ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

తెలంగాణ రాష్ట్రంలో మొదలైన లాక్ డౌన్..

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ మొదలైంది.

ఆర్సీ న్యూస్ (హైదరాబాద్):  తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ మొదలైంది. ఈ నెల 12వ తేదీ నుంచి  10 రోజుల పాటు కొనసాగే లాక్ డౌన్ బుధవారం ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీ వరకు రోజుకు ఇరవై గంటల పాటు లాక్ డౌన్ కొనసాగుతుంది. కరోనా కట్టడికి అవసరమైన చర్యలపై మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన కేబినెట్ మీటింగ్ లో లాక్ డౌన్ విధింపు,కరోనా కట్టడి తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్ 10 రోజుల పాటు లాక్ డౌన్ విధింపు నిర్ణయం తీసుకోవడంతో 12వ తేదీ నుంచి లాక్ డౌన్ మొదలైంది.  కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధింపు తప్పనిసరి అయ్యింది. దీంతో బుధవారం నుంచి ఇరవై గంటల పాటు లాక్ డౌన్ అమలు లోకి వచ్చింది. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఉంటుంది. బుధవారం ఉదయం పది గంటల నుంచి లాక్ డౌన్ అమలు జరుగుతోంది. బుధవారం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ప్రజలు తమకు అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు అవసరమైన అన్ని లావాదేవీలను యథావిధిగా కొనసాగించారు. అన్ని రకాల దుకాణాలు, వ్యాపార సముదాయాలు పని చేసాయి. సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు..తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేసే రేషన్ దుకాణాల సమయాలు సైతం మారిపోయాయి. బుధవారం 6 గంటలకే రేషన్ దుకాణాలను తెరిచారు. కార్డుదారులకు అవసరమైన నిత్యావసర వస్తువులను 10 గంటల వరకు పంపిణీ చేశారు. అలాగే వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు పొద్దంతా తెరిచి ఉంచి మద్యం అందజేసేవారు. ఇక తెలంగాణ లో   లాక్ డౌన్ కారణంగా బుధవారం 6 గంటలకే మధ్యం అందుబాటులోకి వచ్చేసింది. కొన్ని బార్ లలో ఉదయమే మధ్యం సేవిస్తున్న మందుబాబులు కనిపించారు. అలవాటు ప్రకారం మధ్యం తాగుతాం కాబట్టి.. తప్పనిసరి పరిస్థితులలో లాక్ డౌన్ సందర్బంగా ఉదయమే తాగాల్సి వస్తోందని కొంత మంది మద్యం తాగిన మందు బాబులు తెలిపారు. రేషన్ దుకాణాలు, వైన్ షాప్స్ ఇక ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పని చేస్తాయి.

 

ఉదయం 6 నుంచి మార్కెట్ లలో మొదలైన సందడి…..

బుధవారం ఉదయం 10 గంటల నుంచి తెలంగాణ లో లాక్ డౌన్ మొదలవుతుండడంతో…ప్రజలంతా తమకు అవసరమైన కూరగాయలు,నిత్యావసర వస్తువులను ఖరీదు చేయడానికి స్థానిక ప్రాంతాలలోని మార్కెట్ లను ఆశ్రయించడంతో మార్కెట్ వీధులన్నీ వినియోగదారులతో రద్దీగా మారాయి.  ప్రధాన మార్కెట్ లన్నీ వినియోగదారులతో కిటకిటలాడాయి. రోడ్లన్నీ వాహన దారులతో రద్దీగా మారాయి. రోడ్లపై వాహనాలు రయ్ మంటూ ముందుకు కదిలాయి. లాక్ డౌన్ కు సమయం దగ్గర పడుతుండడంతో అంతర్గత రోడ్ల తో పాటు ప్రధాన రోడ్ లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. బుధవారం ఉదయం కూడా మందుబాబులు తమకు అవసరమైన మద్యం సీసాలను స్టోర్ చేసుకోవడం కోసం వైన్ షాప్ ల వద్ద క్యూ కట్టారు.ఇక నిత్యావసర వస్తువుల ధరలు ఏకంగా ఆకాశాన్ని చేరాయి. మంగళవారం ఉదయం అందుబాటులో ఉన్న ధరలు బుధవారం లేవు. లాక్ డౌన్ ప్రకటన వెలువడిన వెంటనే రెట్టింపు అయిన ధరలు బుధవారం ఉదయం కూడా కొనసాగాయి. ధరలను అదుపు చేయడానికి ఎవరూ ప్రయత్నించక పోవడంతో వ్యాపారుల ఇష్టారాజ్యానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రజలు బేఖాతరు చేశారు. గుంపులు, గుంపులుగా మార్కెట్ లను ఆశ్రయించడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఎక్కడ చూసినా… వినియోగ దారులే కనిపించారు. ఎక్కడా భౌతిక దూరం పాటించ లేదు. రంజాన్ మాసం దగ్గర పడడంతో ముస్లింలు చార్మినార్ – మక్కా మసీదు రోడ్డు లోని రంజాన్ మార్కెట్ లను ఆశ్రయించడంతో అక్కడ బుధవారం ఉదయం రద్దీ కనిపించింది. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ , సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, రాచకొండ పోలీసు కమిషనర్ ఎం.ఎం.భగవత్ తదితరులు బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు తీరును స్వయంగా  పరిశీలించారు.

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ మొదలైంది.