- తగిన జాగ్రత్తలు అవసరమంటున్న పోలీసులు..
- మీ ఇంటి పక్క వారితో పాటు సంబంధిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలి..
- పోలీసుల నెంబర్ అందుబాటులో ఉంచుకోండి..
- తగిన జాగ్రత్తలు తీసుకుంటే దొంగతనాల నుంచి తప్పించుకోవచ్చు..
ఆర్సీ న్యూస్, జనవరి 08 (హైదరాబాద్): సంక్రాంతి పండుగ వచ్చింది అంటే పిల్లాపాపలతో కలిసి ఊరెళ్ళడం మామూలే. ఇక హైదరాబాద్ నుండి సొంత ఊళ్లకు వెళ్లేందుకు అప్పుడే చాలామంది సిద్ధమైపోయారు. అయితే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. మీరు హాయిగా ఊరెల్లి ఎంజాయ్ చేద్దామంటే ఇక్కడ దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు బీ కేర్ ఫుల్ అంటూ జాగ్రత్తలు చెబుతున్నారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పలు సూచనలు చేస్తున్నారు. సంక్రాంతి వచ్చింది అంటే సగం హైదరాబాద్ ఖాళీ అవుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. పండగ మూడు రోజులు కుటుంబ సమేతంగా ఊరికి వెళ్లి సరదాగా గడిపేందుకు ముందు నుండి అందరూ ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇదే సమయంలో దొంగలు కూడా తమ చోరకళను ప్రదర్శించేందుకు అనువైన సమయంగా భావిస్తుంటారు. తాళం వేసే ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుంటారు. అందుకే ఊరెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఇళ్లకు తాళం వేసి వెళ్లడమే కాకుండా పక్కవారికో లేదంటే పోలీసులకో సమాచారం ఇచ్చి వెళ్లాలని అంటున్నారు.
సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నారు సైబరాబాద్ పోలీసులు.
ప్రజలను అప్రమత్తం చేస్తూ.. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రజలకు పలు సూచనలు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో పోలీసులు, కార్పొరేట్ కంపెనీల సీఎస్ఆర్ సహకారంతో ఇప్పటికే లక్షలాది సీసీ కెమెరాలను ఇన్ స్టాల్ చేశారు. అన్ని కాలనీల్లోనూ కమ్యూనిటి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, సూచిస్తూనే ఉన్నారు పోలీసులు. ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చు కోవాలని తద్వారా నేర నియంత్రణకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
మీరు ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించమని కోరాలని, విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టకుండా జాగ్రత్తగా దాచుకోవాలని సూచిస్తున్నారు. ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలని, రోడ్లపై నిలుపరాదని, అలాగే బీరువా తాళాలను ఇంట్లో ఉంచకుండా, తమతో పాటే తీసుకెళ్లాలని, ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలని లేదంటే దొంగలకు మనమే ఇంట్లో ఎవరూ లేరని ఇండికేషన్ ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలని, ఎక్కువ రోజులు విహార యాత్రల్లో ఉంటే పేపర్, పాల వారిని రావద్దని చెప్పాలని, పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలని అలా చేయడం వల్ల దొంగల దృష్టి మరల్చ వచ్చంటున్నారు పోలీసులు. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదని, ఆరుబయట వాహనాలకు హాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ వేయాలని సూచిస్తున్నారు. వాచ్ మెన్ తో పాటుగా తమ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, చోరీలు జరగకుండా ఉంటుందని, అనుకోకుండా జరిగిన నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం క్షేమమని, లేదా ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లే వారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. అప్రమత్తతోనే చోరీలకు అడ్డుకట్ట వేయవచ్చని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్ నెంబర్ 94906 17444 కు సమాచారం ఇవ్వాలి.
More Stories
బహదూర్ పురా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ..
చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ..
సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగరావు మృతి..