నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

పాతబస్తీలో కన్నుల పండువగా బోనాల పండుగ

పాతబస్తీలో కన్నుల పండువగా బోనాల పండుగ
  • పాతబస్తీతో పాటు నగరంలో అమ్మవారికి ఘనంగా బోనాల సమర్పణ..
  • సందడి చేసిన సినీ కళాకారులు..రాజకీయ నాయకులు..మంత్రులు
  • 2న,పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపుకు ఏర్పాట్లు పూర్తి
  • ఊరేగింపుకు గట్టి బందోబస్తు…నగర పోలీసు కమిషనర్ నుంచి హోం గార్డు ఆఫీసర్ల వరకు..
  • అంబారిపై అక్కన్న మాదన్న దేవాలయానికి చెందిన అమ్మవారి ఘటం..
  • పాతబస్తీలో ఊరేగింపు సందర్బంగా ట్రాఫిక్ దారి మళ్లింపు..
  • ఊరేగింపు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకున్న ఉత్సవాల నిర్వాహకులు

 

ఆర్సీ న్యూస్, ఆగస్టు 01(హైదరాబాద్): నగరంలో ఆదివారం బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పలువురు అధికార,అనధికార ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిణి దేవాలయంతో పాటు ఇతర దేవాలయాల వద్ద వీఐపీ తాకిడి ఎక్కువైంది. హర్యాణ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ మహమూద్ అలీ తదితరులు అమ్మవారి దేవాలయాను సందర్శించి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తో పాటు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, టీపీసీసీ కార్యదర్శి కె.ఎస్.ఆనంద్ రావు తదితరులు పాతబస్తీ పూజలలో పాల్గొన్నారు. మీరాలంమండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయంలో సినీ కళాకారులు సందడి చేశారు. సినీ నటి అర్చన, సినీ గాయకులు రాహుల్ సిప్లిగంజ్, మధు ప్రియా, జబర్దస్థ్ హాస్య కళాకారులు రచ్చ రవి, జీవన్ లతో పాటు గబ్బర్ సింగ్ టీం కళాకారులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు. టీఎస్ బసవ కేంధ్రం అధ్యక్షులు నాగ్ నాథ్ మాశెట్టి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబస్తీతో పాటు నగరంలోని పలు ప్రాంతాలో బోనాల పండుగ ఉత్సవాలు  ఆదివారం తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు కన్నుల పండువగ ఘనంగా కొనసాగాయి. పాతబస్తీలో జరిగే బోనాల జతర ఉత్సవాలకు లాల్ దర్వాజ బోనాలుగా పేరుంది. పాతబస్తీలో లాల్ దర్వాజ,ఉప్పుగూడ, గౌలిపురా, సుల్తాన్ షాహీ, బేాల ముత్యాలమ్మ, హరిబౌలి ( బంగారు మైసమ్మ, అక్కన్న మాదన్న) మీరాలంమండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయాలతో కలిసి 8 ప్రధాన దేవాలయాలు, 25 ఉమ్మడి దేవాలయాలున్నాయి. ఈ అమ్మవారి దేవాలయాలలో కొలువుదీరిన అమ్మవార్లకు ఎన్నోదశాబ్దాలుగా స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు  పూజలు నిర్వహిస్తున్నారు. బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వంతో పాటు ఉత్సవాల నిర్వాహకులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంసృతి, సంప్రదాలకు అనుగుణంగా నగరంలో అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎనిమిది వేల మంది పోలీసు అధికారులతో బందోబస్తు నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తో పాటు సీనియర్  ఐపీఎస్ అధికారులు బోనాల జాతర ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షించారు.  బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఇప్పటికే గొల్కొండ జగదాంబ అమ్మవారి బోనాలతో పాటు నార్త్ జోన్ లోని సికింద్రబాద్ ఉజ్జయినీ మహాంకాళి దేవాలయంలో అమ్మవారికి బోనాల సమర్పణ అంగరంగ వైభవంగా జరిగాయని.. ప్రస్తుతం నగరంతో పాటు పాతబస్తీలో ఆదివారం ఉదయం నుంచి బోనాల జాతర ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయన్నారు. ఇందుకోసం భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఇప్పటికే తగిన ఏర్పాట్లు జరిగాయన్నారు. 

సోమవారం పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు..

ఆగస్టు 2న,పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు ఉంటుందన్నారు. అమ్మవారి ఘటాల సామూ హిక ఊరేగింపును పురస్కరించుకుని నగర పోలీసు కమిషనర్ స్థాయి నుంచి హోం గార్డు ఆఫీసర్ల వరకు  అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు బందోబస్తు నిర్వహిస్తారు. సోమవారం పాతబస్తీలో నిర్వహించే అమ్మవారి ఘటాల ఊరేగింపు సందర్బంగా ట్రాఫిక్ దారి మళ్లింపు ఉంటుంది. ఆగస్టు 2న,( సోమవారం) పాతబస్తీ వీధుల్లో నిర్వహించే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బోనాల జాతర ఉత్సవాలను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఘటాల ఊరేగింపును సెలవు దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఇచ్చే సెలవు పాతబస్తీలో జరిగే జాతర రోజు కావడంతో పాతబస్తీ బోనాల జాతర ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆగస్టు 2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఉత్సవాల నిర్వాహకులు కళాకారులు,శకటాలను ఏర్పాటు చేయనున్నారు. పాతబస్తీలో గతేడాది కరోనా  వైరస్ కారణంగా అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు నిరాడంబరంగా కొనసాగింది. భక్తుల హడావుడి లేకుండా మూసి నది వరకు కొనసాగిన ఊరేగింపు సాదా సీదాగా జరిగింది. ఈసారి అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించడానికి సిద్దమయ్యారు.