- ఒక్కసారిగా ఆకాశాన్నంటిన టమాట ధరలు..
- భారీ వర్షాల కారణంగానే కూరగాయల ధరల పెరుగుదల..
- ప్రస్తుతం నగరంలో కిలో టమాట రూ.80..
- దిగుబడి తగ్గితే వంద రూపాయలకు పైగా ధర పలకనున్న టమాటాలు..
- మదనపల్లెలో కిలో రూ.130.. చెన్నైలో రూ.160
- ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంట దిగుబడి..
- దీంతో కూరగాయల ధరలకు రెక్కలు
ఆర్సీ న్యూస్, నవంబర్ 24 (హైదరాబాద్): ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావం కూరగాయల పై పడింది. భారీ వర్షాలకు కూరగాయల పంటలన్నీ నీట మునిగిపోవడంతో మార్కెట్లో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండు నెలల క్రితం 20 రూపాయలకు కిలో లభించిన కాయగూరలు ప్రస్తుతం 50 రూపాయల లోపు గా ఉన్నాయి. ముఖ్యంగా టమాట ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. మార్కెట్‌లో టమాటా రేటు మండిపోతోంది. హైదరాబాద్ నగరంలో కిలో టమాటా సెంచరీకి చేరవవుతోంది. సూపర్ మార్కెట్లలో దీని ధర రూ.90 వరకు ఉండగా..మీరాలంమండి, మాదన్నపేట,గుడిమల్కాపూర్ కూరగాయలు మార్కెట్లో రూ.80 వరకు ఉంది. దీంతో టమాటాలు ఖరీదు చేయ లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో కిలో ధర రూ.వంద దాటేసింది. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో అయితే కేజీ రూ.150 దిశగా పరుగులు పెడుతోంది. మంగళవారం ఇక్కడ రికార్డు స్థాయిలో కేజీ ధర రూ.130 పలికింది. చెన్నైలో ఈ నెల ఆరంభంలో కేజీ రూ.40 ఉన్న టమాటా ఇప్పుడు ఏకం గా రూ.160కి ఎగబాకింది. క్యాప్సికం, ఉల్లిపాయలతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. నెల్లూరు, విజయవాడతో పాటు తమిళనాడుకు చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, కలకడ, పలమనేరు ప్రాంతాల నుంచి, కర్ణాటకలోని కోలారు నుంచి టమాటాలు ఎక్కువగా ఎగుమతి అయ్యేవి. అల్పపీడన ప్రభావం చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలపై అధికంగా ఉండటంతో ఇక్కడి రైతులు సాగు చేసిన టమాటా పంట తుడిచిపెట్టుకుపోయింది. అంతంత మాత్రంగా మదనపల్లె మార్కెట్‌కు వస్తున్న టమాటాకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇక్కడ కిలో రూ.130 ధర పలికింది. టమాటా అధికంగా పండించే ప్రాంతాలు వర్ష ప్రభావానికి గురికావడం, దీనికితోడు డీజిల్ రేట్లు కూడా పెరిగిపోవడం ధరలు పెరగడానికి కారణమైంది. మదనపల్లె ప్రాంతంలో దిగుబడి మరింత తగ్గుముఖం పడుతుండడంతో ఇక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఛత్తీస్ గఢ్ టమాటానే దిక్కుగా మారనుంది. మహారాష్ట్రలోని సోలాపూర్, కర్ణాటకలోని చిక్‌బుల్లాపూర్ నుంచి వచ్చే సరుకుపైనా ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుత మార్కెట్ల పరిస్థితిని విశ్లేషిస్తే టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను అప్రమత్తం చేసి ఛత్తీస్ గఢ్ లోని రాయపూర్ నుంచి టమాటా దిగుమతి చేయించి, రైతు బజార్లలో విక్రయించాలని భావిస్తోంది. ప్రస్తుతం రాయపూర్ మార్కెట్ నుంచి పలమనేరు మార్కెట్‌కు కిలో రూ.70 చొప్పున విక్రయానికి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం కలుగజేసుకుని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె రైతు బజార్లకు ఛత్తీస్ గఢ్ టమాటా దిగుమతి చేయించి అందుబాటు ధరలకు విక్రయించాలని ప్రజలు కోరుతున్నారు.
తమిళనాట కిలో టమాటా రూ.160కి పైగా విక్రయిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఈ ధరకు కళ్లెం వేసేందుకు తమిళనాడు ప్రభు త్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫామ్ గ్రీన్ కూరగాయల దుకాణాల్లో టమాటాలు విక్రయించాలని నిర్ణయించింది. ఈ దుకాణాల్లో బుధవారం నుంచి కేజీ టమాటా రూ.85-100కు విక్రయించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యానవన శాఖ నుంచి ప్రతిరోజూ 15 మెట్రిక్ టన్నుల టమాటాలు సేకరించి ఫామ్ గ్రీన్ దుకాణాల్లో విక్రయించనున్నట్టు ప్రకటించింది. నగరంలో ప్రస్తుతం ప్రధాన మార్కెట్లలో లో కిలో 80 రూపాయలకు లభిస్తుండగా రాబోయే రోజుల్లో దిగుమతులు సక్రమంగా జరగకపోతే ఈ ధర వంద రూపాయలు దాటే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రూ. 20 లకు లభించే టమాటాలు భారీ వర్షాల కారణంగా వంద రూపాయలకు చేరుకుంటున్నాయి.
More Stories
బహదూర్ పురా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ..
చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ..
సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగరావు మృతి..