areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రోడ్డు ప్రమాదంలో “ప్రతి రోజు పండగే”..హీరో

రోడ్డు ప్రమాదంలో " ప్రతి రోజు పండగే "..హీరో
  • పండగ పూట రోడ్డు ప్రమాదానికి గురైన టాలీవుడ్ హీరో సాయి ధరం తేజ్.
  • కుడి కన్ను, చాతి పై గాయాలు
  • ప్రాణాపాయం తప్పిందంటున్న వైద్యులు
  • ఇసుకలో బైక్ స్కిడ్ కావడంతో జరిగిన ప్రమాదం
  • అతివేగం..నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం అంటున్న పోలీసులు
  • మోటార్ వెహికిల్ ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు

ఆర్సీ న్యూస్, సెఫ్టెంబర్ 11(హైదరాబాద్): టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రతి రోజు పండగే.. సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సాయి ధరంతేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మెగా కుటుంబ సభ్యులు ఓవైపు భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాలకు పూజలు నిర్వహిస్తుండగా… టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సమాచారం మెగా ఫ్యామిలీ తో పాటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులను ఈ ప్రమాదం వార్త షాక్ కు గురిచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటల 15 నిమిషాలకు మాదాపూర్లో సాయి ధరంతేజ్ స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని మాదాపూర్ పోలీసులు భావిస్తున్నారు. హెల్మెట్ ధరించిన సాయిధరం తేజ్.. 1160 సిసి ట్రిపుల్ ఇంజన్ తో తయారైన ట్రైంఫ్- స్ట్రీట్ ట్రిపుల్ అనే స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా రోడ్డుపై ఉన్న ఇసుక కారణంగా జారీ బైక్ పై నుంచి కింద పడ్డాడు. బైక్ తో పాటు సాయి ధరమ్ తేజ్ రోడ్డుపై కొద్ది దూరం వరకు రోడ్డుకు రాసుకుంటూ వెళ్ళాడు. బైక్ జారి కింద పడటంతో తలకు ధరించిన హెల్మెట్ ఓడిపోయింది. సాయి ధరమ్ తేజ్ కుడి కన్ను తోపాటు ఛాతిపై బలమైన గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ను వెంటనే చికిత్స నిమిత్తం మెడికవర్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందజేశారు. సిటీ స్కాన్ తీసిన అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు అనంతరం మెడికవర్ ఆసుపత్రి కి చేరుకుని వివరాలు సేకరించారు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు హుటాహుటిన మెడికవర్ ఆసుపత్రి కి చేరుకొని సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సినీ నటులు పవన్ కళ్యాణ్ మెడీకవర్ ఆసుపత్రికి చేరుకొని సాయి ధరమ్ తేజ్ కు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం సాయి ధరంతేజ్ అపస్మారక స్థితిలో ఉన్నారని.. స్వల్ప గాయాలు అయ్యాయని.. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదనే విషయాన్ని సంబంధిత వైద్యులు స్పష్టం చేశారన్నారు. 2019 లో సాయి ధరమ్ తేజ్ నటించిన “ప్రతి రోజు పండగే” తెలుగు సినిమా విడుదలైన వారం రోజుల్లోనే బాక్సాఫీసును బద్దలు కొట్టి రూ.25 కోట్లు వసూలు చేసింది. ప్రతి రోజు పండగే సినిమా ద్వారా సాయి ధరమ్ తేజ్ మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. సాయి ధరమ్ తేజ్ నటనకు ఎంతోమంది ఫిదా ఐన ఆయన అభిమానులు ప్రమాదం జరిగిన సమాచారాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సాయి ధరంతేజ్ వెంటనే కోలుకోవాలని ఆయన అభిమానులు దేవున్ని ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉండగా అతివేగం కారణంగా టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారని… నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావించిన మాదాపూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.  ఐపీసీ 336, 184 మోటార్ వెహికల్ ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తూ కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గురైన స్పోర్ట్స్ బైక్ బుర్ర అనిల్ కుమార్ పేరుతో ఆర్టీఏలో రిజిస్టర్ అయిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బైక్ పై నుంచి రోడ్డుపై బలంగా కింద పడటంతో సాయి ధరమ్ తేజ్ కాలర్ బోన్ విరిగిందని.. శ్వాస సంబంధమైన సమస్యలు తప్ప ఎలాంటి ప్రమాదం లేదని సంబంధిత వైద్యులు స్పష్టం చేశారు. దీంతో మెగా అభిమానులతో పాటు సాయి ధరమ్ తేజ్ అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.