ఏప్రిల్ 16, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

అమెరికాలో పాతబస్తీ చిన్నారుల ప్రతిభ..

అమెరికాలో పాతబస్తీ చిన్నారుల ప్రతిభ..
  • ఆస్టిన్ టెక్సాస్ నగరంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న తెలుగు ప్రజలు..
  • ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగిన సంబరాలు..
  • ఆకట్టుకున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు..
  • అలరించిన నగరంలోని మిరాలంమండికి చెందిన చిన్నారుల సంగీత విభావరి..

ఆర్సీ న్యూస్, నవంబర్10(టెక్సాస్): ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఆస్టిన్ టెక్సాస్ నగరంలోని ఐ ఎస్ డి స్కూల్లో తెలుగు ప్రజలు నిర్వహించిన దసరా-దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 500 మందికి పైగా తెలుగు ప్రజలు పాల్గొని సరదాగా గడిపారు. దసరా-దీపావళి వేడుకలను పురస్కరించుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు బ్రహ్మేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దసరా-దీపావళి సంబరాల్లో పాల్గొన్న తెలుగు ప్రజలు ఆనందోత్సాహాలతో గడిపారు. భారతదేశానికి చెందిన పలువురు సినీ గాయనీ గాయకులు ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని సినిమా పాటలతో పాటు భక్తి గీతాలను ఆలపించారు. గాయనీ గాయకులు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కష్టకాలం అనంతరం గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించని సంఘం ప్యాండమిక్ సిట్యూవేషన్ అనంతరం మొదటిసారి దసరా-దీపావళి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించింది. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగరంలోని మిరాలంమండి ప్రాంతానికి చెందిన చిన్నారులు అనిరుద్,అనీష్ ప్రదర్శించిన సంగీత విభావరి కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. పియానో వాయిస్తూ ఆలపించిన భక్తి గీతాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. కార్యక్రమానికి హాజరైన పలువురు అధికార అనధికార ప్రముఖులు ఇద్దరు చిన్నారులను అభినందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నగరం లోని మిరాలంమండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం కమిటీ చైర్మన్ గాజుల అంజయ్యతో పాటు హైదరాబాద్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(హెచ్ యు జే) మాజీ కార్యనిర్వాహక అధ్యక్షులు చలవాది విజయ్ ఆనంద్ రావు తదితరులు చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.