areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

పాతబస్తీలో అందుబాటులోకి మరో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్..

పాతబస్తీలో అందుబాటులోకి మరో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్..
  • ఓవైసీ జంక్షన్-మిధాని జంక్షన్ నడుమ ఫ్లైఓవర్ నిర్మాణం..
  • రూ. 80 కోట్ల వ్యయంతో 1.36 కిలోమీటర్ల పొడవున నిర్మాణం..
  • 3 లైన్ల రోడ్లతో 12 మీటర్ల వెడల్పు..
  • ఎస్.ఆర్.డి.పి కింద నిర్మాణం పనులు పూర్తి..
  • ఈనెల 28న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభం..

 ఆర్సీ న్యూస్, డిసెంబర్ 27( హైదరాబాద్): నగరంలో మరో మల్టీ లేవల్ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు పూర్తి చేసుకొని వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. జిహెచ్ఎంసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈనెల 28న ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేయనున్నారు. ఇందు కోసం జిహెచ్ఎంసి ఇప్పటికే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రితో పాటు హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, యాకుత్పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ భాషా ఖాద్రి తదితరులు ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. 2018 ఏప్రిల్ నెలలో ప్రారంభమైన మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు ప్రస్తుతం పూర్తి కావడంతో ప్రారంభానికి సిద్ధమైంది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ  ఫ్లై ఓవర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి ప్రయాణికులతో పాటు శ్రీశైలం,బెంగుళూర్,కర్నూల్లతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. రూ. 80 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు జరిగాయి. 1.365 కిలోమీటర్ల పొడవునా పన్నెండు మీటర్ల వెడల్పుతో మూడు లైన్ల రహదారితో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగింది. ఓవైసీ జంక్షన్ నుంచి మిధాని జంక్షన్ వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు జరిగాయి. ఎల్బీనగర్, బైరమల్ గూడా, కర్మన్ ఘాట్, చంపాపేట్ తదితర ప్రాంతాలకు చాంద్రాయణగుట్ట, శ్రీశైలం, కర్నూల్, బెంగళూర్ తదితర ప్రాంతాల నుంచీ వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ ఫ్లై ఓవర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇదీ వన్ వే గా ఉంటుంది. అలాగే ఎల్బీ నగర్ నుండి చంద్రాయణగుట్ట వైపు వెళ్లే వాహనాలు ఫ్లై ఓవర్ కింది నుంచి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్.ఆర్.డీ.పీ) కింద నిర్మాణం పనులు జరిగాయి. మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల సందర్భంగా భూసేకరణ కోసం రూ. 9 కోట్లు, జలమండలి మంచినీటి పైపులైన్లు షిఫ్టింగ్ కోసం రూ.5 కోట్లు, టి.ఎస్.ఎస్. పి.డి.సి.ఎల్ కేబుల్ వైర్ల షిఫ్జింగ్ కోసం రూ.3 కోట్లు ఖర్చు చేశారు. మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభించనున్న ఫ్లై ఓవర్ సందర్భంగా జిహెచ్ఎంసి చార్మినార్ జోన్ ప్రాజెక్ట్ ఎస్.ఈ దత్తు పంతు తదితర అధికారుల బృందం సోమవారం ఉదయం ఏర్పాట్లను పరిశీలించింది. ఫ్లై ఓవర్ పైన విద్యుత్ దీపాల ఏర్పాటు తో పాటు  సుందరీకరణ పనులు పూర్తయ్యాయి.

పాతబస్తీలో అందుబాటులోకి మరో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్..
మల్టీ లెవెల్ ఫ్లైఓవర్..