ఆర్సీ న్యూస్ ( హైదరాబాద్): రంజాన్ పండుగ,శ్రీ మహాత్మా బసవ జయంతి వేడుకలు,అక్షయ తృతీయ..ఇలా మూడు కార్యక్రమాలు ఒకే రోజు వచ్చాయి. వీటిపై కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా పడింది. ఎలాంటి హడావుడి లేకుండా నిరాడంబరంగా జరిగాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంతో పూర్తిగా సహకరిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా వైరస్ సోకకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ..ఏదో చిన్న పొరపాటు జరగడంతో చాలా మంది కరోనా వైరస్ బారిన పడి వైద్యం కోసం ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..తమకు కరోనా వైరస్ సోకింది ఎలా..? అంటూ మదనపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు.ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో పండుగలు..పబ్బాలు అంటూ ప్రజలు హడావుడి చేయడం లేదు. తమ సంస్కృతి,సంప్రదాయాలకు అనుగుణంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడికి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటు అతి కొద్ది మందితో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ పండుగలను నిర్వహించుకుంటూ సహకరిస్తున్నారు. శుక్రవారం మూడు కార్యక్రమాలు ఇలాగే జరిగాయి. ఒకటి..రంజాన్ పండుగ, రెండు..శ్రీ మహాత్మా బసవ జయంతి వేడుకలు, మూడు..అక్షయ తృతీయ..ఇలా మూడు కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. పరిస్థితులు బాగా లేనందున అన్ని వర్గాల ప్రజలు హుందాగా వ్యవహరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉత్సవాలను నిర్వహించారు. ఉత్సవాలు,పండుగలన్నీ ఇళ్లకే పరిమితమయ్యాయి. ఎక్కడ నిబంధనల బేఖాతరు జరుగలేదు. రాష్ట్ర ప్రజలు ఎంతో సంయమనంతో వ్వహరించారు.ఎక్కడా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించ లేదు. ప్రజల సహకారానికి పోలీసు బాస్ లతో పాటు ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు ధన్యవాదాలు తెలిపారు.
కుటుంబ సభ్యులతో ఇళ్లలోనే ఈద్-ఉల్-ఫితర్ పండుగ వేడుకలు…
రంజాన్ పండుగను ముస్లింలు శుక్రవారం ఇళ్లలోనే నిర్వహించారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రముఖ ఈద్గా లో సామూహిక ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీ.అయితే ఈసారి అలాంటి పరిస్థితులు లేవు. రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నందున ఈద్గా లో సామూహిక ప్రార్థనలకు అవకాశం లేకపోవడంతో శుక్రవారం తమ తమ ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకోవడం తో పాటు సమాజాన్ని రక్షించడానికి ఈద్-ఉల్-ఫితర్ పండుగ ప్రార్థనలు ఇళ్లలోనే నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం సూచించడంతో ముస్లింలు పూర్తిగా సహకరించారు. గత నెల 14న రంజాన్ మాసం షురూ అయ్యింది. అప్పటి నుంచి ఈ నెల 13వ వరకు వరుసగా నెల రోజుల పాటు రోజంతా ఐదుసార్లు నమాజ్ చేసిన ముస్లింలు సాయంత్రం ఇఫ్తార్ విందుతో ఉపవాసాలు వదిలారు. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో అల్ విధా జుమ్మా సామూహిక ప్రార్దనలు సాధారణంగా జరిగాయి. అలాగే రంజాన్ మాసం చివరి రోజైన శుక్రవారం ఈద్-ఉల్-ఫితర్ పండుగను ముస్లింలు తమ తమ ఇళ్లలోనే భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు.
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతోత్సవాలు కూడా ఇళ్లలోనే…
రాష్ట్రంలోని కన్నడీగులు ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించుకునే శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలను ఈసారి నిరాడంబరంగా ఇళ్లకే పరిమితం చేశారు. బసవ జయంతి వేడుకలను గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రవీంద్ర భారతిలో నిర్వహిస్తు వస్తోంది. గతేడాదితో పాటు ఈసారి కూడా జయంతి వేడుకలను అధికారికంగా రవీంద్రభారతిలో నిర్వహించ లేదు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంతో పాటు లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ఈసారి బసవేశ్వరుని 888 జయంతి వేడుకలకు అధికారికంగా ఫుల్ స్టాఫ్ పడింది. అంతేకాకుండా కన్నడీగులందరూ వేడుకలను తమ తమ ఇళ్లలోనే భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను నిర్వహిాంచారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విడుదల చేసిన సర్క్యూలర్ ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలలో సంబందిత అధికారులు బసవేశ్వరుని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
అక్షయ తృతీయ అంతే…వెలవెలబోయిన బంగారం దుకాణాలు..
అక్షయ తృతీయ సందర్బంగా మహిళలు ఎంతో కొంత బంగారాన్ని ఖరీదు చేసి ఇంటికి లక్ష్మి దేవీని తీసుకొస్తున్నట్లు భావిస్తారు. ఇందు కోసం బంగారాన్ని ఖరీదు చేయడానికి బంగారు ఆభరణాల దుకాణాలను ఆశ్రయిస్తారు. డబ్బున్న వారు అధికంగాను..మద్యతరగతి వారు తక్కువగా ఖరీదు చేసి ఇంటికి తెచ్చుకుంటారు. దీంతో బంగారు ఆభరణాల దుకాణాలు వినియోగదారులతో కళకళలాడుతాయి. వ్యాపారస్తులకు గిరాకీ కూడా భాగానే ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తితో పాటు లాక్ డౌన్ కొనసాగుతుండడంతో బంగారు ఆభరణాల దుకాణాలకు గిరాకీ తగ్గింది. తగ్గడం కాదు..అసలు లేనే లేదని చెప్పాలి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నగరంలోని బంగారు దుకాణాలు తెరిచినప్పటికీ..గిరాకీ లేక వెలవెలబోయాయి.
1 thought on “రంజాన్..బసవ జయంతి..పై కరోనా ప్రభావం …”