నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

దేశానికే ఆదర్శంగా హైదరాబాద్ యువత

దేశానికే ఆదర్శంగా హైదరాబాద్ యువత
  • ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ జీవితంలో స్థిరపడాలి..
  • సత్ఫలితాలిస్తున్న జాబ్ మేళాలు..
  • పాతబస్తీలో జరిగిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన..
  • 4000 మంది దరఖాస్తు చేసుకోగా.. 1000 మందికి లభించిన ఉద్యోగాలు.
  • జాబ్ మేళాలో నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్.

ఆర్సీ న్యూస్, నవంబర్ 27 (హైదరాబాద్): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దక్షిణ మండలం పోలీసులు శనివారం పాతబస్తీలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు నిరుద్యోగులైన యువతీ యువకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. దాదాపు 20 కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 20 కంపెనీల నుంచి 2000 ఉద్యోగాలను నిరుద్యోగులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగం కావాలంటూ 4 వేల మంది యువతీ యువకులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 1000 మందికి ఉద్యోగ అవకాశం లభించింది. జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఎంపికైన 1000 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు. నగరంలోని అన్ని జోన్ల పరిధిలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గత మూడేళ్లలో నగరంలోని అన్ని జోన్ లలో ఇప్పటివరకు 21 వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అంతేకాకుండా ఇటీవల నిరుద్యోగ మహిళల కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించి అర్హులైన మహిళలకు ఉద్యోగాలు కల్పించారు. దక్షిణ మండలం లోని మహిళా పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన ఈ స్పెషల్ జాబ్ మేళా కార్యక్రమానికి నిరుద్యోగ మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది. శనివారం జాబ్ మేళాను ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీ యువకులు జీవనోపాధి కల్పించడం కోసం నగరంలోని అన్ని ప్రాంతాల్లో జాబ్ మేళా నిర్వహించి వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళా లను అర్హులైన నిరుద్యోగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ.. అప్పుడప్పుడు ప్రజలకు ఎదురయ్యే సమస్యలను సైతం పోలీసులు పట్టించుకోని ఆయా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నా మన్నారు. రాష్ట్రం లోని ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతూనే ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరాభివృద్ధికి తోడ్పడాలన్నారు. హైదరాబాదు నగరంలోని యువత దేశానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు తమ విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా జీవితంలో స్థిరపడాలన్నారు. ఉన్నత విద్యా భ్యాసం చేసి జీవనోపాధి కోసం ప్రయత్నించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీ.ఎన్.ఐ గ్రూప్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ అర్చన, సి ఎ ఆర్ హెడ్ క్వార్టర్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్, దక్షిణ మండలం డిసిపి డాక్టర్ గజరావు భూపాల్, దక్షిణ మండలం అడిషనల్ డిసిపి సయ్యద్ రఫీక్, దక్షిణ మండలం డిసిపి ట్రాఫిక్ రాములు నాయక్, ఫలక్ నూమా ఏసిపి మాజీద్ తదితరులు పాల్గొన్నారు.