మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఒమిక్రాన్ వచ్చేసింది..కట్టడి చర్యలు తప్పవు..

ఒమిక్రాన్ వచ్చేసింది..కట్టడి చర్యలు తప్పవు..
  • ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిందే..
  • భౌతిక దూరం పాటించాలి..
  • గుంపులు గుంపులుగా ఉండకూడదు..
  • పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో కరోనా జాగ్రత్తలు పాటించాలి..
  • సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలి..
  • ఒమిక్రాన్ వచ్చినా భయపడేది లేదు..
  • ధైర్యంగా ఎదుర్కొంటాం.. లాక్ డౌన్ మాత్రం ఉండదు..
  • తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడి..

 ఆర్సీ న్యూస్, డిసెంబర్15 ( హైదరాబాద్): తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ వచ్చేసింది. నగరంలో రెండు కేసులు నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా తదితర దేశాల నుంచి ఇద్దరు నగరానికి చేరుకోగా..వారి శాంపిళ్లను పరీక్షించగా..ఒమిక్రాన్ పాజిటివ్ గా రిజల్ట్ వచ్చినట్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 12వ తేదీన మెహిదీపట్నంలోని టోలి చౌకి ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల మహిళ కెన్యా నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగింది. వెంటనే శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపగా ఒమిక్రాన్ వైరస్ అని నిర్ధారణ కావడంతో వైద్య చికిత్సల కోసం ఆమెను గచ్చిబౌలిలోని ట్రిమ్స్ కు తరలించారు. అదేవిధంగా సోమాలియా నుంచి వచ్చిన 23 ఏళ్ల మరో యువకునికి సైతం ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. వెంటనే వీరిరువురికీ ట్రిమ్స్ లో వైద్య సేవలు అందిస్తూనే వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్ లో ఉంచారు. ప్రపంచంలోని దాదాపు 77 దేశాల్లో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ కావడంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని… ప్రజలు ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. గోరంతలు కొండంతలు చేస్తూ సోషల్ మీడియాలో అనవసరంగా ప్రజలను భయపెట్టే విధంగా ఫేక్ న్యూస్ లను అంద చేయరాదని ఆయన కోరారు. ఎక్కడైనా.. ఏదైనా సమాచారం అందితే సంబంధిత అధికారులను సంప్రదించి సరైన వివరాలు సేకరించిన అనంతరమే ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందన్నారు. వైరస్ వ్యాప్తి కన్నా ముందే దుష్ప్రచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందన్నారు. చాలా మంది ప్రజలు వైరస్ తో కాకుండా భయాందోళన తోనే ప్రాణాలను కోల్పోతున్నారు. ఒమిక్రాన్ తో  పాటు కొత్త వైరస్ లు ఏవి నిర్ధారణ అయినా.. వాటన్నింటినీ ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. క్రిస్మస్ వేడుకలతో పాటు సంక్రాంతి పర్వదినం కూడా ఉందని.. జనవరి మూడో వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు పరిస్థితులు భయాందోళన కలిగించే విధంగా ఉంటాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కూలు ధరించాల్సిన అవసరం ఉందన్నారు. మాస్కులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగరాదన్నారు. ఇంటా బయటా తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉందన్నారు. కేవలం బోజనం సమయంలోనే మాస్కులు తొలగిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయన్నారు. గృహాలలో చక్కటి వెలుతురు..శానిటేషన్ ఉండేటట్టు చూసుకోవాలన్నారు. జ్వరం,జలుబు వస్తే అవి సాధారణమేననీ.. వదిలేయకుండా వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఒమిక్రాన్ వైరస్ నిర్ధారణ అయిన వెంటనే రెండు రోజుల్లోనే డబుల్ అవుతాయన్నారు. వైరస్ వ్యాప్తి కారణంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది మార్కులను సరైన పద్ధతిలో ధరించడం లేదని.. ఒకవేళ ధరించినా తరచూ చేతులతో తాకుతూ కిందికి మీదికి సరి చేస్తూ ఉంటారని.. ఇది సరైన పద్ధతి కాదన్నారు. కొంత మంది మాస్క్ లను ముఖాలకు కాకుండా ద్విచక్ర వాహనాల నెంబర్ ప్లేట్లు కనబడకుండా కప్పేస్తూ ఉంచుతున్నారన్నారు. ప్రస్తుతం నిర్ధారణ అయిన రెండు ఒమిక్రాన్ కేసు లతో పాటు మరో బాలుడు శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగిన అనంతరం పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయాడని.. తను వెళ్ళిన అనంతరం అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ ఉన్నట్లు తేలిందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ తో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ ఆంక్షలను పాటించాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలే కాకుండా తమను తాము రక్షించుకోవడం తో పాటు సమాజంలోని ప్రజలను కూడా కాపాడాలంటే… తప్పనిసరిగా ఆంక్షలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఉండ దన్నారు.