areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఏపీలో ఘనంగా తెలంగాణ పాతబస్తీ బోనాల జాతర ఉత్సవాలు..

ఏపీలో ఘనంగా తెలంగాణ పాతబస్తీ బోనాల జాతర ఉత్సవాలు..
  • ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు
  • కన్నుల పండువగా బోనాల జాతర సామూహిక ఊరేగింపు 
  • విజయవాడ కనక దుర్గ అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాల సమర్పణ
  • భాజా భజంత్రీలు, పోతురాజుల న్రుత్య విన్యాసాలతో కొనసాగిన బోనాల ఊరేగింపు
  • ఇంద్రకీలాద్రిపై బంగారు బోనంకు స్వాగతం పలికిన ఆలయ కమిటి చైర్మన్, ఈవో
  • 2010 నుంచి విజయవాడలో తెలంగాణ బోనాలు.

ఆర్సీ న్యూస్,జులై 18 (విజయవాడ): తెలంగాణ బంగారు బోనం జాతరతో ఆదివారం విజయవాడ నగరంలో ఆథ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. విజయవాడ బ్రహ్మణ వీధి నుంచి ఇంద్రకీలాద్రి వరకు భక్తులు బంగారు బోనంతో సామూహిక ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున జరిగిన బోనాల జాతర ఊరేగింపులో ఉత్సవాల నిర్వాహకులు, భక్తులు, కళాకారులు, పోతు రాజులు పాల్గొన్నారు. పోతురాజుల న్రుత్యాలు దారిపొడవునా భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం తెలంగాణ పాతబస్తీ బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణలో అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2010 నుంచి పాతబస్తీకి చెందిన ఉత్సవాల నిర్వాహకులు ప్రతి ఆషాడ మాసంలో విజయవాడ కనక దుర్గ అమ్మవారికి భక్తిశ్రద్దలతో బంగారు బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో జరిగే విజయవాడ బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరుగుతాయి. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ భక్కులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంది. సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా  భక్తులు18వ తేదీన విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలలను అందజేశారు. విజయవాడ బ్రహ్మణ వీధి నుంచి భక్తి శ్రద్దలతో దేవాలయానికి సామూహిక ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృదం విజయవాడ కనక దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావుతో పాటు దేవాలయం ఈవో భ్రమరాంబ, ఆలయ కమిటి చైర్మన్ పైలా సోమినాయిడు బోనాల జాతర ఊరేగింపులో పాల్గొన్నారు. ఇంద్ర కీలాద్రిపై దేవాలయం ఈవో భ్రమరాంబ, ఆలయ కమిటి చైర్మన్ పైలా సోమినాయిడు తదితరులు బంగారు బోనం సామూహిక ఊరేగింపుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఊరేగింపు కమిటి అధ్యక్షులు బి.బల్వంత్ యాదవ్, ప్రదాన కార్యదర్శి మధుసూదన్ యాదవ్, మాజీ అధ్యక్షులు గాజుల అంజయ్య, జనగామ మధుసూదన్ గౌడ్, కమిటి ఉపాధ్యక్షులు కె.ఎస్.ఆనంద్ రావు, హరిబౌలీ బంగారు మైసమ్మ దేవాలయం కమిటి సలహాదారులు అనంతోజు హంసరాజ్, లాల్ దర్వాజ సింహవాహిణీ దేవాలయం కమిటి చైర్మన్ కె.వెంకటేష్, అరవింద్ కుమార్ గౌడ్, ప్యారసాని వెంకటేష్, గాజుల రాహుల్ తదితరులు పాల్గొని కనక దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా కమిటి అధ్యక్షులు బల్వంత్ యాదవ్ మాట్టాడుతూ… ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 30న, పాతబస్తీలోని ప్రధాన దేవాలయాలకు విజయవాడ కనక దుర్గ అమ్మవారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆలయ ఈవో భ్రమరాంబ తమతో చెప్పారన్నారు. ప్రతి ఆషాడ మాసం సందర్బంగా కనక దుర్గమ్మ తల్లి పట్టు వస్త్రాలు తీసుకుని పాతబస్తీలోని శ్రీ మహాంకాళి అమ్మవారి దేవాలయాలకు అందజేయడం జరుగుతుందన్నారు. ఇది గత కొంత కాలంగా ఆనవాయితీగా వస్తొందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30న,నగరానికి పట్టు వస్త్రాలు తీసుకురావడానికి దేవాలయం ఈవో తమ అంగీకారం తెలిపారన్నారు.