areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు తాత్కాలిక నిలిపివేత..

తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు తాత్కాలిక నిలిపివేత..
  • విరిగిపడిన కొండ చరియలు..
  • తృటిలో తప్పిన ఆర్టీసీ బస్సు ప్రమాదం..
  • ప్రయాణికులంతా సురక్షితం..
  • కొండచరియలు విరిగిపడటంతో ఘాట్ రోడ్ మూసివేత..
  • అలిపిరి వద్ద భారీ ఎత్తున నిలిచిపోయిన వాహనాలు..
  • రంగంలోకి దిగిన టిటిడి ఇంజనీరింగ్ విభాగంతో పాటు విజిలెన్స్, అటవీశాఖ సహాయక బృందాలు..

ఆర్సీ న్యూస్, డిసెంబర్ 01 (హైదరాబాద్): తిరుపతి నుంచి తిరుమలకు ఘాట్ రోడ్డు ద్వారా వెళ్లే భక్తులకు మళ్లీ ఇబ్బందులు తలెత్తాయి. ఉన్నట్టుండి తిరుమల ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగి పడటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో అలిపిరి వద్ద బుధవారం తెల్లవారుజాము నుంచి ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై వాహనాలు ఎక్కడి కక్కడ రోడ్డుపై నిలిచిపోయాయి. ఇప్పటికే గత నెల తుఫాను కారణంగా ఘాట్ రోడ్ పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఘాట్ రోడ్ లో కొండ చరియలు విరిగి పడటంతో బుధవారం ఉదయం ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పాటు విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తయ్యేంత వరకు వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఘాట్ రోడ్డు మరమ్మతులు జరుగుతున్నట్లు సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. తిరుపతిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల కనుమదారులు దెబ్బతింటున్నాయి. బుధవారం ఉదయం తిరుమల రెండో ఘాట్ రోడ్డులో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో టీటీడీ అధికారులు రెండో కనుమదారిని తాత్కాలికంగా మూసివేశారు. లింక్ ఘాట్ రోడ్డు సమీపంలో కొండపై నుంచి రహదారిపై భారీ బండరాళ్లు పడ్డాయి.

దీంతో మూడు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు వాహనాలను నిలిపి వేశారు. విజిలెన్స్ సిబ్బంది, టీటీడీ ఇంజినీరింగ్, అటవీశాఖ అదికారులు కొండచరియలను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాళ్లు, మట్టి పెల్లలు జారిపడే సమయంలో ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రెండో ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి తిరుమల తిరుపతి కి బయలుదేరే భక్తులు తమ ప్రయాణాలను ఒకటి, రెండు రోజులు వాయిదా వేసు కోవాల్సిన అవసరం ఏర్పడింది.