మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

భాగ్యలక్ష్మీ అమ్మవారికి ఘనంగా వరలక్ష్మీ పూజలు..

భాగ్యలక్ష్మీ అమ్మవారికి ఘనంగా వరలక్ష్మీ పూజలు..
  • శ్రావణ మాసం రెండో శుక్రవారం పూజలు
  • చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి పోటెత్తిన భక్తులు
  • ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
  • బారికేడ్లు ఏర్పాట్ల ఏర్పాటు.. క్యూ లైన్ మెయింటెన్

 

ఆర్సీ న్యూస్, ఆగస్టు 20 (హైదరాబాద్): చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంలోని రెండో శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతం పూజల సందర్భంగా చార్మినార్ భాగ్య లక్ష్మి అమ్మవారి దర్శనం కోసం భక్తులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్వాహకులు బారికేడ్లు ఏర్పాటు చేసి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పూజల సందర్భంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దక్షిణ మండలం పోలీసులు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. వరలక్ష్మీ వ్రతం పూజలను పురస్కరించుకొని దేవాలయాన్ని అత్యంత వైభవంగా కన్నుల పండువగా తీర్చి దిద్దారు. వివిధ రకాల పూలతో అమ్మవారి గర్భగుడితో పాటు దేవాలయ ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. శ్రావణ శుక్రవారం రోజు మహిళా భక్తులు తమ తమ ఇళ్లలో లక్ష్మీ దేవి పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. ఇళ్లల్లో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు అమ్మవారి చిత్రపటాలకు పూలు,పళ్ళు, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులను ఇంటికి ఆహ్వానించి పసుపు కుంకుమలతో వాయినాలు అందజేశారు. శుక్రవారం నగరంలో ఎటు చూసినా పండుగ వాతావరణం కనిపించింది. ఆకాశంలో మబ్బులు ఏర్పడినప్పటికీ…ఎక్కడ వర్షం కురవకపోవడంతో భక్తులు ఆనందంగా ఉత్సాహంతో పూజలు నిర్వహించారు. కొంత మంది వేద పండితులను తమ తమ ఇళ్ళకు ఆహ్వానించి పూజలు నిర్వహించారు. అమ్మవారి దేవాలయాలలో భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. పలువురు అధికార అనధికార ప్రముఖులు దేవాలయాలను సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం చార్మినార్ పరిసరాల్లో మత సామరస్యం చోటు చేసుకుంది. ఓవైపు బీబీకాఆలం సామూహిక ఊరేగింపు ఉండగా… మరోవైపు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. దీంతో ఇరు వర్గాలకు చెందిన ప్రజలు చార్మినార్ పరిసరాల్లో అధికంగా కనిపించారు. ఎటు చూసినా ప్రజల సందడి కనిపించింది. ఇరు వర్గాలకు చెందిన కార్యక్రమాలతో చార్మినార్ పరిసరాలలో ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది.

: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి శుక్రవారం భక్తులు పోటెత్తారు.
: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి శుక్రవారం భక్తులు పోటెత్తారు.

శ్రావణ శుక్రవారం ని పురస్కరించుకుని పాతబస్తీలోని అన్ని ప్రధాన  దేవాలయాలను అందంగా తీర్చిదిద్దారు. మీరాలంమండి లోని శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం, లాల్ దర్వాజ లోని సింహవాహిని మహంకాళి దేవాలయం, సుల్తాన్ షాహి లోని జగదాంబ దేవాలయం, ఉప్పుగూడ లోని శ్రీ మహంకాళి దేవాలయం, బేలా లోని ముత్యాలమ్మ దేవాలయం, హరిబౌలి లోని అక్కన్న మాదన్న దేవాలయం లలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ దేవాలయాల కమిటీ ప్రతినిధులు భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటూ భక్తులు శుక్రవారం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.