అక్టోబర్ 10, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఇక పగటిపూట లాక్ డౌన్ తొలగించే అవకాశాలు..

ఇక పగటిపూట లాక్ డౌన్ తొలగించే అవకాశాలు..

 

  • ఈ నెల 8వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ మీటింగ్
  • రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు పై ద్రుష్టి..
  • ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు సడలింపు..
  • సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు రాత్రిపూట కర్ప్యూ
  • లాక్ డౌన్ లో గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు..
  • 5వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు రాష్ట్రంలో 2020 కేసులు మాత్రమే..

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): గత రెండు వారాల నుంచి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇక పగటి పూట లాక్ డౌన్ ను తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పగటిపూట లాక్ డౌన్ ను తొలగించి గతంలో లాగా రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేసే అవకాలున్నాయంటున్నారు. రెండు వారాలుగా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్న విషయాన్ని ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ కు నివేదికలు అందజేస్తున్నారు.ఇప్పటికే జూన్ నెలాఖరు వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడతాయని గత నెల లోనే ప్రజారోగ్య శాఖ సంచాలకులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆయన నివేదికల ఆధారంగా ప్రతి రోజు విడుదల చేస్తున్న మీడియా బులిటెన్ ను పరిశీలిస్తే…రోజు రోజుకు కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రజారోగ్య శాఖ ప్రభుత్వానికి సమర్పించిన ఆరోగ్య సమాచారం ప్రకారం..ఈ నెలాఖరు వరకు కేసుల సంఖ్య తగ్గితే..ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగుతున్న లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం. లాక్ డౌన్ పొడిగిస్తే..ఆర్థిక సమస్యలు తలెత్తుతున్న సందర్భంగా పగటి పూట కాకుండా రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తే బాగుంటుందనే అంశాన్ని పరిశీలించనున్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్ డౌన్ తొలగించి సడలింపులు ఇస్తూ…తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు జరిగితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు,రైతులు లాక్ డౌన్ తో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 8వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కరోనా వైరస్ వ్యాప్తి, వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తీరు, లాక్ డౌన్ పొడిగింపు తదితర అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా చర్చించనున్నారు. ఈ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపుపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ఱయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జూన్ 9వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. అంతకు ముందు వరకు ఉన్న 4 గంటల సడలింపు సమయం.. మే 31వ తేదీ నుంచి 7 గంటల వరకు అమల్లోకి వచ్చింది. అంతే కాకుండా ఇళ్లకు చేరడానికి మరో గంట అదనం గా అందుబాటులో ఉంది. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట సమయం వరకు సడలింపు ఉండగా..మరో గంట పాటు అదనంగా కేటాయించడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు అందుబాటులో ఉంది. అయితే రోజు వారి కూలి పనులు చేసుకునే వారితో పాటు రోజంతా కష్టపడి వివిధ పనులు చేసే వారికి ఈ 7 గంటల సడలింపు సమయం సరిపోవడం లేదని ఫిర్యాదు లున్నాయి. మొదటగా రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం..రెండో దఫా మే 30వ తేదీ వరకు..మూడో దఫా గా జూన్ 9వ తేదీ వరకు మరో మారు లాక్ డౌన్ ను పెంచుతూ నిర్ఱయం తీసుకుంది. లాక్ డౌన్ కు ముందు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు రాష్ట్రంలో 2020 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు  వైద్య,ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడంతో పాటు ప్రజలు కరోనా కట్టడికి సరైన జాగ్రత్తలు తీసుకుంటుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోందంటున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతుండటంతో హైకోర్టు జోక్యంతో తెలంగాణలో ముందు ఏప్రిల్ 20వ తేదీ నుంచి రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రాత్రిపూట కరోనా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. మొదటగా మే 1 వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు అమల్లోకి రాగా..మరో వారం రోజుల పాటు అంటే..గత నెల 8వ తేదీ వరకు పొడిగించారు. 8వ తేదీ తెల్లవారుజాముతో రెండో వారం వరకు పొడిగించిన రాత్రిపూట కర్ఫ్యూ గడువు ముగుస్తుందనగా..ఒకరోజు ముందు అంటే 7వ తేదీన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాత్రిపూట కర్ఫ్యూ మరో వారం రోజుల పాటు అంటే మే 15వ తేదీ వరకు  పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుండగానే మరోసారి హైకోర్టు జోక్యంతో రాత్రిపూట కర్ఫ్యూ ముగియడానికి రెండు రోజులు ముందుగానే మే 12 నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తోంది. ప్రస్తుతం అమలు జరుగుతున్న లాక్ డౌన్ మే 30తో ముగియనుండడంతో మరోసారి ప్రగతి భవన్ లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో లాక్ డౌన్ ను జూన్ 9వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ఱయం తీసుకున్నారు. దీంతో ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగుతున్న లాక్ డౌన్ సందర్భంగా పాజిటివ్ కేసులు 2 వేలకు పడిపోవడంతో…పగటిపూట లాక్ డౌన్ ను తొలగించే దిశలో అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. కరోనా వైరస్ బారిన పడి వైద్య సేవలు పొంది రికవరి అవుతున్న వారు 94.47 శాతం వరకు ఉన్నారని ప్రజా వైద్యారోగ్య శాఖ సంచాలకులు చెబుతున్నారు.  సకాలంలో వైద్య సేవలు పొందడమే కాకుండా కరోనా వైరస్ కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న వారందరూ ఎలాంటి టెన్షన్ లేకుండా కోలుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.