మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఈనెల 16న మంచు విష్ణు భాధ్యతల స్వీకారం..

ఈనెల 16న మంచు విష్ణు భాధ్యతల స్వీకారం..
  • ఇండస్ట్రీలోని పెద్దల సహకారం అవసరం
  • అందరి ఆశీస్సులు పొందుతున్న
  • తండ్రి మోహన్ బాబు తో కలిసి బాలకృష్ణ ఇంటికి వెళ్లిన మంచు విష్ణు
  • చిరంజీవిని కూడా కలుస్తా: మంచు
  • మంగళగిరిలో బాలకృష్ణ అల్లుడు ఓటమి.. వైఎస్సార్ పార్టీ విజయానికి కృషి చేశా: మోహన్ బాబు

ఆర్సీ న్యూస్,అక్టోబర్ 14 (హైదరాబాద్): “మా” ఎన్నికల్లో విజయం సాధించిన నటుడు మంచు విష్ణు ఈనెల 16వ తేదీన ఉదయం 11:45 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నో నాటకీయ పరిణామాల నడుమ మా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించిన మంచు విష్ణు ఈనెల 16వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందులో భాగంగా తగిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆయన విజయానికి సహకరించిన సినీ పెద్దలను ప్రత్యక్షంగా కలుస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.  ఇప్పటికే సినీ ప్రముఖులు కోట శ్రీనివాసరావు, సత్యనారాయణ, పరుచూరి గోపాలకృష్ణ, బ్రహ్మానందం తదితరులను ప్రత్యక్షంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగా తన తండ్రి మోహన్ బాబుతో కలిసి గురువారం నటుడు బాలకృష్ణ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. తన విజయానికి సహకరించినందుకు మంచు విష్ణు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు విలేకరులతో మాట్లాడుతూ.. మంచు విష్ణు విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కల్పిస్తున్నామన్నారు. నటుడు బాలకృష్ణ తన బిడ్డకు పూర్తిగా తన సహాయ సహకారాలు అందజేస్తున్నారన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నగారి ఆశీస్సులు, ఆదేశాల మేరకే తన తమ్ముడు బాలకృష్ణ ఈ ఎన్నికల్లో మంచు విష్ణుకు అండగా ఉన్నాడని తాను భావిస్తున్నానన్నారు. బాలకృష్ణ ఉన్నత విలువలు గల సంస్కారవంతుడు అని ఆయన కొనియాడారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టిడిపి అభ్యర్థి, బాలకృష్ణ అల్లుడుకు వ్యతిరేకంగా తాను ప్రచారం చేశానని…అందుకే ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిందని… వైఎస్ఆర్ సీపీ గెలిచిందని ఆయన తెలిపారు. ఈ పరిణామాల అనంతరం ఒకసారి  బాలకృష్ణకు తాను ఫోను ఫోన్ చేయగా.. విజ్ఞతతో మాట్లాడారన్నారు. గతంలో జరిగిన పరిణామాలను మనసులో పెట్టుకోకుండా వాటిని మరచిపోయిన బాలకృష్ణ సాధారణంగా తనతో మాట్లాడిన తీరును మోహన్ బాబు ప్రశంసించారు. మా ఎన్నికల్లో మంచు విష్ణును గెలిపించాలని కోరగా.. సానుకూలంగా స్పందించారన్నారు. అందుకే మంచు విష్ణుతో కలిసి బాలకృష్ణను పర్సనల్ గా కలిసామనీ.. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కావాలని కోరినట్లు ఆయన తెలిపారు. తన బిడ్డకు అండగా ఉండాలని బాలకృష్ణను కోరానని మోహన్ బాబు తెలిపారు. అనంతరం మంచు విష్ణు విలేకరులతో మాట్లాడుతూ… బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. మా ఎన్నికల్లో విజయం సాధించిన తాను ఈనెల 16వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నామన్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. ఇందులో భాగంగా మా లోని ప్రముఖుల అందరిని పర్సనల్ గా కలుస్తున్నామన్నారు. చిరంజీవితో పాటు సినీ పెద్దల అందర్నీ ప్రత్యక్షంగా కలిసి వారి మద్దతు పొందుతున్నామన్నారు. మా ఎన్నికల సందర్భంగా తలెత్తిన వివాదాల తోపాటు వాగ్వివాదాలు, ఇతర అంశాలపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సావధానంగా సమాధానం చెప్పారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లోని కొంత మంది అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ.. మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన విషయం పై విలేకరులు అడిగిన ప్రశ్నకు.. త్వరలో పరిస్థితులు సద్దుమణుగుతాయని అన్నారు. వాస్తవానికి తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి సిద్ధమైనప్పటికీ.. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో కొద్ది మందితో మాత్రమే బాధ్యతలను చేపట్టనున్నమన్నారు. ప్రమాణ స్వీకార వేదికను త్వరలో తెలియజేస్తా మన్నారు.