కరోనా వ్యాప్తి తో పురాతన కట్టడాలు,మ్యూజియంల మూసి వేత..
ఆర్సీ న్యూస్(హైదరాబాద్): దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పురాతన కట్టడాలు,మ్యూజియంలను మూసివేస్తున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ప్రకటించింది. ఏఎస్ఐ పరిధిలోని అన్ని పురాతన కట్టడాలు,మ్యూజియంలను మే 15వ తేదీ వరకు క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని గోల్కొండ,చార్మినార్,సాలార్ జంగ్ మ్యూజియం లతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ టెంపుల్స్, వరంగల్ లోని రామప్ప దేవాలయం, వరంగల్ కోట తదితర పర్యాటక ప్రాంతాలన్నీ మూత పడ్డాయి. శుక్రవారం ఉదయం నుంచి చార్మినార్,సాలార్ జంగ్ మ్యూజియం, గోల్కొండ కోటలను మూసి వేశారు. సందర్శకులను ఎవరిని అనమతించ లేదు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకవైపు టీకాల పంపిణీ జోరుగా జరుగుతున్నట్లుగా.. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి కూడా వేగంగా జరుగుతోంది. దేశంలో గత వారం రోజుల క్రితం లక్ష కేసుల వరకు ఉన్న పాజిటివ్ కేసులు ఒకేసారి ఈ వారంలో రెండు లక్షలు దాటాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ..పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. పెరుగుతున్న కేసులను ద్రుష్టిలో ఉంచుకుని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పురాతన కట్టడాల మూసి వేతకు ఆదేశాలు జారీ చేసింది.
చార్మినార్ కట్టడం తో పాటు గోల్కొండ కట్టడాల మూసి వేత..
నగరంలోని చారిత్రాత్మకమైన చార్మినార్ కట్టడంతో పాటు గోల్కొండ కట్టడాలను మూసి వేసారు. ఇప్పటికే గత కొన్ని రోజులుగా గోల్కొండ కోట సందర్శనకు పర్యాటకుల సంఖ్య బాగా తగ్గింది. కరోనా వైరస్ కారణంగా సందర్శకుల సంఖ్య రోజురోజుకు తగ్గింది. ప్రతి రోజు పర్యాటకులతో కిటకిటలాడిన గోల్కొండ కోట సందర్శకులు లేక బోసి పోయి కనిపించింది. ఇప్పుడు ఏఎస్ఐ ఆదేశాల మేరకు వచ్చే నెల 15వ తేదీ వరకు మూసి ఉంటుంది. ఈ విషయాన్ని పర్యాటకులు గమనించాలని సంబంధిత సిబ్బంది కోరారు. ఇక చార్మినార్ కట్టడం సందర్శనకు ప్రతి రోజు వందల సంఖ్యలో సందర్శకులు వచ్చే వారు. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నప్పటికీ..ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల సందర్శకులు చార్మినార్ సందర్శనకు వస్తుండడంతో ఇక్కడ ప్రతి రోజు సందర్శకుల సందడి కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు,పోలీసు అధికారుల ఫిర్యాదుల మేరకు ఏఎస్ఐ ఉన్నతాధికారులు శుక్రవారం నుంచి 15 రోజుల పాటు నిరవధికంగా మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.
ముందస్తు సమాచారం లేకపోవడంతో…
చార్మినార్ కట్టడం తో పాటు ఇతర పర్యాటక ప్రాంతాల్లోని కట్టడాల సందర్శనను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మూసివేయడంతో కొంత మంది పర్యాటకులు ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో చార్మినార్ వరకు వచ్చిన సందర్శకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒక రోజు ముందుగా సమాచారం ఉంటే బాగుండేదన్నారు. ఇక సాలార్ జంగ్ మ్యూజియంకు ప్రతి శుక్రవారం సెలవు దినం కావడంతో పర్యాటకులు ఎవరూ సందర్శనకు రాలేదు. ఏఎస్ఐ ఆదేశాల మేరకు శనివారం నుంచి మ్యూజియం మూసి ఉంటుందని సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు. పర్యాటకులు గమనించి మ్యూజియం సందర్శనకు రావద్దని ఆయన కోరారు.
ఇప్పటికే మక్కా మసీదులోకి విజిటర్స్ నాట్ అలౌడ్…
ఇక పాతనగరంలోని మరో చారిత్రాత్మకమైన మక్కా మసీదులోకి విజిటర్స్ ను గత కొన్ని రోజుల నుంచి అనుమతించడం లేదు. వాస్తవానికి చార్మినార్ కట్టడం సందర్శనకు వచ్చే పర్యాటకులు పక్కనే ఉన్న మక్కా మసీదును సందర్శించడం పరిపాటి. అయితే కరోనా వైరస్ వేగం పెరగడంతో మక్కా మసీదు లోనికి పర్యాటకులను అనుమతించడం లేదు. రంజాన్ మాసం సందర్శంగా కేవలం సామూహిక ప్రార్థనల కోసం ముస్లింలను మాత్రమే అనుమతిస్తున్నారు.
1 thought on “కరోనా వ్యాప్తి తో పురాతన కట్టడాలు,మ్యూజియంల మూసి వేత..”