నవంబర్ 25, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రాష్ట్రంలో మే 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు… 

రాష్ట్రంలో మే 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు... 

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగించారు. ముందు గత వారం రోజులతో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండడంతో లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ఱయం తీసుకుంది. ఈ నెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ నెల 20వ తేదీన క్యాబినెట్ సమావేశం నిర్వహించి లాక్ డౌన్ పై తదుపరి నిర్ఱయం తీసుకోన్నట్లు ప్రకటించారు. కాగా, ఇప్పటికే మంత్రులు జిల్లాలలో కరోనా వైరస్ కట్టడి చర్యలపై బిజీగా ఉండడంతో 20న నిర్వహించాల్సిన క్యాబినెట్ మీటింగ్ ను రద్దు చేసి మంగళవారమే సీఎం కేసిఆర్ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకున్నారు. మే 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. గత వారం రోజుల తో పోల్చితే పాజిటివిటీ రేట్ గణనీయంగా తగ్గింది. లాక్ డౌన్ కు ముందు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం నాలుగు వేల లోపు వచ్చాయి అనే విషయాన్ని వైద్య,ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. లాక్ డౌన్ విధించడంతో పాటు ప్రజలు కరోనా కట్టడికి సరైన జాగ్రత్తలు తీసుకుంటుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగిస్తే..మరింత ఆశించిన ఫలితాలు వస్తాయని భావించి రాష్ట్ర ప్రభుత్వం రెండో దఫా లాక్ డౌన్ ను మే 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు…

అధికారిక లెక్కల ప్రకారం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు రాష్ట్రంలో 3982 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..5186 మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారని..వీరందరి ఆరోగ్యం మెరుగైందని  రాష్ట్ర ప్రజా ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ  డైరెక్టర్ తెలిపారు. ఈరోజు కరోనా వైరస్ బారిన పడి వైద్య సేవలు పొందుతూ 27 మంది చనిపోయారని తెలిపారు. ఈ రోజు వరకు 5,36,766 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా…ఇందులో 4,85,644 మంది వైద్య సేవలు పొంది కోలుకున్నారు. వైద్య సేవలు పొందుతూ కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉంది. తెలంగాణలో 0.5 శాతం, దేశంలో 1.1 శాతం డెత్ రేట్ ఉండగా..రాష్ట్రంలో 90.47 శాతం, దేశంలో 85.6 శాతం రికవరీ రేటు ఉండని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అంటే కరోనా వైరస్ బారిన పడి వైద్య సేవలు పొంది రికవరి అవుతున్న వారు 90 శాతానికి పైగా ఉంటున్నారు. సకాలంలో వైద్య సేవలు పొందడమే కాకుండా కరోనా వైరస్ కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వారందరూ ఎలాంటి టెన్షన్ లేకుండా కోలుకుంటున్నారు. కొంతమంది తమకు కరోనా వైరస్ సోకిందని అనవసరంగా భయాందోళనలకు గురవుతుండటంతో మరణిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. నిలకడగా తమ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పడు పరిశీలించుకుంటూ వైద్యులు సూచించిన సలహాలు, సూచనలతో పాటు అవసరమైన ఐసోలేషన్ మెడికల్ కిట్లు వాడుతూ కోలుకుంటున్నారు.   రాష్ట్రంలో 48,110 మంది వివిధ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ రోజు 71,616 టెస్టులు నిర్వహించగా..ఇందులో ప్రైమరీ కాంటాక్ట్ టెస్టులు 49.9 శాతం ఉండగా..సెకండరీ కాంటాక్ట్ టెస్టులు 12.2 శాతం ఉన్నాయి. కరోనా వైరస్ లక్షణాలు బయట పడిన వెంటనే అప్రమత్తమై టెస్టులు చేయించుకుంటున్న వారికి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో హోం ఐసోలేషన్ లో కొంత మంది ఉండటం..మరికొంత మంది కుటుంబానికి దూరంగా ఆస్పత్రిలో చేరి వైద్య సేవలు పొందుతుండడంతో వీరి నుంచి ఇతరులకు( సెకండరీ కాంటాక్ట్) చాలా తక్కువగా అంటే.. 12.2 శాతం మాత్రమే వైరస్ సోకిందని తెలుస్తోంది. మొత్తం 71,616 టెస్టులలో 53,194 టెస్టులను ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించగా..18,422 టెస్టులను ప్రైవేటు ఆసుపత్రులలో నిర్వహించారు. 5,36,766 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా..ఇందులో 79.8 శాతం మందికి ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవు. ఇక 20.2 శాతం మందికి మాత్రమే కరోనా వైరస్ లక్షణాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా ఇంటింటికి తిరిగి నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే సత్పలితాలను ఇస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇంటింటి ఫీవర్ సర్వేలో ఎక్కడైనా..,ఎవరైనా జ్వరం తో బాధపడుతున్నట్లు తెలిస్తే..వెంటనే వారి సమాచారాన్ని రికార్డు చేసుకుని వారికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఐసోలేషన్ మెడికల్ కిట్లు అందజేస్తున్నామని..అందుకే వారు వైరస్ బారిన పడకుండానే కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. జ్వరంతో బాధపడే వారు త్వరగా కోలుకోవడానికి ఐసోలేషన్ మెడికల్ కిట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయంటున్నారు.