నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

అంతా గులాబీ మయం..సర్వం సిద్ధం

అంతా గులాబీ మయం..సర్వం సిద్ధం
  • సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సభకు తగిన ఏర్పాట్లు పూర్తి..
  • ఏర్పాట్లను ఇప్పటికే స్వయంగా పరిశీలించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
  • సభకు హాజరయ్యే పురుషులు గులాబిరంగు చొక్కా.. మహిళా ప్రతినిధులు గులాబీ రంగు చీరలు ధరించాలి.
  • ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమావేశం..

ఆర్సీ న్యూస్, అక్టోబర్ 25 (హైదరాబాద్): టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభకు హాజరయ్యే ప్రజా ప్రతినిధులు గులాబీ రంగు చొక్కాలు భరించాల్సి ఉంటుంది. పురుష ప్రతినిధులు గులాబీ రంగు చొక్కా.. మహిళా ప్రతినిధులు గులాబీ రంగు చీరలు ధరించి రావాలని ఇప్పటికే పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సభకు హాజరయ్యేందుకు ఉత్సాహం చూపిస్తున్న నాయకులందరూ గులాబీ రంగు దుస్తులపై దృష్టి సారించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ ఐ  సి సి )లో సోమవారం ఉదయం జరిగే టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ  నేపథ్యంలో జరిగే ఈ సభకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు మాదాపూర్లోని హైటెక్స్ లో తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాట్లను  స్వయంగా పరిశీలించారు. నగరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న సమావేశాల సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని ఇప్పటికే గులాబీ మయంగా మార్చేశారు. ప్రధాన వీధులతో పాటు అంతర్గత రోడ్ల లో కూడా టిఆర్ఎస్ పార్టీ జెండాలు ఏర్పాటు చేశారు. పార్టీ ప్రతినిధుల సభకు హాజరు కావడానికి ప్రజా ప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.ఈ ప్రతినిధుల సభలో పార్టీ అధ్యక్షుడి ఎన్నికతో పాటు ఏడు అంశాల తీర్మానాలే ఎజెండాగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధుల నమోదు, పార్కింగ్, భోజనం, ప్రాంగణంతో పాటు ఇతర అంశాల ఏర్పాట్లు ఈ ప్రతినిధుల సభలో చర్చించనున్నారు. ప్లీనరీ జరిగే హెచ్ఐసీసీ ప్రవేశ ద్వారాన్ని 150 మీటర్ల వెడల్పు 40 అడుగుల ఎత్తులో ఇప్పటికే నిర్మించారు. సభా వేదికపై కాలేశ్వరం ప్రాజెక్టు నమూనాను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జీవిత చరిత్ర, ఏడేళ్ల ప్రభుత్వ పాలన, ఉద్యమ ఘట్టాలు.. తదితర అంశాలకు సంబంధించిన వేలాది ఫోటోలతో కూడిన ఎగ్జిబిషన్ను కూడా ప్లీనరీలో భాగంగా ఇప్పటికే ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మండల, రాష్ట్ర ప్రజా ప్రతినిధులు,పార్టీ ముఖ్య బధ్యుల తో కలిపి సుమారు ఆరు వేల మందికి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. వీరితో పాటు వాలంటీర్లు, పోలీసులు, మీడియా, ఇతర సహాయ సిబ్బంది ఇలా మొత్తం దాదాపు పది వేల మంది ప్లీనరీకి హాజరయ్యే అవకాశం ఉండదని టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అంచనా వేసింది. ఈ సమావేశానికి హాజరయ్యే వారికోసం 20 రకాల మాంసాహార, శాకాహార వంటకాలు ఆదివారం రాత్రి నుంచే సిద్ధం చేస్తున్నారు. సభా ప్రాంగణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అతి పెద్ద కట్ ఔట్ ను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రతినిధి సభకు హాజరయ్యేందుకు ఆహ్వానం అందుకున్న ప్రజాప్రతినిధులు సోమవారం ఉదయం 10 గంటల నుంచే సభా ప్రాంగణానికి చేరుకుని గుర్తింపు కార్డును ముందుగా పొందాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్లీనరీ ప్రారంభం కానుండగా..

పార్టీ అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తొలుత ప్రకటించనున్నారు.

అనంతరం 7 తీర్మానాలపై ప్రసంగాలు కొనసాగి సాయంత్రం 6 గంటలకు ప్లీనరీ ముగుస్తుంది. ఈ సమావేశానికి హాజరు కావడానికి నగరంలోని ప్రజా ప్రతినిధులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు సీనియర్ టిఆర్ఎస్ నాయకులు సమావేశం జరిగే ప్రాంగణానికి వెళ్లి అంచెల వారిగా ఏర్పాట్లను పరిశీలించారు.