ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

వినాయక చవితి శుభాకాంక్షలు: ఆర్సీ న్యూస్

వినాయక చవితి శుభాకాంక్షలు: ఆర్సీ న్యూస్
  • పీఓపీ విగ్రహాల నిమజ్జనం ట్యాంక్ బండ్ లో వద్దన్న హైకోర్టు
  • మట్టి విగ్రహాలకు ఓకే..
  • నెక్లెస్ రోడ్ రూట్లో..ఫర్వాలేదు
  • ఇక భక్తులు మట్టి విగ్రహాలను తమ ఇళ్లలోనే నిమజ్జనం చేసుకోవాలి.
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం.. ప్రయత్నం చేస్తున్న అధికారులు

ఆర్సీ న్యూస్, సెఫ్టెంబర్ 10 (హైదరాబాద్): ఆర్సీ న్యూస్ పాఠకులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలను భక్తులు కన్నుల పండువగా..భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఆర్సీ న్యూస్ వెబ్సైట్, ఆర్సీ న్యూస్ యూ ట్యూబ్ ఛానల్  యాజమాన్యం, ఎడిటోరియల్ బ్రుందం కోరింది. వినాయక ఉత్సవాలు శుక్రవారం ఉదయం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. గతేడాది కరోనా వైరస్ కారణంగా ఉత్సవాలు నిర్వహించినప్పటికీ.. పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతో చేయ లేకపోయారు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో.. ఈసారి ఉత్సవాలను అత్యంత వైభవంగా.. కన్నుల పండువగా నిర్వహించడానికి ఉత్సవాల నిర్వాహకులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణ జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున వినాయక మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. 40 అడుగుల ఎత్తుతో ప్రతిష్టించిన ఖైరతాబాద్ వినాయక విగ్రహానికి శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు జరిగాయి. గతంలో కన్నా ఈసారి వినాయక ఉత్సవాల ప్రారంభానికి రెండు రోజుల ముందే భక్తులకు వినాయకుని నిజ స్వరూప దర్శనం లభించింది. శుక్రవారం ఉదయం అధికారికంగా పూజలు నిర్వహించి భక్తులను వినాయకుని దర్శనం కోసం అనుమతించారు. వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని ఆర్సీ న్యూస్ యాజమాన్యం శుభాకాంక్షలు తెలియ జేసింది. ఈ నెల 10 వ‌, తేదీ నుంచి ప్రారంభమైన వినాయక ఉత్సవాలు అనంత చతుర్దశి రోజైనా ఈ నెల 19వ తేదీన ముగియ నున్నాయి.19వ తేదీన పాతబస్తీ శివారులోని బాలాపూర్ నుంచి వినాయక సాగర్ వరకు శోభాయాత్ర బయలుదేరుతుంది. శోభాయాత్ర కోసం ఇప్పటికే జిహెచ్ఎంసి చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ తో పాటు దక్షిణ మండలం డిసిపి డాక్టర్ గజరావు భూపాల్ తదితరుల ఆధ్వర్యంలో కో- ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఇందులో జిహెచ్ఎంసి అధికారులతో పాటు పోలీస్ అధికారులు, జలమండలి అధికారులు, టి ఎస్ ఎస్ పి డి సి ఎల్, ట్రాఫిక్, ఆర్ అండ్ బి, ఎలక్ట్రికల్ తదితర విభాగాలకు చెందిన అధికారులు పాల్గొని శోభాయాత్ర కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. బాలాపూర్ నుంచి బయలుదేరే శోభాయాత్ర చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, శంషీర్ గంజ్, లాల్ దర్వాజ చౌరస్తా, మక్కా మసీదు, మదీనా, చార్మినార్, గుల్జార్ హౌస్, పత్తర్ గట్టి, మదీనా, నయాపూల్, అఫ్జల్ గంజ్ ద్వారా ట్యాంక్ బండ్ కు చేరుకుంటుంది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ట్యాంక్ బండ్ లో నిమజ్జనం వద్దు: హైకోర్టు

 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పిఓపి) తో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాల కారణంగా జలాశయం హానికారక మవుతుందని.. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను మాత్రమే ట్యాంక్బండ్ లో నిమజ్జనం చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా ట్యాంక్ బండ్ పై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని.. ఒకవేళ వినాయక విగ్రహాలను ఇక్కడి నుంచి నీటిలో నిమజ్జనం చేస్తే ఈ అభివృద్ధి పనులన్నీ కరాబ్ అవుతాయని..దీంతో ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని హైకోర్టు పేర్కొంది. అవసరమైతే లుంబినీ పార్క్, సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్డు రూట్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చునని హైకోర్టు సూచించింది. అక్కడ కూడా తాత్కాలికంగా రబ్బర్ డాం నిర్మించి  నీటి కొలను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఆదేశించింది. ట్యాంక్ బండ్ పై చేపట్టిన సుందరీకరణకు ఆటంకాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని… అందుకే నెక్లెస్ రోడ్డు రూట్ లో నిమజ్జనోత్సవా లను పూర్తి చేయాలని హైకోర్టు సూచించింది. అంతేకాకుండా ఇళ్లలో పూజలు నిర్వహించే భక్తులందరూ  మట్టి విగ్రహాలను ప్రతిష్టించి ఇళ్లలోనే నిమజ్జనం చేసుకోవాలని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గని కారణంగా..ఉత్సవాల సందర్భంగా  తీసుకోవాల్సిన చర్యలు అన్నింటిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించింది. గుంపులు.. గుంపులుగా భక్తులు ఉండకుండా భౌతిక దూరం పాటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. మండపాల వద్ద రాత్రి పది గంటల తర్వాత ఎలాంటి మైకులకు అనుమతించవద్దని.. మండపాల వద్ద ఎక్కువ మంది ఉండకుండా భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. నిమజ్జనం చివరి రోజు హుస్సేన్ సాగర్ కు దూర ప్రాంతాల నుంచి వచ్చే వినాయక విగ్రహాలను ఒకేసారి గుంపులు గుంపులుగా తరలించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. నిమజ్జనం జరిగిన వెంటనే ఎప్పటికప్పుడు రోడ్లపై పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను జిహెచ్ఎంసి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. పరిమిత సంఖ్యలో మండపాల ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నిర్వహించే వినాయక ఉత్సవాలకు ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. 2022 మార్చి 31లోగా వినాయక ఉత్సవాల నిర్వహణ కోసం అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రత్యామ్నాయ మార్గాల వైపు ద్రుష్టి..

హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిమజ్జనోత్సవాలపై కార్యాచరణను రూపొందిస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయరాదని హైకోర్టు ఆదేశించడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నారు. నెక్లెస్ రోడ్డు తో పాటు..ఇప్పటికే అందుబాటులో ఉన్న 25 చెరువులు, కుంటలు నిమజ్జనోత్సవాలకు వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు.