areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఫ్లై ఓవర్ ప్రారంభంలో అంతా “ఆకు పచ్చ”ధనమే

ఫ్లై ఓవర్ ప్రారంభంలో అంతా "ఆకు పచ్చ"ధనమే
  • ప్రారంభోత్సవం సందర్భంగా మజ్లిస్ పార్టీ జెండాలతో నిండిన ఫ్లైఓవర్..
  • ఎక్కడా కనిపించని టిఆర్ఎస్ జెండాలు.. ఫ్లెక్సీలు..
  • ఓవైసీ బ్రదర్స్ ఫ్లెక్సీలతో నిండిపోయిన ఫ్లైఓవర్..
  • మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తో ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..
  • ఎలాంటి ప్రసంగం చేయకుండా  వెళ్ళిపోయిన మంత్రి కేటీఆర్..
  • ఓవైసీ జంక్షన్-మిధాని జంక్షన్ నడుమ ఫ్లైఓవర్ నిర్మాణం..
  • రూ. 80 కోట్ల వ్యయంతో 1.36 కిలోమీటర్ల పొడవున నిర్మాణం..
  • 3 లైన్ల రోడ్లతో 12 మీటర్ల వెడల్పు..
  • ఎస్.ఆర్.డి.పి కింద నిర్మాణం పనులు పూర్తి..

 ఆర్సీ న్యూస్, డిసెంబర్ 28 ( హైదరాబాద్): హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్ట్- ఎస్.ఆర్.డి.పి ) కింద మిధానీ- ఓవైసీ జంక్షన్ ల నడుమ నిర్మించిన “వన్ వే” ఫ్లై ఓవర్ ను మంత్రులు కల్వకుంట్ల తారక రామారావుతో పాటు హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు మంగళవారం ఉదయం ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్లై ఓవర్ పైన మొత్తం మజ్లీస్ పార్టీ జెండాలతో పాటు ఓవైసీ సోదరులు ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఎటు చూసినా మజ్లీస్ పార్టీ పచ్చ ధనం కనిపించింది. ఈ ప్రారంభోత్సవ వేడుకలు మజ్లీస్ పార్టీ కార్యక్రమం లాగా కనిపించింది. ఎక్కడ టిఆర్ఎస్ జండా కానీ మంత్రుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు కానీ కనిపించ లేదు. టిఆర్ఎస్ లీడర్ లు సైతం ఎక్కువగా కనిపించ లేదు. కొంతమంది కార్యక్రమానికి వచ్చినప్పటికీ..ఎలాంటి హడావుడి లేకుండా గమ్మున ఉండి పోయారు.మజ్లీస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తో పాటు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమానికి ముందుగా ఓవైసీ సోదరులు చేరుకోగా.. అనంతరం మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు చేరుకున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తాను ఫ్లై ఓవర్ ప్రారంభించకుండా మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ప్రారంభింప చేశారు. ప్రారంభోత్సవం అనంతరం కేటీఆర్ ఎలాంటి  ప్రసంగాలు చేయకుండా నేరుగా వెళ్లి పోయారు. దీంతో ఎవరు ప్రసంగం చేయకుండా, మీడియాతో సైతం మాట్లాడకుండా వెళ్లి పోయారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్, గ్రేటర్ కమిషనర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 2018 ఏప్రిల్ నెలలో ప్రారంభమైన మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు ప్రస్తుతం పూర్తి కావడంతో ప్రారంభించారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ  ఫ్లై ఓవర్ వన్ వే గా ఉంటుంది. రూ. 80 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు జరిగాయి. 1.365 కిలోమీటర్ల పొడవునా పన్నెండు మీటర్ల వెడల్పుతో మూడు లైన్ల రహదారితో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగింది. ఓవైసీ జంక్షన్ నుంచి మిధాని జంక్షన్ వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు జరిగాయి.