areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

Hyderabad : నగరంలో వరద నీటి సమస్యకు చెక్..

  • అవసరమైన మేరకు ఓపెన్ నాలాలకు రిటర్నింగ్ వాల్స్ తో పాటు ఇతర ఏర్పాట్లు..
  • వరద నీరు ఇళ్లల్లోకి రాకుండా తగిన చర్యలకు శ్రీకారం.. 
  • కాప్రా సర్కిల్ లో రూ. 5.46 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన..

ఆర్సీ న్యూస్, జూన్ 18 ( హైదరాబాద్): నగరంలో వరద ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలువకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు, నగర వ్యాప్తంగా స్ట్రామ్ వాటర్ డ్రెయిన్, బాక్స్ డ్రెయిన్లు ఏర్పాటు చేసేందుకు జిహెచ్ఎంసి ద్వారా నిరంతరాయంగా  చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్-1 లో 5 కోట్ల 45 లక్షల 50 వేల విలువైన ఐదు అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ శాసన సభ్యులు భేతి సుభాష్ రెడ్డి లతో కలిసి మేయర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ నాయకత్వంలో వరద నీరు సాఫీగా వెళ్లేందుకు నగర వ్యాప్తంగా స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లు, బాక్స్ డ్రెయిన్లు, సిసి, బిటి రోడ్లను రూ. 1000 కోట్ల తో పనులు ప్రారంభించా మన్నారు. వరద నీటి పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రగతిలో నాలా ఆక్రమణలకు గురి కాకుండా రిటైనింగ్ వాల్,  డీసిల్టింగ్ పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. వరద నీటి ద్వారా  ఇళ్లు మునగకుండా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నా మన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి వాటర్ పంపింగ్ మిషన్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.  పౌర సమస్యలపైన జిహెచ్ఎంసి ద్వారా జోనల్ వారిగా హాట్ లైన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సేవలను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… గత రెండు సంవత్సరాల్లో కురిసిన వర్షాలకు నగర వ్యాప్తంగా కాలనీల్లోకి నీరు రాకుండా స్ట్రామ్ వాటర్ చెరువు నుండి ఇళ్లల్లోకి రాకుండా, డ్రైనేజీ వాటర్ చెరువులో చేరకుండా బైపాస్ నిర్మిస్తున్నామని, వరద నీటిని మళ్లించేందుకు కాలువలు, పైప్ లైన్లు ఏర్పాటు చేసేందుకు ఎస్.ఎన్.డి.పి ద్వారా రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రగతి ద్వారా మురికి కాలువలు, చెరువులు, డ్రైనేజీ పొంగకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ముమ్మరంగా చర్యలు తీసుకున్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి కాలనీలను పరిశుభ్రంగా ఉంచారని తెలిపారు.

ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ… వరద ముంపు లేకుండా నియోజకవర్గంలో సుమారు రూ. 70 కోట్లతో వివిధ పనులు చేపడుతున్నట్లు, పనులు పూర్తయితే శాశ్వత పరిష్కారం అవుతుందని తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గంలో స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ మరమ్మతులు, పునరుద్దరణ, కల్వర్టులు, చిలుకానగర్, కాప్రా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలువకుండా స్ట్రామ్ వాటర్ డ్రెయిన్, బాక్స్ డ్రెయిన్లు, కల్వర్టు నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గత వర్షాలు పడిన సందర్భంగా ఏర్పడిన ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం కోసం నిధులను మంజూరు చేస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ స్వర్ణ రాజ్ శివమణి, జోనల్ కమిషనర్ పంకజ, ఎస్.ఇ అశోక్ రెడ్డి, డి.సి, ఏ.ఎం.హెచ్.ఓ లు తదితరులు పాల్గొన్నారు.