areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

బెదిరింపు కాల్ పై విచారణకు ఆదేశించిన పోలీసు కమిషనర్..

బెదిరింపు కాల్ పై విచారణకు ఆదేశించిన పోలీసు కమిషనర్..
  • మొగల్ పురా ఇన్స్పెక్టర్ రవికుమార్ కు బెదిరింపు కాల్..
  • తుహ్మారా వర్దీ ఉతార్ తా హూం..ఖబడ్దార్..అంటూ బెదిరింపు
  • వైరల్ గా మారిన యువకుడి ఫోన్ కాల్
  • సీరియస్ ఐన నగర పోలీసు కమిషనర్
  • ఇప్పటికే నిందితుడిపై కేసు నమోదు..
  • వైరల్ అవుతున్న ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ మరో ఫోన్ కాల్

ఆర్సీ న్యూస్( హైదరాబాద్): హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మొగల్ పురా పోలీసు ఇన్స్పెక్టర్ ను వాట్సాప్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన సంఘటనపై నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ విచారణకు ఆదేశించారు. విధినిర్వాహణలోని పోలీసు అధికారిని ‘‘ నీ శరీరంపై ఉన్న ఖాకీ దుస్తులను తొలగింపు చేస్తా..మాతో పెట్టుకోకు..నీవు పోలీసు అధికారివా..లేక ఆర్ ఎస్ ఎస్ నాయకుడివా..ఒక వర్గం వారికి కొమ్ముకాస్తున్నావ్.. కావాలని ఉద్దేశ్యపూర్వకంగా మా మతానికి చెందిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నావ్..ఇక ముందు అట్లా చేస్తే..తుహ్మారా వర్దీ ఉతార్ తా హూం..ఖబడ్దార్..’’ అంటూ బెదిరించడంపై నగర పోలీసు కమిషనర్ సీరియస్ అయ్యారు. నిందితుడి ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనవరమైన విషయంలో జోక్యం చేసుకుని ఇష్టానుసారంగా దురుసుగా మాట్లాడిన అతనిపై తగిన చర్యలకు సీపీ ఆదేశించారు. విచారణాధికారిగా మొగల్ పురా పోలీసు స్టేషన్ కు చెందిన అదనపు సీఐ రంజిత్ కుమార్ గౌడ్ ను నియమించారు. ఇప్పటికే నిందితుడిపై మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక అందజేయాలని పోలీసు కమిషనర్ విచారణాధికారి రంజిత్ కుమార్ గౌడ్ ను ఆదేశించారు.

అసలేం జరిగింది..

మీరాలంమండికి చెందిన ఓ యువకుడు..మరో యువతి స్నేహితులు. వీరిరువురి మతాలు వేరు. యువకుడు పని చేసే దుకాణం వద్దకు యువతి వచ్చి నూడిల్స్ తినేది. రోజు వస్తుండడంతో ఇరువురికి పరిచయం ఏర్పడి స్నేహితులయ్యారు. మే 31వ తేదీ..ఇరువురు మొఘల్ పురా ఓల్టా హోటల్ వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా..అక్కడే ఉన్న యువతి మతానికి చెందిన ఇద్దరు యువకులు జోక్యం చేసుకుని మా మతానికి చెందిన యువతిని ఎక్కడికి తీసుకెళుతున్నావంటూ అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా యువతీ యువకులను చితక బాదారు. తీవ్రంగా గాయపడిన యువకుడు వెంటనే మొఘల్ పురా పోలసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అకారణంగా దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ఈ నెల 1న, రిమాండ్ కు తరలించారు.

వైరల్ గా మారిన నిందితుడి బెదిరింపు ఫోన్ కాల్…

విషయం తెలుసుకున్న ఆసిఫ్ ఇక్బాల్ అనే నిందితుడు మొఘల్ పురా ఇన్స్ పెక్టర్ రవికుమార్ కు వాట్సాప్ కాల్ చేసి బెదిరించాడు. అతని కాల్ కు ముందు తలాబ్ చంచలం డివిజన్ సిట్టింగ్ కార్పొరేటర్, మొగల్ పురా సీఐ కు ఫోన్ చేసి కేసు పెట్టవద్దని..ఇది ఆకతాయితనం గా జరిగిన సంఘటనగా మాత్రమే చూడాలని..ఇద్దరు యువకులను ఎందుకు కొడుతున్నారంటూ నిలదీసింది. వీరిద్దరి సంభాషణ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కార్పోరేటర్ కాల్ అనంతరం ఆసిఫ్ ఇక్బాల్ అనే నిందితుడు ఇన్స్ పెక్టర్ రవికుమార్ కు ఫోన్ చేసి దుర్బాషలాడిన వాయిస్ కాల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విధినిర్వాహణలోని పోలీసు అధికారి బట్టలూడదీసి పంపిస్తా..అంటూ చేసిన బెదిరింపు పట్ల పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని వదలకుండా..చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

 ప్రస్తుతం నిందితుడు యెమన్ దేశంలో…

ప్రస్తుతం నిందితుడు యెమన్ దేశంలో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిపై ఇప్పటికే మొఘల్ పురా,చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ ల పరిధిలో కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే నిందితుడిపై కేసులు నమోదైనప్పటికీ..పాస్ పోర్ట్ ఎలా సంపాదించాడు..? విదేశాలకు ఎలా వెళ్లాడు..? అనే విషయాలు తెరపైకి వస్తున్నాయి. కేసులు నమోదైనప్పటికీ..ఇంకా పూర్తి స్థాయి విచారణ జరిగి శిక్షలు పడలేదని..అంతకుముందే పాస్ పోర్ట్ ఉన్నందున విదేశాలకు పారిపోయినట్లు సంబందిత పోలీసులు తెలిపారు.

వైరల్ అవుతున్నచార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్…

మొఘల్ పురా సంఘటనపై ఒక గుర్తు తెలియని వ్యక్తి చార్మినార్ నియోజకవర్గం మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు ఫోన్ చేసి దూషించాడు. మనకు ఇంత అవమానం జరుగుతుంటే..నీవెలా చూస్తూ కూర్చున్నావ్..మొఘల్ పురా ఇన్స్ పెక్టర్ ను వెంటనే సస్సేండ్ చేయి..అరెస్టు చేసిన యువకులను నీవు ఎందుకు విడిపించ లేదు. వారి విషయాన్ని కార్పొరేటర్ ఇన్స్ పెక్టర్ ద్రుష్టికి తీసుకొస్తే..నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చెయ్యి..అంటూ యువకుడు ఎమ్మేల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు చేసిన వాయిస్ కాల్ అన్ని వాట్సాఫ్ గ్రూప్ లలో వైరల్ అవుతుంది. దీనికి ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ జవాబిస్తూ…ఇన్స్ పెక్టర్ చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. బాగా చేసిండూ. యువతితో పాటు అడ్డుకున్న ఇద్దరు యువకులు కూడా మంచి వారు కాదు. వారు పోకిరీలు. నేను పోలీసు కమిషనర్ ను కాదు..సస్పెండ్ చేయడానికి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు..జాగ్రత్త.. అంటూ ముంతాజ్ ఖాన్ ఘాటుగా జవాబిచ్చేసరికి ఆ యువకుడు ఫోన్ పెట్టేశాడు.