ఆర్సీ న్యూస్ (హైదరాబాద్): కరోనా వైరస్ సోకిన రోగులలో సీఎం కేసీఆర్ మనోధైర్యం నింపారు. కేవలం మాస్క్ మాత్రమే ధరించారు. ఎలాంటి పీపీఈ కిట్స్ వాడకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కోవిడ్ రోగులను పరామర్శించారు. కరోనా వైరస్ సోకి గాంధీ ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగులను సీఎం కేసీఆర్ బుధవారం పలకరించారు. వారికి మనోధైర్యం చెప్పారు. వారిలో మనోధైర్యాన్ని నింపారు. వ్యాధి సోకినప్పటికీ..ధైర్యంగా ఉంటే తమకు ఎలాంటి ఆపదలు ముంచుకు రావని ఆయన రోగులకు చెప్పకనే ధైర్యం చెప్పారు. సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించిన ఆయన ఆస్పత్రిలో అన్ని విభాగాలను పరిశీలించారు. కరోనా బాధితులకు ఇక్కడ అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు. కరోనా రోగుల బెడ్ వద్దకు వెళ్లి బాధితుల యోగ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ సోకితే..చాలా వరకు బంధు,మిత్రులతో పాటు స్వంత కుటుంబ సభ్యులు కూడా ఎవరూ బాధితులకు దగ్గరగా కూడా వెళ్లడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ పీపీఈ కిట్లు వేసుకోకుండానే గాంధీ ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి బాధితులను పరామర్శించారు. వారికి ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయనే విషయాలను బాధితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా సంబంధిత వైద్యులను ఆరా తీశారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా కొంతమంది రోగులు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. బాధితులు చెబుతున్న సమస్యలు సావధానంగా విన్న కేసీఆర్..అక్కడే విధి నిర్వహణలో ఉన్న వైద్యులను ఆయా సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఐసియు,ఎమర్జెన్సీ, అవుట్ పేషంట్ వార్డు, జనరల్ వార్డులో కేసీఆర్ పరిశీలించారు. ఆయా వార్డులో వైద్య సేవలు పొందుతున్న వారి వద్దకు వెళ్లి ‘‘ అధైర్య పడొద్దు..పుకార్లను నమ్మొద్దు..మానసిక ధైర్యం చాలా గొప్పది. అందరి ఆరోగ్యాలు నయమవుతాయి, ధైర్యంగా ఉండండి..మీకు ఏమి కాదనే నమ్మకం ఎంతో అవసరం..ఇక్కడ వైద్య సిబ్బంది అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తున్నారు..దండం..’’ అంటూ సీఎం కేసీఆర్ కరోనా వైరస్ బాధితులకు ధైర్యం చెప్పారు.
బెడ్స్ వద్దకు వెళ్లి రెండు చేతులు జోడించి రోగులకు దండం పెట్టారు. కొంత మంది బాధితులు వారి సమస్యలను ఆయనకు తెలిపారు. అన్నింటి కన్నా గొప్పది..మానసిక ధైర్యమని ఆయన వారిలో భరోసా కలిగించారు. దాదాపు గంట వరకు ఆయన గాంధీ ఆసుపత్రిలో గడిపారు. ఎలాంటి హడావుడి లేకుండా ఆయన పర్యటన కొనసాగింది. జూనియర్ డాక్టర్లు వారి సమస్యలను సీఎంకు వివరించారు. వారితో పాటు కాంటాక్ట్ నర్సులు సైతం తమ గోడును సీఎం ముందు వెళ్లగక్కారు. దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అక్కడే ఉన్న గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీనియర్ డాక్టర్స్ తో పాటు జూనియర్ డాక్టర్స్, కాంటాక్ట్ నర్సుల సేవలు ఆయన కొనియాడారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇతరుల ప్రాణాలను రక్షించడానికి వారు చేస్తున్న సేవలను అభినందించారు. తప్పనిసరిగా మీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జూనియర్ డాక్టర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా తాజాగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ పని తీరును ఆయన పరిశీలించారు. సీఎం ఆదేశాల మేరకు నిముషానికి 2000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే విధంగా గాంధీలో ఏర్పాటు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నట్లు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు సీఎంకు వివరించారు. మొత్తం మీద కరోనా వైరస్ సోకి మెరుగైన వైద్య సేవలు పొంది పూర్తిగా ఆరోగ్యంగా కోలుకున్న సీఎం కేసీఆర్ బాధితుల వద్దకు దగ్గరగా వెళ్లి వారిలో మనోధైర్యం కల్పించడం పట్ల సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దండాలయ్యా..అంటూ నెటిజన్లు సీఎం కేసీఆర్ ను కొనియాడుతున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ తదితరులున్నారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పర్యవేక్షణలో గట్టి బందోబస్తు కొనసాగింది.
1 thought on “రోగుల్లో మనోధైర్యం నింపిన సీఎం కేసీఆర్…”