద్యులను అభినందించారు.