areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

అభ్యంతరాల నేపథ్యంలో.. ఏక్ షామ్..చార్మినార్ కె నామ్

. ముస్లింల ఫిర్యాదు మేరకు కార్యక్రమంలో మార్పులు..

. మక్కా మసీద్ వైపు కాకుండా చార్మినార్ చుట్టూ ఏర్పాటు…

. మక్కా మసీదు వైపు బారికేడ్లు ఏర్పాటు చేసి అనుమతించని అధికారులు..

 . చార్మినార్ కె నామ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన..

ఆర్సీ న్యూస్, అక్టోబర్ 31(హైదరాబాద్):  ఈ ఆదివారం జరిగిన ఏక్ షామ్ చార్మినార్ కె నామ్.. కార్యక్రమం ఆనందోత్సాహాల నడుమ ఆద్యంతం సరదాగా కొనసాగింది. గత నెల 17వ తేదీన మొదటిసారి ప్రారంభమైన  చార్మినార్ కే నామ్ కార్యక్రమం సందర్భంగా కొంతమంది కొన్ని అభ్యంతరాలు తెలియజేయడంతో పాటు తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కొన్ని మార్పులు చేసింది. ఈ ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కార్యక్రమం నిర్విరామంగా కొనసాగింది. కొన్ని ముస్లిం సంస్థల మతపెద్దల అభ్యంతరాల మేరకు మక్కా మసీద్ వైపు గతంలో ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాల స్టాల్స్ ఈ ఆదివారం అనుమతించలేదు. చార్మినార్ కట్టడం చుట్టూ మాత్రమే అనుమతించారు. చార్మినార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తో పాటు నిమ్రా హోటల్, లాడ్ బజార్ వైపు వ్యాపార సముదాయాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గత వారంతో పోలిస్తే పలు మార్పులు చోటు చేసుకున్నాయి. వీకెండ్ ఆదివారం చార్మినార్ లో జరిగిన చార్మినార్ కె నామ్ కార్యక్రమం ఆనందోత్సాహాల నడుమ సరదాగా కొనసాగింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. పాతబస్తీ ప్రజలే కాకుండా నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున చార్మినార్ కు తరలివచ్చారు. అన్ని వర్గాల ప్రజలతో చార్మినార్ పరిసరాలు హోరెత్తాయి. త్రివర్ణ పతాకం రంగులో చార్మినార్ కట్టడం ఆకట్టుకుంది. కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా రంగు రంగుల విద్యుత్ దీపాలతో చార్మినార్ పరిసరాలు అందంగా కనిపించాయి. వాహనదారులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చార్మినార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. చార్మినార్ పరిసరాలలోని పలు ప్రాంతాల్లో ఉచిత పార్కింగ్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. అక్టోబర్ 17వ తేదీన మొదటిసారి ప్రారంభమైన  కార్యక్రమాన్ని వారం విడిచి వారం నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా గత ఆదివారం ఎలాంటి కార్యక్రమం నిర్వహించలేదు. వాస్తవానికి ప్రతి వీకెండ్ రోజైనా ఆదివారం పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలన్నీ సందర్శకులతో కిటకిటలాడుతోంది. సహజంగానే ఆదివారం నాడు చార్మినార్ పరిసరాలు పర్యాటకులతో రద్దీగా మారతాయి. దీనికి తోడు ఏక్ షామ్..చార్మినార్ కె నామ్ కార్యక్రమం ఉండటంతో గ్రేటర్ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. కుటుంబ సభ్యులు, బంధు-మిత్రులు, చార్మినార్ చేరుకొని సరదాగా గడిపారు. ఆడారు…పాడారు…సెల్ఫీ దిగారు. ఇష్టమైన రుచికరమైన చిరుతిళ్ళు తిన్నారు. ఐస్ క్రీమ్, కబాబ్, ఇరానీ చాయ్ రుచి చూశారు. ఎల్ ఈ డీ షో లతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈసారి వ్యాపార సముదాయం స్టాల్స్ మక్కా మసీదు వైపు అనుమతించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. చిరు వ్యాపారు లతోపాటు స్థానిక వ్యాపారులకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం మీద గతంలో జరిగిన కార్యక్రమంపై అందిన ఫిర్యాదుల మేరకు ఈ ఆదివారం పలు మార్పులు చేర్పులు చేశారు. యువత ఎంజాయ్ చేశారు.