- లాల్ దర్వాజ సింహవాహిణి దేవాలయం వద్ద సీపీ అంజనీకుమార్ పూజలు నిర్వహించారు.
- అక్కన్న మాదన్న దేవాలయంలో జరిగిన పూజలలో గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.
- పాతబస్తీలో జరిగిన పూజలలో బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయం ఈవో అన్నపూర్ణ పాల్గొన్నారు.
- ఈసారి ఘనంగా ప్రారంభమైన బోనాల జాతర ఉత్సవాలు..
- తగిన ఏర్పాట్లు చేసిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి
- ఈ నెల 23 నుంచి వచ్చే నెల 2 వరకు పాతబస్తీలో ఘనంగా బోనాలు: బల్వంత్ యాదవ్
ఆర్సీ న్యూస్, జూలై 23 (హైదరాబాద్): పాతబస్తీలో శుక్రవారం ఉదయం జరిగిన కలశ స్థాపన తో ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రాంరంభమయ్యాయి. అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్దలతో ప్రారంభమైన బోనాల జాతర ఉత్సవాలలో పలువురు అధికార,అనధికార ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరిగే బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని సంబందిత దేవాలయాల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. పూజల సందర్బంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉత్సవాల నిర్వాహకులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన బోనాల జాతర ఉత్సవాలతో పాతబస్తీలో ఎక్కడ చూసినా ఆథ్యాత్మిక వాతావరణం నెలకొంది. లాల్ దర్వాజ సింహవాహిణి మహాంకాళి దేవాలయంలో జరిగిన పూజా కార్య క్రమంలో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ హాజరై ఆలయ ద్వాజారోెహణం, శిఖర పూజలు చేసి బోనాల జాతర ఉత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బి.బల్వంత్ యాదవ్, దేవాలయం కమిటి చైర్మన్ కె.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. హరిబౌలిలోని అక్కన్న మాదన్నమహాంకాళి దేవాలయంలో జరిగిన పూజలలో గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొని పూజలు నిర్వహించారు. పూజలను పురస్కరించుకుని దేవాలయంలో సామూహిక కుంకుమార్చన ఘనంగా జరిగింది. గౌలిపురా, ఉప్పుగూడ, మీరాలంమండి మహాంకాళి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఈవో అన్నపూర్ణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్య క్రమాలలో దేవాలయం కమిటి ప్రతినిధులు మల్లేశం గౌడ్, కె.ఎస్.ఆనంద్ రావు, జనగామ మధుసూదన్ గౌడ్, గాజుల అంజయ్య, ఊరేగింపు కమిటి ప్రధాన కార్యదర్శి ఎం. మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొని ఆలయ మర్యాదలతో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. సుల్తాన్ షాహీ జగదాంబ దేవాలయంలో జరిగిన పూజల్లో ఆలయ కమిటి చైర్మన్ రాకేష్ తివారీసందడి మొదలైంది. హరిబౌలిలోని బంగారు మైసమ్మ దేవాాలయం, కోట్ల అలీజా లోని కోట మైసమ్మ దేవాలయంలో పూజలు ఘనంగా జరిగాయి. గతేడాది కోవిడ్ -19 ఆంక్షల నడుమ ఎలాంటి హడావుడి లేకుండా జరిగిన బోనాల జాతర ఉత్సవాలు శుక్రవారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. భక్తులెవరు లేకుండా ఇళ్లల్లోనే అమ్మవారికి బోనాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో నగరంలోని అన్ని ప్రాంతాలలో భక్తులు ప్రభుత్వ ఆంక్షలను పాటిస్తూ అమ్మవారికి భక్తి శ్రద్దలతో బోనాలను సమర్పించారు. అయితే ఆషాడ మాసం మొత్తం నెల రోజుల పాటు బోనాల జాతర ఉత్సవాలు జరిగాయి. భక్తులు తమ తమ ఇళ్లల్లోనే అమ్మవారికి బోనాలు సమర్పించినప్పటికీ..దేవాలయ కమిటి ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆయా దేవాలయాలలో అమ్మవారికి బోనం సమర్పించారు. అయితే ఈసారి ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో బోనాల జాతర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభ మయ్యాయి. అమ్మవారి భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాజా భజంత్రీల నడుమ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కొనసాగాయి.ఈ నెల 25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ ఉంటుంది.
అదే రోజు పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు ఉంటుంది. శాలిబండ లోని కాశీవిశ్వనాథ్ దేవాలయం నుంచి పాతబస్తీలోని అమ్మవారి ఘట స్థాపన ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఊరేగింపు అనంతరం ఆయా దేవాలయాలలో అమ్మవారి ఘట స్థాపన జరుగుతుంది. ఆగస్టు 1వ తేదీన నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్ఫన కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తి శ్రద్దలతో జరుగు తుంది. ఆగస్టు 2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు కొనసాగు తుంది.
More Stories
బహదూర్ పురా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ..
చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ..
సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగరావు మృతి..