ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

గోల్కొండ అమ్మవారి బోనం తో ఉత్సవాలు ప్రారంభం..

గోల్కొండ అమ్మవారి బోనం తో ఉత్సవాలు ప్రారంభం..

 

  • గోల్కొండ బోనాలకు రూ.10 లక్షలు
  • సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంజూరు
  • దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ గుళ్లకు నిధుల మంజూరీ…
  • గోల్కండ బోనాల జాతర ఉత్సవాలపై మంత్రి తలసాని సమీక్షా సమావేశం
  • సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు
  • భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలకు ఆదేశాలు..

ఆర్సీ న్యూస్,జూలై 5 (హైదరాబాద్): నగరంలో ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాల ప్రారంభానికి ఇక ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల 11న,గోల్కొండ జగదాంబ అమ్మవారికి నిర్వహించే మొదటి బోనంతో ఈసారి నగరంలో ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా సోమవాారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గోల్కొండ కోట వద్ద ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గోల్కొండ జగదాంబ అమ్మవారికి జరిగే బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అధికారు లను ఆదేశించారు. ఓపెన్ నాలాలు, డ్రైనేజి మురికి నీటి సమస్యలు, వీధి దీపాలు వెలగకపోవడం, రోడ్ల మరమ్మత్తులు, ప్యాచ్ వర్క్స్ , మంచి నీటి సరఫరా తదితర సమయ్యలు తలెత్తకుండా సంబందిత అధికారులు ఎప్పకిటప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ…దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ దేవాలయాలకు నిధులను కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బోనాల పండుగ సందర్బంగా గుళ్లకు నిధులను అందజేస్తున్నామన్నారు. గోల్కొండ జగదాంబ అమ్మవారి దేవాలయానికి సీఎం కేసీఆర్ రూ. 10 లక్షలు అందజేయ మన్నారని మంత్రి తెలిపారు. దీంతో పాటు ఇంకా ఏవైనా అవసరమైతే అప్పడు చూద్దామని ఆయన స్థానిక దేవాలయం కమిటి ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. గతేడాది కరోనా వైరస్ వ్యప్తి కారణంగా బోనాల జాతర ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయన్నారు. ఈసారి బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి ఉత్సవాల నిర్వహణ,దేవాలయాల వద్ద నిర్వహించే అభివృద్ది పనుల కోసం రూ.15 కోట్లు కేటాయించిందన్నారు. అమ్మవారి దేవాలయాలకు చెందిన ఉత్సవాల నిర్వాహకులకు ప్రభుత్వం నుంచి కేటగిరిల వారిగా నిధులు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహీనుద్దీన్, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావీణ, వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

25న,సికింద్రాబాద్..ఆగస్టు 1న పాతబస్తీతో పాటు నగరంలో బోనాల జాతర..

గతేడాది కోవిడ్ -19 ఆంక్షల నడుమ ఎలాంటి హడావుడి లేకుండా బోనాల జాతర ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. భక్తులెవరు లేకుండా ఇళ్లల్లోనే అమ్మవారికి బోనాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో నగరంలోని అన్ని ప్రాంతాలలో భక్తులు ప్రభుత్వ ఆంక్షలను పాటిస్తూ అమ్మవారికి భక్తి శ్రద్దలతో బోనాలను సమర్పించారు.

బోనాల సమర్పణ అనంతరం మరుసటి రోజు నిర్వహించే సామూహిక అమ్మవారి ఘటాల ఊరేగింపు సైతం భక్తుల రద్దీ లేకుండానే ముగిసింది. ఈసారి మాత్రం బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించడానికి ఉత్సవాల నిర్వాహకులు తగిన ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు. నగరంలో జూలై 11వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారికి నిర్వహించే మొదటి బోనంతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమవుతుండగా…ఈ నెల 23న కలశ స్థాపనతో పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు మొదలవుతాయి. అలాగే 25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కన్నుల పండువగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు నిర్వహించనున్నారు. శాలిబండలోని కాశీవిశ్వనాథ్ దేవాలయం నుంచి పాతబస్తీలోని అమ్మవారి ఘట స్థాపన ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఊరేగింపు అనంతరం ఆయా దేవాలయాలలో అమ్మవారి ఘట స్థాపన జరుగుతుంది. అనంతరం ఆగస్టు 1వ తేదీన నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్ఫన కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తి శ్రద్దలతో జరుగుతుంది. ఆగస్టు 2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి.