నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

బోనాల ఉత్సవాలకు రూ.90 కోట్ల నిధుల మంజూరు..

బోనాల ఉత్సవాలకు రూ.90 కోట్ల నిధుల మంజూరు..
  • ఇందులో రూ.75 కోట్లు బోనాల ఏర్పాట్ల నిర్వాహణ కోసం.. 
  • రూ.15 కోట్లు వివిధ ఆలయాలకు అర్ధిక సహాయం కోసం..
  • పాతబస్తీలో ఘనంగా బోనాల జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు
  • ఈ నెల 26, 27 తేధీలలో ప్రభుత్వం నుంచి చెక్కుల పంపిణీ
  • మూసి నదిపై లేజర్ షో కు అంగీకారం
  • పాతబస్తీ బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసాని సమావేశం..

ఆర్సీ న్యూస్,జూలై 12 (హైదరాబాద్): బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 90 కోట్ల నిధులను మంజూరు చేసిందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందులో రూ.75 కోట్లు బోనాల ఏర్పాట్ల నిర్వాహణ కోసం, రూ.15 కోట్లు వివిధ ఆలయాలకు అర్ధిక సహాయం అందజేస్తున్నామన్నారు. ఉత్సవాల నిర్వాహకులు తమ ప్రభుత్వం రాక మునుపు బోనాల పండుగ చేసుకోవాలంటే..చందా చేసే వారని..తమ ప్రభుత్వం వచ్చిన అనంతరం దేవాలయాలకు చెందిన ఉత్సవాల నిర్వాహకులకు నిధులను మంజూరు చేస్తున్నామన్నారు.  గోల్కొండ జగదాంబ అమ్మవారికి నిర్వహించిన మొదటి బోనంతో ఈసారి నగరంలో ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఇక పాతబస్తీలో బోనాల సందడి ప్రారంభంకానుంది. ఉత్సవాలలో భాగంగా ఈ నెల 23న పాతబస్తీలోని దేవాలయాలలో కలశ స్థాపనతో బోనాల హడావుడి మొదలవుతుంది. ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా సోమవాారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సాలార్జంగ్ మ్యూజియంలో ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.పాతబస్తీలో జరిగే బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. డ్రైనేజి మురికి నీటి సమస్యలు, వీధి దీపాలు వెలగకపోవడం, రోడ్ల మరమ్మత్తులు, ప్యాచ్ వర్క్స్ , మంచి నీటి సరఫరా తదితర సమస్యలు తలెత్తకుండా సంబందిత అధికారులు ఎప్పకిటప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాతబస్తీలో ఎక్కడ మంచినీటి సమస్యలు తలెత్తకుండా వారం రోజుల పాటు నిరంతరం నీటి సరఫరా కొనసాగించాలన్నారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ…దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ దేవాలయాలకు నిధులను కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బోనాల పండుగ సందర్బంగా గుళ్లకు నిధులను అందజేస్తున్నామన్నారు. పాతబస్తీలో గతేడాది కరోనా వైరస్ వ్యప్తి కారణంగా బోనాల జాతర ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయన్నారు. ఈసారి బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి ఉత్సవాల నిర్వహణ,దేవాలయాల వద్ద నిర్వహించే అభివృద్ది పనుల కోసం రూ.15 కోట్లు కేటాయించిందన్నారు. అమ్మవారి దేవాలయాలకు చెందిన ఉత్సవాల నిర్వాహకులకు ఈ నెల 26, 27 తేధీలలో ప్రభుత్వం నుంచి కేటగిరిల వారిగా చెక్కులను అందజేస్తామన్నారు. భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ మాట్లాడుతూ..రాష్ట్ర సాంస్కృతిక శాఖ నుంచి కళా బృందాలను పంపించాలన్నారు. కళాకారుల న్రుత్య ప్రదర్శనలు లేకపోతే..ఉత్సవాలలో మజా ఉండదని..తాము ఆదివారం గోల్కొండ అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన సందర్బంగా చివరి రోజు కళా బృందాలను రద్దు చేశారని మంత్రికి వివరించారు. దీనికి వెంటనే స్పందించిన మంత్రి తలసాని మాట్లాడుతూ..కరోనా వైరస్ కారణంగా కళాకారులు బోనాల జాతర ఉత్సవాలలో పాల్గొనడానికి భయపడుతున్నారన్నారు. మీకు తెలిసిన కళాకారులు ఎవరైనా ఉంటే..వారిని సంప్రదించండి..వారు వస్తానంటే మాకు చెప్పండి…వెంటనే పాతబస్తీలోని నాలుగు చోట్ల కళా బృందాలను ఏర్పాటు చేయిస్తానని ఆయన హమీ ఇచ్చారు. అంతేకాకుండా లాల్ దర్వాజ చౌరస్తాలోని దమయంతి టవర్స్ వద్ద ఎల్ఈడీ స్క్రీనింగ్ తో పాటు అఫ్జల్ గంజ్ లోని మూసి నదిపై లేజర్ షో నిర్వహించాలని ఉత్సవాల నిర్వాహకులు సూచించిన వెంటనే మంత్రి అంగీకరించారు. పాతబస్తీలో ఆగస్టు 1, 2 తేదీలలో ఎల్ఈడీ షో నిర్వహించాలని మంత్రి సంబందిత అధికారులకు సూచించారు. అలాగే 2వ తేదీన అఫ్జల్ గంజ్ లోని ఢిల్లీ దర్వాజ వద్ద మూసి నదిపై లేజర్ షో నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిం చారు. గతేడాది కోవిడ్ -19 ఆంక్షల నడుమ ఎలాంటి హడావుడి లేకుండా బోనాల జాతర ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కన్నుల పండువగా బోనాల జాతర ఉత్సవాలను నిర్వహించడానికి తగిన ముందు జాగ్రత్తలు ఎంతో అవసరమ న్నారు. ఉత్సవాల నిర్వాహకులు గాజుల అంజయ్య, రాకేష్ తివారీ, మధుసూదన్ యాదవ్, మదుసూదన్ గౌడ్, ప్యారసాని వెంకటేష్, కే.ఎస్.ఆనంద్ రావు, రాజారత్నం, పురానాపూల్ కిషన్, యాకుత్పురా బ్రహ్మణవాడికి చెందిన మహేష్ తదితరులు మాట్లాడుతు పలు సమస్యలను మంత్రి ద్రుష్టికి తీసుకు వచ్చారు.