సెప్టెంబర్ 15, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం..

ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం..
  • ఈ నెల 13 నుంచి పాఠశాల పునః ప్రారంభం..
  • రూ. 120 కోట్లతో పాఠ్య పుస్తకాల ముద్రణ..
  • 1.67 కోట్ల బుక్స్ పంపిణీకి సిద్దం..
  • ఉచితంగా యూనిఫాం..
  • మన ఊరు-మన బడి కి కేంద్రం నిధులు లేవు..
  • బడిబాటలో భాగంగా 70,698 మంది విద్యార్థులు చేరిక..
  • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి..

ఆర్సీ న్యూస్, జూన్ 12(హైదరాబాద్): తెలంగాణ లో సోమవారం నుంచి పాఠ శాలలను పునః ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం సకాలంలోనే పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సెలవులు పొడిగింపు లేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను సోమవారం నుంచి పునః ప్రారంభించనున్నట్లు చెప్పారు. పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల నిర్వాహకులకు మంత్రి ఆదేశించారు. మన ఊరు – మన బడిలో భాగంగా 9 వేల పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా.. నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు.అలాగే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని చేపట్టాలని నిర్ణయించారని, ఇందులో భాగంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన చేపట్ట నున్నట్లు చెప్పారు.

ఈ మేరకు 1.04లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. బడిబాటలో భాగంగా ఇప్పటి వరకు 70వేల 698 మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించామన్నారు. కార్యక్రమం మరో వారం రోజులు కొనసాగుతుందన్నారు.

ఇంగ్లిష్ మీడియం బోధన నేపథ్యంలో పిల్లలకు ఇబ్బందులు లేకుండా.. నెల రోజుల పాటు బ్రిడ్జి కోర్సు మాదిరిగా తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు అదేశించా మన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు స్వాగతం పలుకలన్నారు.ఆయా గ్రామాల్లో సర్పంచ్లు,మునిసిపాలిటీలలో కౌన్సిలర్లు, ఛైర్మన్లు పాఠశాలల పారిశుద్ధ్యం పై దృష్టి పెట్టాలన్నారు.

అన్ని పాఠశాలల్లో మిషన్ భగీరథ ద్వారా మంచినీటి కనెక్షన్లు ఉండేలా చూడాలన్నారు.120 కోట్లతో పాఠ్య పుస్తకాలు ముద్రించినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులందరికీ తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో బుక్‌ను అందిస్తామని, దాదాపు 1.67కోట్ల బుక్స్‌ను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఎప్పటిలాగే ఉచితంగా యూనిఫామ్స్‌ను అందిస్తామని, మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు తెలిపారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా పాఠశాలలు కొనసాగేలా అందరు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై శ్రద్ధ వహించాలని కోరారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలకు తిరిగి వస్తున్న విద్యార్థులకు మంత్రి స్వాగతం పలికారు.

రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని మంత్రి పేర్కొన్నారు.పెద్ద ఎత్తున పరీక్ష రాసిన విద్యార్థులకు మంత్రి అభినందించారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించటం లో సహకరించిన వారందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.మన ఊరు మనబడికి కేంద్రం నిధులు ఇచ్చిందని బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని.. మంత్రి పేర్కొన్నారు.

2700 కోట్లు ఎక్కడ ఉన్నాయో..బండి సంజయ్ చెప్పాలన్నారు. ఒక పక్క టెట్ వాయిదా వేయ మంటు మరో పక్క 20 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటు బీజేపీ అధ్యక్షులు ద్వంద్వ నీతితో వ్యవహరిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేసారు.రాష్ట్రంలో ఉపాధ్యాయులను గౌరవ ప్రదంగా చూస్తూ వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.రాష్ట్రానికి నవోదయ స్కూల్స్… గిరిజన వర్సిటీ తెచ్చి బండి సంజయ్ మాట్లాడాలని అన్నారు. ఐఐటీలు,ఐఐఎంలు,మెడికల్ కాలేజ్ లు దేశమంతా ఇచ్చి మన రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారని, ముందు అవి రాష్టానికి తేవడానికి కృషి చేయాలన్నారు.