నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

సర్కారుకు సమాధి కడతాం.. మంద కృష్ణ

సర్కారుకు సమాధి కడతాం.. మంద కృష్ణ.
  • వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్రంగా కొనసాగించాలి..
  • ఇతర మంత్రిత్వ శాఖలో కలపరాదు..
  • ఒకవేళ అలా జరిగితే సర్కార్ కు సమాధి తప్పదు..
  • వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..
  •  వికలాంగులకు నెలకు రూ. 6000 పింఛన్ ఇవ్వాలి..
  • వీ హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో జరిగిన వికలాంగుల పోరాట దినోత్సవంలో మాట్లాడిన మంద కృష్ణ మాదిగ..

 ఆర్సీ న్యూస్, నవంబర్ 26 (హైదరాబాద్): వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్రంగా కొనసాగించాలని.. ఇతర మంత్రిత్వ శాఖలో కలప రాదని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇతర మంత్రిత్వ శాఖలో కలిపినట్లయితే సర్కార్ కు సమాధి కడతామని హెచ్చరించారు. వికలాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని దీర్ఘకాలికంగా ఉన్న వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి( వి.హెచ్.పి. ఎస్ ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ధర్నాచౌక్ లో పోరాట దినోత్సవం మహాసభ జరిగింది. గత కొంత కాలంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆయా సమస్యల పరిష్కారం కోరుతూ పోరాట బాట పట్టింది.  ఇందులో భాగంగా ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికలాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్రంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సంక్షేమం కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. వికలాంగుల పింఛన్ నెలకు ఆరువేల రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము ప్రతిపాదించిన డిమాండ్ పట్ల అన్ని రాజకీయ పార్టీలు తమకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. తమ ప్రతిపాదన పట్ల ప్రతిపక్ష పార్టీలన్నీ స్పందించాలన్నారు. గతంలో జరిగిన ఎన్నికలకు ముందు వికలాంగుల పింఛను రూ.1500 నుంచి 3000 రూపాయలకు పెంచాలని తాము డిమాండ్ చేశామన్నారు. అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మహా కూటమి ఎన్నికల బరిలోకి దిగుతుందని.. మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ తదితర మిత్రపక్షాలు ఉంటాయని.. ఒకవేళ ఆ ఎన్నికల్లో మహా కూటమి అభ్యర్థులు విజయం సాధించి అధికారంలోకి వస్తే వికలాంగులకు నెలకు మూడు వేల రూపాయల పింఛన్ మంజూరు చేస్తామని ప్రకటించిన వెంటనే తర్జన భర్జనకు గురైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహా కూటమి ప్రకటనతో ఖంగు తిని వికలాంగులకు నెలకు మూడు వేల రూపాయల పింఛన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. ఇలా మహా కూటమి ప్రకటన పట్ల కెసిఆర్ భయాందోళనకు గురై వికలాంగులకు నెలకు రూ. 3000 పింఛన్ అమలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఇస్తున్న పింఛను రూ. 6 వేలకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. 2004 ఆగస్టు 7వ తేదీన నగరంలోని ట్యాంక్ బండ్ పై  ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధనం చేస్తే.. ఆ రోజు నుంచి కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేద పిల్లలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. దాని స్ఫూర్తితోనే ఆరోగ్యశ్రీ వచ్చిందన్నారు. ఒకప్పుడు పేదలు చచ్చినా.. బతికినా.. ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్సలు చేయించుకునే వారని.. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కార్డుపై కార్పొరేటు స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలుగునేలపై పేద వారికి గుండె జబ్బు వస్తే వెంటనే ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఇందు కోసం వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం తాము నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించక పోతే.. రాబోయే రోజుల్లో ఆందోళనను ఉద్ధృతం చేస్తామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు గోపాల్ రావు, రాష్ట్ర అధ్యక్షులు ఖాసీం, జాతీయ నాయకులు రాంబాబు, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.