- జూలై 11న ప్రారంభమైన ఉత్సవాలు..
- ఆగస్టు 2తో..ముగింపు..
- ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో బుధవారం ముగింపు సమావేశం
- ముగింపు సమావేశానికి హాజరైన ఫలక్ నుమా ఏసీపీ
- హాజరైన దేవాలయాల కమిటి ప్రతినిధులు
- ఏసీపీ, ఇన్స్ పెక్టర్ తో పాటు కమిటి ప్రతినిధులకు సన్మానాలు
- సహకరించిన వారికి ధన్యవాదాలు: ఊరేగింపు కమిటి అధ్యక్షులు బల్వంత్ యాదవ్
ఆర్సీ న్యూస్, ఆగస్టు 4 (హైదరాబాద్): ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన దేవాలయాలలో భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. అనంతరం సోమవారం పాతబస్తీలో అంగరంగ వైభవంగా అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. పాతబస్తీలోని ఎనిమిది ప్రధాన దేవాలయాలతో పాటు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీలోని 25 దేవాలయాలలో కొన్ని దేవాలయాలకు చెందిన అమ్మవారి ఘట్టాలు ఈ సామూహిక ఊరేగింపులో పాల్గొన్నాయి. అనంతరం బుధవారం ఆషాడమాసం బోనాల జాతర ఉత్సవాలు ముగింపు సమావేశం చంపాపేట్ లోని లక్ష్మీ గార్డెన్ జరిగింది. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ ఆధ్వర్యంలో ముగింపు సమావేశం జరిగింది. మారు బోనంగా పిలువబడే ఈ ముగింపు సమావేశంలో పాతబస్తీకి చెందిన పలువురు అధికార అనధికార ప్రముఖులు పాల్గొన్నారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన ముగింపు సమావేశానికి ఫలక్ నుమా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహ్మద్ అబ్దుల్ మజీద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు ఛత్రినాక ఇన్స్ పెక్టర్ జిలాని, జిహెచ్ఎంసి చార్మినార్ జోన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు, గౌలిపుర మహంకాళి దేవాలయం కమిటీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, సుల్తాన్ షాహీ జగదాంబ దేవాలయం కమిటీ చైర్మన్ రాకేష్ తివారి, మీరాలంమండి శ్రీ మహాకాళేశ్వర దేవాలయం కమిటీ చైర్మన్ గాజులు అంజయ్య, లాల్ దర్వాజ సింహవాహిని దేవాలయం కమిటీ చైర్మన్ కె. వెంకటేష్, ఉప్పుగూడ మహంకాళి దేవాలయం కమిటీ చైర్మన్ జనగామ మధుసూదన్ గౌడ్, కోట మైసమ్మ దేవాలయం కమిటీ అధ్యక్షులు రాయికోట్ బాబు రాజా లతోపాటు భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఉపాధ్యక్షులు ఎస్ ఆనందరావు, కార్యదర్శి గాజుల రాహుల్ తదితరులు హాజరయ్యారు. జూలై 11వ తేదీన గోల్కొండలోని జగదాంబ అమ్మవారి కి సమర్పించిన బోనాలతో ఈసారి ఆషాడమాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బంగారు బోనం సమర్పించారు. సప్తమాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా 7 అమ్మవారి దేవాలయాలకు 7 బంగారు బోనాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈసారి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ అధ్యక్షులు భక్తుల ఆధ్వర్యంలో అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో బంగారు బోనం సమర్పించారు. మొదటి బోనంగా గోల్కొండ అమ్మవారికి, రెండో బోనంగా బల్కంపేట అమ్మవారి కి, మూడో బోనంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి, నాలుగో బోనంగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లికి, ఐదు బంగారు బోనంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, ఆరో బంగారు బోనంగా చార్మినార్ లోని శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారికి, ఏడో బోనంగా లాల్ దర్వాజా లోని సింహవాహిని అమ్మవారికి భక్తులు అంగరంగ వైభవంగా బంగారు బోనాన్ని సామూహిక ఊరేగింపుగా తరలించి నైవేద్యం సమర్పించారు. ఇలా జూలై 11వ తేదీన ప్రారంభమైన సప్తమాతృకలు కార్యక్రమాలు జూలై 30వ తేదీ తో ముగిసాయి. ఆనవాయితీ ప్రకారం మరో బంగారు బోనం ని మీరాలంమండి లోని శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం అమ్మవారికి సమర్పించారు. ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా జూలై 23 వ తేదీన పాతబస్తీలోని అన్ని అమ్మవారి దేవాలయాలలో ఉత్సవాల నిర్వాహకులు భక్తులు కలశ స్థాపన చేశారు. అభిషేకం తదితర పూజా కార్యక్రమాలతో ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను ప్రారంభించారు. జూలై 25 వ తేదీన సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు కన్నుల పండుగగా బోనాల జాతర ఉత్సవాలను నిర్వహించారు. ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర రోజే పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శాలిబండ లోని కాశి విశ్వనాథ దేవాలయం నుంచి అమ్మవారి ఘట స్థాపన ఊరేగింపు 25వ, తేదీన సాయంత్రం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. లాల్ దర్వాజ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుంచి పలువురు అధికార,అనధికార ప్రముఖులు అమ్మవారి ఘట్టాలకు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో ముఖ్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, టి పి సి సి కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, టీపిసిసి కార్యదర్శి, ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఉపాధ్యక్షులు కె ఎస్ ఆనంద్ రావు, గౌలిపుర కార్పొరేటర్ ఆలే భాగ్య లక్ష్మి తదితరులు పాల్గొని అమ్మవారి ఘట్టాలకు స్వాగతం పలికారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు భక్తుల బల్వంత్ యాదవ్ ఆధ్వర్యంలో అమ్మవారి ఘట స్థాపన ఊరుగింపు కొనసాగింది. ఊరేగింపు అనంతరం ఆయా దేవాలయాలలో అమ్మవారి ఘట్టాలను స్థాపించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూలై 25 వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు రెండో తేదీన పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు అత్యధిక సంఖ్యలో సామూహిక ఘటాల ఊరేగింపు ను తిలకించడానికి చార్మినార్ కు చేరుకున్నారు. ఘటాల ఊరేగింపు కళాకారులు ఆకట్టుకునే రీతి లో ఉన్నా శకటాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కళా బృందాలు చేసిన నృత్యాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఇలా జూలై 11వ తేదీన ప్రారంభమైన ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ఆగస్టు రెండో తేదీతో ముగిశాయి. ఈ ముగింపు సమావేశాన్ని బుధవారం ఊరేగింపు కమిటీ లక్ష్మీ గార్డెన్ లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏసీపీ మాట్లాడుతూ… తాను చిన్నప్పటినుంచి గ్రామీణ వాతావరణంలో పెరిగానని తనకు బోనాల జాతర ఉత్సవాల గురించి చక్కగా తెలుసునన్నారు. హైదరాబాద్ నగరంలోని అన్ని వర్గాల ప్రజలు బోనాల జాతర ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. ఉత్సవాల నిర్వాహకులతో కలిసి పోలీసులు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు ఎక్కడ ఇలాంటి సౌకర్యాలు ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు
తీసుకుందన్నారు. బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని ఉత్సవాల నిర్వాహకులు తమతో పూర్తిగా సహకరించిన అందువల్లే ఈసారి బోనాల జాతర ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయన్నారు. శాంతి భద్రతలకు ఎక్కడ ఎలాంటి విఘాతం కలగకుండా బోనాల జాతర ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు దేవాలయాల ప్రతినిధులు ఫలక్నుమా ఏసిపి ఎం.ఏ.మాజిద్ తో పాటు ఛత్రినాక ఇన్స్పెక్టర్ జిలాని తదితరులను ఘనంగా సన్మానించారు.
More Stories
Telangana Elections 2023 : నామినేషన్ల స్వీకరణకు పూర్తయిన తగిన ఏర్పాట్లు..
Hyderabad : నగరంలో వరద నీటి సమస్యకు చెక్..
దేశానికే ఆదర్శం.. డబుల్ బెడ్ రూమ్ పథకం..