సెప్టెంబర్ 15, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఖైరతాబాద్ మహా గణపతి పూజలకు సిద్దం..

ఖైరతాబాద్ మహా గణపతి పూజలకు సిద్దం..
  • ఈసారి పంచ ముఖ రుద్ర మహా గణపతి దర్శనం..
  • 40 అడుగుల ఎత్తులో విగ్రహం తయారీ..
  • గతేడాది 18 అడుగుల విగ్రహం
  • ఈనెల 6 నుంచి కర్రల తొలగించి.. సాధారణ దర్శనం.
  • 10వ తేదీన అధికారిక పూజలు
  • 19న, నిమజ్జనం..

ఆర్సీ న్యూస్, సెప్టెంబర్ 5 (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి సిద్ధమైంది. గతేడాది కరోనా వైరస్ కారణంగా వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించినప్పటికీ.. ఆశించిన స్థాయిలో భక్తులు సంతృప్తి చెందలేదు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కొన్ని కొన్ని విగ్రహాలను మాత్రమే తయారు చేయించుకుని పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ విగ్రహం 18 అడుగులకు కుదించి భక్తుల దర్శనార్థం అందుబాటులోకి తెచ్చిన నిర్వాహకులు ఈసారి విగ్రహం ఎత్తు 40 అడుగుల వరకు పెంచారు. గత రెండు నెలలుగా నిరంతరం శ్రమించి విగ్రహాన్ని తయారు చేశారు. ప్రముఖ శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలోని శిల్పుల బృందం ఈసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని అత్యంత సుందరంగా.. ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పంచ ముఖ రుద్ర గణపతి పేరుతో తీర్చిదిద్దిన 40 అడుగుల ఖైరతాబాద్ వినాయక విగ్రహం తయారీ ఈ నెల 5 వ తేదీతో పూర్తయింది. సోమవారం నుంచి భక్తులకు విగ్రహం చక్కగా కనిపిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు 2019 లో 60 అడుగుల ఎత్తు వరకు తీర్చిదిద్దిన వినాయక విగ్రహాన్ని ఈసారి నలభై అడుగులకు కుదించారు. 2 నెలల క్రితం తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వినాయక విగ్రహం తయారీకీ శ్రీకారం చుట్టారు. గత రెండు నెలలుగా నిరంతరం శ్రమించిన శిల్పకళాకారులు పంచ ముఖ రుద్ర గణపతి విగ్రహాన్ని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. గత 67 ఏళ్ల నుంచి ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్న నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 10వ తేదీన విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను  దర్శనానికి అనుమతించనున్నారు. అయితే ఆదివారం రాత్రి వరకు వినాయక విగ్రహం తయారీ పూర్తికావడంతో.. విగ్రహం తయారీ కోసం ఏర్పాటు చేసిన సపోర్టు కర్రలను తొలగించారు. దీంతో సోమవారం నుంచి ఖైరతాబాద్ పంచ ముఖ రుద్ర మహాగణపతిని భక్తులు కనులారా తిలగించడానికి వీలు కలుగుతుంది. అధికారికంగా ఈ నెల 10వ తేదీన భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అప్పటి నుంచి అనంత చతుర్దశి  రోజైనా ఈ నెల 19వ తేదీ వరకు వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వీలు కలుగుతుంది. 19వ తేదీన ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని సామూహిక ఊరేగింపుగా వినాయక సాగర్ కు తరలించనున్నారు. ఆట పాటలతో దారిపొడవునా జై.. బోలో.. గణేష్ మహారాజ్ కి.. జై అంటూ భక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఖైరతాబాద్ పంచ ముఖ రుద్ర మహాగణపతిని ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయనున్నారు. ఈ నెల 10వ తేదీన విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర గవర్నర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించడం పరిపాటి. అయితే ఈసారి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ సై అందుబాటులో లేకపోవడంతో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తో పాటు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి  తదితరులను పూజలకు ఆహ్వానించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ సై ని పూజలకు ఆహ్వానించామని నిర్వాహకులు తెలిపారు. కరోనా వైరస్ పూర్తిగా తగ్గకపోవడంతో ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని దర్శించడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. భక్తులను అదుపు చేయడానికి తాము కొంతమందిని ప్రత్యేక వాలంటీర్లుగా నియమిస్తున్నామని.. వీరందరూ కరోనా వైరస్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్లు సర్టిఫికెట్లు చూపించిన వారికే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుందన్నారు. దర్శనానికి ముందుగా శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నామన్నారు. పంచ ముఖ రుద్ర మహా గణపతి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన చర్యలు తీసుకుంటూ భక్తులను దర్శనానికి అనుమతించనున్నామని నిర్వాహకులు తెలిపారు.