నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

హైకోర్టులో ఫిర్యాదు.. నామ్కే వాస్తేగా ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్..

  • సాదాసీదాగా కొనసాగిన కార్యక్రమం..
  • చార్మినార్ కట్టడానికి లైట్లు సైతం లేవు..
  • త్రివర్ణ విద్యుత్ వెలుగులు లేకపోవడంతో బోసిపోయి కనిపించిన చార్మినార్..
  • స్టేజి లేదు.. ఎంటర్టైన్మెంట్ లేదు.. ఎల్ఈడి షో లేదు..
  • చివరికి సెల్ఫీలు దిగడానికి ఖాళీ స్థలం సైతం కనిపించలేదు.
  • ఇరుకు ఇరుకుగా మారిన చార్మినార్ పరిసరాలు..

ఆర్సీ న్యూస్, నవంబర్ 14(హైదరాబాద్): చార్మినార్ వద్ద వారం విడిచి వారం నిర్వహిస్తున్న ఏక్ షామ్..చార్మినార్ కె నామ్.. కార్యక్రమంపై ఒక స్వచ్ఛంద సంస్థ అభ్యంతరం తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఆదివారం చార్మినార్ వద్ద కార్యక్రమం సాదాసీదాగా కొనసాగింది. ఎలాంటి హడావుడి లేకుండా నామ్ కే వాస్తే గా..జరిగింది. ఎంటర్టైన్మెంట్ అంటూ.. ప్రారంభమైన కార్యక్రమం ఈ ఆదివారం పక్కా బిజినెస్ గా మారిపోయింది. గత రెండు వారాలు త్రివర్ణం రంగుల్లో వెలుగులు విరజిమ్మిన చార్మినార్ కట్టడం ఈసారి ఎలాంటి విద్యుత్ వెలుగులు లేకుండా బోసి పోయి కనిపించింది. గత నెల 17వ తేదీన ప్రారంభమైన ఏక్ షామ్ చార్మినార్ కే నామ్..కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది ముస్లిం మత పెద్దలతోపాటు ముస్లిం స్వచ్ఛంద సంస్థలు పలు అభ్యంతరాలు తెలపడంతో కార్యక్రమాల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా ఈ విషయం పై గత నెల 27వ తేదీన హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఆదివారం కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించారు. ఎలాంటి స్టేజీ లేకపోవడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించ లేదు. ఎల్ ఈ డి షో లేదు.. చివరికి చార్మినార్ కట్టడానికి విద్యుత్ వెలుగులు సైతం లేవు. ఎటు చూసినా చిరు వ్యాపారాలతో పాటు తాత్కాలిక గుడారాలు వేసి నిర్వహించిన వ్యాపార సముదాయాలు మాత్రమే కనిపించాయి. చార్మినార్ కట్టడానికి త్రివర్ణం విద్యుత్ లైట్లు వేయడానికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏ ఎస్ ఐ) అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో చార్మినార్ కట్టడానికి విద్యుత్ లైట్లను వేయలేకపోయామని కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) సెక్రెటరీ గురు వీర తెలిపారు. ఈనెల 25వ తేదీన ఏక్ షామ్..కార్యక్రమంపై హైకోర్టులో విచారణ జరగనుండటంతో కోర్టు నిర్ణయం మేరకు ఎలాంటి ఆదేశాలు వస్తాయో అప్పటి వరకు కార్యక్రమాన్ని సాధారణంగా నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఈ ఆదివారం జరిగిన ఏక్ షామ్.. కార్యక్రమం నామ్ కే వాస్తే కొనసాగిందని చెప్పవచ్చు. కాకపోతే.. సందర్శకుల సందడి మాత్రం తగ్గలేదు. ఒకరినొకరు తగులుతూ ఇరుకు ఇరుకు గా ముందుకు కదిలారు. చార్మినార్ కట్టడం ప్రాంగణం చుట్టూ ఖాళీ స్థలం ఎక్కువగా లేకపోవడంతో పరిసరాలన్నీ రద్దీగా మారాయి. దీంతో చార్మినార్ కట్టడం వద్ద సరదాగా గడపడానికి వచ్చిన యువతీ యువకులు తీవ్ర నిరాశకు గురయ్యారు.గత నెల 17 వ తేదీన మొదటిసారి ప్రారంభమైన కార్యక్రమాన్ని వారం విడిచి వారం నిర్వహించడానికి రూపొందించిన కార్యాచరణలో భాగంగా ఈనెల ఏడో తేదీన కార్యక్రమం జరగలేదు. కాగా ఈనెల 14వ తేదీన తిరిగి ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఇది మామూలుగానే కొనసాగిందని చెప్పవచ్చు. వాస్తవానికి ప్రతి ఆదివారం చార్మినార్ వద్ద సహజంగానే సందర్శకుల సంఖ్య అధికంగా ఉంటుంది.. దీనికి తోడు ఏక్ షామ్.. కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తుండడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. గత రెండు వారాలు యువతీ యువకులు చార్మినార్ వద్ద జరిగిన కార్యక్రమంలో సరదాగా కాలక్షేపం చేయగా… ఈ ఆదివారం తీవ్ర నిరాశకు గురయ్యారు.