ఆర్సీ న్యూస్ ( హైదరాబాద్): రంజాన్ పండుగకు అంతా సిద్ధమైంది. రంజాన్ పండుగను ఈద్-ఉల్-ఫితర్ అని కూడా అంటారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు గ్రేటర్ పరిధిలో ఉన్న ప్రముఖ ఈద్గా లో సామూహిక ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తగిన ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈసారి అలాంటి పరిస్థితులు లేవు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నందున ఈద్గా లో సామూహిక ప్రార్థనలు అవకాశం లేకుండా పోయింది. తమ తమ ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు నిర్వహించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తదితరులు ఇప్పటికే ముస్లింలను కోరారు. ముస్లిం మత పెద్దలతో నగర పోలీసు కమిషనర్ వెబ్ నార్ ద్వారా మాట్లాడి తగిన సలహాలు,సూచనలు చేశారు. కరోనా మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకోవడం తో పాటు సమాజాన్ని రక్షించడానికి ఈద్-ఉల్-ఫితర్ పండుగ ప్రార్థనలు ఇళ్లలోనే నిర్వహించాలని సీపీ కోరారు. గతేడాదితో పాటు ఈసారి కూడా రంజాన్ మాసం కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న సమయంలో వచ్చాయి. గత నెల 14న రంజాన్ మాసం షురూ అయ్యింది. ఏప్రిల్ 13న మంగళవారం రాత్రి ఆకాశంలో నెల వంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. మక్కా మసీదులో మంగళవారం రాత్రి ఇషాకీ నమాజ్ నిర్వహించిన అనంతరం తరావీ జరిగింది. మక్కా మసీదు కతీబ్ రిజ్వాన్ ఖురేషీ ఆధ్వర్యంలో తరావీ సందర్భంగా ఖురాన్ పఠనం జరిగింది. ఏప్రిల్ 14న, బుధవారం తెల్లవారు జామున 4.37 గంటలకు సహార్ తో ఉపవాస దీక్షలు ప్రారంభం కాగా..సాయంత్రం 6.37 గంటలకు ఇఫ్తార్ విందుతో మొదటి రోజు రంజాన్ పూర్తయ్యింది. అప్పటి నుంచి ఈ నెల 13వ వరకు వరుసగా నెల రోజుల పాటు రోజంతా ఐదుసార్లు నమాజ్ చేసిన ముస్లింలు సాయంత్రం ఇఫ్తార్ విందుతో ఉపవాసాలు వదిలారు. ప్రతి రోజు రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ముస్లింలు పెద్ద ఎత్తున షాపింగ్ చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మకమైన మక్కా మసీదును రంగురంగుల విద్యుత్ దీపాలంకరణ అందంగా తీర్చిదిద్దారు. కళ్లు మిరుమిట్లు గొలిపే దీపకాంతుల్లో మక్కా మసీదు మెరిసిపోయింది. దాదాపు రూ.2 కోట్ల నిధులతో మక్కా మసీదులో పలు అభివ్రుద్ది పనులను చేపట్టారు.ఇందులో రూ.99.95 లక్షలతో 44 మరుగుదొడ్లు, 39 మూత్రశాలలు కొత్తగా నిర్మించారు. వేసవి కాలం కావడంతో ఎండ వేడిమి నుంచి తట్టుకోవడం కోసం మక్కా మసీదు ప్రాంగణం లో కొత్తగా షెడ్ ఏర్పాటు చేశారు.కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మక్కా మసీదులో సామూహిక ప్రార్దనలకు హాజరయ్యే ముస్లింలకు ప్రభుత్వం కొన్ని ముందు జాగ్రత్తలు సూచించింది.మక్కా మసీదు లోకి విజిటర్స్ ను అనుమతించ లేదు. రోజుకు ఐదు సార్లు జరిగిన నమాజ్ తో పాటు తరావీ, ఇఫ్తార్ విందులు యథావిధిగా కొనసాగాయి. భౌతిక దూరం పాటిస్తూ..మాస్కులు ధరించాలని సూచించిన మేరకు ప్రతిరోజు జరిగిన సామూహిక ప్రార్దనలకు హాజరైన ముస్లింలు తమ వెంట జానిమాజ్లను తెచ్చుకుని ప్రార్ధనలు చేశారు. కోవాలన్నారు. కరోనా కట్టడి చర్యలలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 10 ఏళ్ల లోపు చిన్నారులు సామూహిక ప్రార్దనల్లో పాల్గొనడానికి రాకపోవడమే మంచిదని సూచించడంతో దాదాపు నెల రోజుల పాటు జరిగిన సామూహిక ప్రార్ధనలలో వారెవరూ పాల్గొన లేదు. రంజాన్ మాసంలోని చివరి శుక్రవారానికి (ఈ నెల 7న)ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దీనిని ఆల్ విధా జుమ్మా అని అంటారు. అల్ విధా జుమ్మా…అల్ విధా అంటే వీడ్కోలు అని..జుమ్మా అంటే శుక్రవారం అని..రంజాన్ మాసంలో చివరి శుక్రవారానికి వీడ్కోలు అని అర్థం. అల్ విధా జుమ్మా రోజు జరిగే సామూహిక ప్రార్దనలకు హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల నుంచి ముస్లింలు హాజరవుతారు. అయితే ఈసారి అల్ విధా జుమ్మూ సందర్భంగా సామూహిక ప్రార్ధనలు తక్కువ మందితో జరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో అల్ విధా జుమ్మా సామూహిక ప్రార్దనలు సాధారణంగా జరిగాయి. అల్ విధా జుమ్మా రంజాన్ మాసంలో 24వ రోజు జరిగింది. ఇక రంజాన్ మాసంలో 27వ రోజు వచ్చిన షబ్-ఏ-ఖాదర్ (జగ్నేకీ రాత్)ను ముస్లింలు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. దీనిని ముస్లింలు శక్తి రాత్రి గా పరిగణించి రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక రంజాన్ మాసంలో చివరి రెండు రోజులు ముస్లిం ప్రజలకు కీలకంగా మారిన సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల పాటు సడలింపు కల్పించింది. అంటే రోజుకు 20 గంటల పాటు లాక్ డౌన్ కొనసాగుతుండగా..కేవలం 4 గంటలు సడలింపు దొరికింది. దీంతో ముస్లింలు ఈ నెల 12,13 తేదీలలో పండుగకు కావాల్సిన నిత్యావసర వస్తువులతో పాటు ఇతర వస్తువులను ఖరీదు చేశారు. ఇక శుక్రవారం ఈద్-ఉల్-ఫితర్ పండుగను ముస్లింలు తమ తమ ఇళ్లలోనే జరుపుకోనున్నారు.
1 thought on “ఈసారి కూడా రంజాన్ పండుగ ఇళ్లలోనే …”