areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్…

. ప్రత్యేక పూజలు చేసిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ..

. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ ట్రస్ట్ శశికళ..

. దీపావళి అందరి జీవితాలలో వెలుగులు నింపుతూ.. ఆయురారోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలగాలని కోరిన బండారు.

. పాతబస్తీ బిజెపి నాయకులతో పాటు పలువురు అధికార అనధికార ప్రముఖులు హాజరు..

. అనంతరం జిహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బందికి ఆరోగ్య, రక్షణ కిట్స్  అందజేత..

ఆర్సీ న్యూస్, నవంబర్ 01 (హైదరాబాద్): దీపావళి ఉత్సవాలను పురస్కరించుకొని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించారు.  అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ట్రస్టీ శశికళ ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. పాతబస్తీ బిజెపి నాయకులతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాలకు చెందిన బిజెపి నాయకులు పలువురు అధికార అనధికార ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన బండారు దత్తాత్రేయ అనంతరం జిహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బందికి ఆరోగ్య,రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కిట్స్ ను అందజేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల నాలుగో తేదీన జరిగే భాగ్యలక్ష్మి అమ్మవారి పూజా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరుతూ దేవాలయం ట్రస్టీ శశికళ ఆదివారం గవర్నర్ బండారు దత్తాత్రేయ ను కలిసి ఆహ్వానించింది. కాగా 4వ తేదీన హర్యానా రాష్ట్రంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలలో బండారు దత్తాత్రేయ పాల్గొన్ననున్నందున ముందుగానే భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోవాలని భావించి సోమవారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం అనంతరం ఆయన నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లి హర్యానాకు బయలుదేరారు. పూజల అనంతరం బండారు దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ… దసరా, దీపావళి పండుగలు ప్రజలందరికీ ఎంతో ముఖ్యమైన పండుగలు అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని కోరుకుంటూ తాను భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించానన్నారు. ప్రజలకు కష్టాలు, సమస్యలు ఎదురవకుండా ఎళ్లవేళలా అండగా ఉండాలని తాను అమ్మవారిని కోరినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని కోరానన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వంద కోట్లకు పైగా అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. ఇప్పటికే 80% వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. రాబోయే రోజుల్లో 100% వ్యాక్సినేషన్ పూర్తవుతుందన్నారు. వ్యాక్సినేషన్ పకడ్బందీగా అమలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీపావళి పర్వదినం ప్రజలందరికీ శుభదినం అవుతుందన్నారు. ప్రజలు కోరిన కోరికలు తీర్చే చార్మినార్ అమ్మవారి దర్శనం తనకెంతో సంతోషం కలిగిస్తోందన్నారు. జిహెచ్ఎంసి కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… రేయనక పగలనక పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యం పట్ల జిహెచ్ఎంసి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం సంతోషకరమన్నారు. పారిశుద్ధ కార్మికులు కోవిడ్ ను సైతం లెక్క చేయకుండా నిరంతరం తమ సేవలను కొనసాగించారన్నారు. పారిశుద్ధ కార్మికుల ఆరోగ్యంతో పాటు వారికి రక్షణ కల్పించే విధంగా ప్రత్యేకంగా రూపొందించిన కిట్లను అందజేయడం ఆహ్వానించదగ్గ విషయం అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బిజెపి భాగ్య నగర్ జిల్లా అధ్యక్షులు సంరెడ్డి సురేందర్ రెడ్డి, బిజెపి గోల్కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఉమా మహేంద్ర, బిజెపి ఓ బి సి రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ రాజ్, గౌలిపురా కార్పొరేటర్ భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్ ఆలే జితేంద్ర, బి జె పి ఓ బి సి ఐటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ప్యారసాని వెంకటేష్, బిజెపి సీనియర్ నాయకులు ఎస్. ప్రవీణ్ కుమార్, చార్మినార్ నియోజకవర్గం బిజెపి కన్వీనర్ సురేందర్, కునాల్ రావు, సుమన్, ధీరజ్ లాల్,చిరంజీవి తదితరులు పాల్గొన్నారు