ఏప్రిల్ 25, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

మొదలైన మొహర్రం సంతాప దినాలు..

మొదలైన మొహర్రం సంతాప దినాలు..
  • 68 రోజుల పాటు కొనసాగునున్న సంతాప దినాలు..
  •  ఈనెల 20న, బీబీ కా ఆలం ఊరేగింపు..
  •  అంబారీపై ఆలంతో సామూహిక ఊరేగింపు..
  •  దారి పొడవునా రక్తం చిందించనున్న షియా ముస్లింలు..

 

ఆర్పీ న్యూస్, ఆగస్టు 11 ( హైదరాబాద్): హజ్రత్ ఇమామ్ హుస్సేన్ సంస్మరణార్థం నిర్వహించే మొహరం సంతాపదినాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. షియా ముస్లింలు రాబోయే అరవై ఎనిమిది రోజుల పాటు నిర్వహించే సంతాప దినాలలో భాగంగా మొదటి రోజు బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు పాతబస్తీ తో పాటు నగరం లోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆషుర్ ఖానాలను ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే అవసరమైన మేరకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని దారుల్ షిఫా లోని అజా ఖానా జాహెరా, మదీనా లోని బాద్ షాహి ఆషుర్ ఖానా, పంజేషా లోని ఖద్మే రసూల్ తదితర ఆషుర్ ఖానా లలో షియా ముస్లిం ప్రజలు మొహర్రం మొదటి రోజును పురస్కరించుకొని మాతం, మజ్లీస్ నిర్వహించారు. నల్లటి దుస్తులు ధరించి ముస్లింలు హజరత్ ఇమామ్ హుస్సేన్ స్మరిస్తూ నిరసనలు తెలిపారు. ఆయన మరణాన్ని తాము ఎప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటూ మజ్లిస్, మాతం నిర్వహిస్తున్నారు. మొహర్రం మొదటి రోజును పురస్కరించుకొని డబీర్ పురా లోని బీబీ కా అలావాలో ప్రతిష్టించిన బీబీ కా ఆలం లకు బుధవారం పలువురు అధికార, అనధికార ప్రముఖులు పూలు దట్టీలు సమర్పించారు. దక్షిణ మండలం డిసిపి డాక్టర్ గజరావు భూపాల్ తో పాటు మీర్ చౌక్ ఏసీపీ ఆనంద్ తదితరులు బీబీ కా అలావాను సందర్శించి బీబీ కా ఆలంలకు పూలు, దట్టీలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మొక్కులు చెల్లించుకున్నారు. బీబీ కా అలావా ముత్తవల్లి రాషీద్ వారికి ఘనంగా స్వాగతం పలికారు. మొహర్రం సంతాపదినాల సందర్భంగా బీబీ కా అలావాను సందర్శించే షియా ముస్లింలతో పాటు పలువురికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికప్పుడు తగిన బందోబస్తు చర్యలను తీసుకుంటున్నట్లు డి సి పి డాక్టర్ గజరావు భూపాల్ తెలిపారు. బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు ఈనెల 20వ తేదీన కొనసాగుతుందని.. ఇందు కోసం అవసరమైన ఏర్పాట్లను  ఇప్పటి నుంచే చేస్తున్నామన్నారు. రాబోయే శుక్రవారం నిర్వహించే బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు సందర్భంగా అవసరమైన బందోబస్తు చర్యలను తీసుకుంటున్నామన్నారు. డబీర్ పురా నుంచి ప్రారంభమయ్యే సామూహిక ఊరేగింపు యాకుత్పురా దర్వాజా, కోట్ల అలీజా, చార్మినార్, గుల్జార్ హౌస్, మీరాలంమండి, పురాని హవేలీ, దారుల్ షిఫా ద్వారా చాదర్ ఘాట్ వరకు కొనసాగుతుందన్నారు. ఊరేగింపును పురస్కరించుకొని ఆయా రోడ్లలో అవసరం మేరకు సమయాను కూలంగా ట్రాఫిక్ ను దారి మళ్ళించడం జరుగుతుందన్నారు. అంబారీ పై బీబీ కా ఆలం ఊరేగింపు కొనసాగు తుందన్నారు. కాగా ముందుగా అనుకున్నట్లు ఈనెల 19వ తేదీన సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం దీనిని 20వ తేదీకి మార్చింది. కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటూనే ముస్లింలు మాతంలో పాల్గొనాలని డిసిపి కోరారు. డబీర్ పురా లోని బీబీ కా అలావా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. కేవలం షియా ముస్లిం ప్రజలే కాకుండా హిందువులు సైతం సందర్శించి బీబీ కా ఆలం లకు పూలు, దట్టీలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇరు వర్గాల ప్రజలు మొక్కలు చెల్లించుకుంటుండడంతో మొహర్రం సంతాపదినాలు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.ఊరేగింపు సందర్భంగా షియా ముస్లింలు దారి పొడవునా మాతం చేస్తూ రక్తం చిందించనున్నారు.