areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఇక పది రోజులు కఠినంగా ఆంక్షల అమలు: నగర సీపీ

ఇక పది రోజులు కఠినంగా ఆంక్షల అమలు: నగర సీపీ
  • ఈ నెల 10 నుంచి 19 వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు
  • ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు సడలింపు
  • సాయంత్రం 6 నుంచి కఠినంగా లాక్ డౌన్ అమలు
  • అనవసరంగా రోడ్ల మీదకు వస్తే..కేసులు,వాహనాల స్వాధీనం
  • మూడు షిఫ్టుల్లో 14 వేల మంది విధినిర్వాహణలో పోలీసులు

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): ఈ నెల 10వ తేదీ నుంచి పది రోజులు పగటిపూట లాక్ డౌన్ తొలగిస్తుండడం…రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉంటుండడంతో ఆంక్షలను కఠినంగా అమలు చేయనున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.  ప్రజలు ఎవరూ రాబోయే పది రోజుల్లో రాత్రిపూట అనవసరంగా రోడ్ల మీదకు రావద్దని ఆయన ప్రజలను కోరారు.  నగరంలో కొనసాగుతున్న లాక్ డౌన్ అమలు తీరును నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ బుధవారం స్వయంగా పరిశీలించారు. నగరంలోని అన్ని జోన్ల పరిధిలో ఆయన సంబంధిత పోలీసు అధికారులతో కలిసి  కలియతిరిగారు. ఒకవైపు నగరంలో కొనసాగుతున్న లాక్ డౌన్ అమలు తీరును పరిశీలిస్తునే మరోవైపు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా నగర ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహణ కూడా కల్పిస్తున్నారు. బుధవారం నగరంలోని రవీంద్రభారతి చౌరస్తా వద్ద కరోనా వేషాధరణతో పోలీసులు ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు. కరోెనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ఈ ప్రదర్శన ద్వారా వివరించారు. మాస్క్ లు ధరిస్తూ..భౌతిక దూరం పాటించాలని ప్రదర్శనలో పాల్గొన్న పోలీసులు సూచించారు. ఈ నెల 10వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలులో సడలింపులు ఉన్నందున నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం రాబోయే పది రోజుల పాటు అమలు చేయనున్న రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలను తూచాతప్పకుండా పాటించాలని కమిషనర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగరంలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు జరుగుతుందన్నారు. బుధవారంతో లాక్ డౌన్ పూర్తి అవుతుందని.. గురువారం నుంచి జీవో నెం.119 ద్వారా మరో పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా వైరస్ వ్యాప్తికి బాధ్యులు కావద్దన్నారు. ఈనెల 19వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట లాక్ డౌన్ అమలో ఉంటుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్ డౌన్ లో సడలింపు ఉంటుందన్నారు. ఈ పది రోజుల పాటు రాత్రిపూట లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేయనున్నామన్నారు. అనవసరంగా రోడ్లమీదకు వచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇప్పటి వరకు 6 వేలకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రోజుకు 12 గంటల సడలింపు సమయం లభించిన తర్వాత కూడా రోడ్ల మీదకు వస్తే..కేసులు తప్ప వన్నారు. మెడికల్ తదితర అత్యవసర పనులు లేకుండా పట్టుబడితే..తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తామన్నారు. సడలింపు సమయం ముగియగానే ఇంటి వద్దే సురక్షితంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు నగరంలోని అన్ని ప్రాంతాలతో పాటు పాతబస్తీలో కూడా లాక్ డౌన్ చక్కగా అమలు జరిగిందన్నారు. దాదాపు 14 వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది 3 షిఫ్టుల్లో రౌండ్ ది క్లాక్ సేవలు అందించారన్నారు.  రెండు వేలకు పైగా పోలీసులు కరోనా వైరస్ బారిన పడి వైద్య సేవలు పొందారన్నారు. 17 మంది వరకు పోలీసులు కరోనా వైరస్ సోకి మృతి చెందారన్నారు. ఇప్పటి వరకు లాక్ డౌన్ అమలును  అన్ని వర్గాల ప్రజలు పాటించారన్నారు. అంతేకాకుండా విధినిర్వాహణ లోని పోలీసులకు తమ సహాయ సహకారాలను పూర్తిగా అందజేయడంతో లాక్ డౌన్ చక్కగా అమలు జరిగిందన్నారు. ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా సహకరించడం తో తమ సూచనలు,సలహాలు ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు చేరాయన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నారు. కొంతమంది యువకులు కావాలని రోడ్ల మీదకు వచ్చి కరోనా వైరస్ వ్యాప్తికి పాల్పడుతున్నా రన్నారు. కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉన్నందున తామంతా ఇళ్లలోనే ఉండాలన్నారు. సకాలంలో వైద్య సేవలు పొందడమే కాకుండా కరోనా వైరస్ కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వారందరూ ఎలాంటి మానసిక ఆందోళన లేకుండా కోలుకుంటున్నారని ఆయన వివరించారు. రాబోయే 10 రోజుల పాటు లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేస్తే..కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకున్న వారమవుతామన్నారు. ఈనెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కరోనా కట్టడికి రోడ్లపై వాహనాల రాకపోక లను పూర్తిగా కట్టడి చేస్తామన్నారు. దీనికి అందరి సహకారం ఎంతో అవసరమని పోలీసు కమిషనర్ నగర ప్రజలను కోరారు. నగరంలో ఏర్పాటు చేసిన 150 చెక్ పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపైకి వస్తున్న వాహన దారులను కట్టడి చేస్తున్నామన్నారు. ఇక ముందు కూడా సరైన అనుమతి పత్రాలు ఉన్న వారిని వదిలేసి..ఎలాంటి పత్రాలు లేని వారికి లాక్ డౌన్ పై అవగాహన కల్పించి కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నామన్నారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి నగరంలోని అన్ని జోన్ లకు చెందిన పోలీసు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలు స్వాధీనం చేసుకుంటారన్నారు.