సెప్టెంబర్ 15, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

లాక్ డౌన్ తొలగింది..బోనాల ఉత్సవాల కు సిద్దం కండీ

లాక్ డౌన్ తొలగింది..బోనాల ఉత్సవాల కు సిద్దం కండీ

 

  • ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి పిలుపు
  • కలసి కట్టుగా బోనాల ఉత్సవాలకు క్రుషి
  • లాక్ డౌన్ ఆంక్షలు తొలగిపోవడంతో నిధుల మంజూరీకి వినతి
  • గతేడాది లాగా కాకుండా ఈసారి ఘనంగా బోనాల పండుగకు సిద్దం
  • దేవాలయాల అభివ్రుద్దికి నిధులు మంజూరు చేయాలంటూ డిమాండ్
  • కమిటి సర్వసభ్య సమావేశంలో ప్రతినిధుల ఏకగ్రీవ తీర్మాణం.

ఆర్సీ న్యూస్,జూన్ 19 (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ తొలగి పోయినందున ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేద్దామంటూ భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ప్రతినిధులు తీర్మానించారు. నెల రోజులకు ముందుగనే బోనాల ఉత్సవాలకు సిద్దం కావాలని కమిటి పిలుపునిచ్చింది. ఈ నెల 19వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉండడంతో కొంత అయోమయానికి గురైన బోనాల ఉత్సవాల నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఊరటనిచ్చిందని ఆయన పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర కేబినేట్ సమవేశంలో లాక్ డౌన్ తొలగింపుపై కీలక నిర్ణయం తీసుకోవడంతో జూలై 11వ తేదీ నుంచి జరుగనున్న ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అవకాశాలు ఏర్పడతాయని బోనాల ఉత్సవాల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా బోనాల ఏర్పాట్లపై కమిటి అధ్యక్షులు బి.బల్వంత్ యాదవ్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బ్రుందం శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించింది. పాతనగరంలోని లాల్ దర్వాజ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో జరిగిన కమిటి సమావేశంలో పలువురు దేవాలయాల కమిటి ప్రతినిధులు పాల్గొని పలు సూచనలు,సలహాలు అందజేశారు. కలసి కట్టుగా బోనాల జాతర ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని దేవాలయాలకు చెందిన కమిటి ప్రతినిధులు క్రుషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ఎలాంటి మనస్పర్దలకు తావివ్వకుండా కలసి కట్టుగా ఉత్సవాలను నిర్వహించడానికి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటికి సహకరించాలని సూచించారు. ఏవైనా సలహాలు,సూచనలు చేయాల్సిన వారు నేరుగా కమిటి అధ్యక్షులు బల్వంత్ యాదవ్ ద్రుష్టికి తీసుకురావాలన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన బత్తుల బల్వంత్ యాదవ్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోందన్నారు. తెలంగాణ సంస్క్రతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని పాతనగరంలో జరిగే ఉత్సవాల రోజు అధికారిక సెలవు దినంగాా ప్రకటించడం గర్వంగా ఉందన్నారు. బోనాల సమర్పణ మరుసటి రోజు పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుందని..వీటిని తిలకించడానికి భక్తులు రాష్ట్రంలోని నలుమూలల నుంచి పాతబస్తీకి తరలి వస్తారని..అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున అధికారిక సెలవు దినంగా ప్రకటించిందని ఆయన వివరించారు. గతేడాది లాగా కాకుండా ఈసారి బోనాల పండుగకు నిధులను మంజూరు చేయాలని కోరుతూ సంబందిత మంత్రులను కలిసి వినతి పత్రాలను అందజేశామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కూడా కలిసి వినతి పత్రం అందజేశామన్నారు. గతేడాది కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బోనాల జాతర ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించామని..ఈసారి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో పాటు లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయడంతో బోనాల జాతర ఉత్సవాలు నిర్వహించుకునేందుకు రాష్ట్రం ప్రభుత్వం తగిన అవకాశాలు కల్పించాలని కోరుతు కమిటి ప్రతినిధులతో కలిసి మంత్రులకు వివరించామన్నారు. ఆంక్షలు తొలగిపోవడంతో 2021లో జరిగే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ జీహెచ్ ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ ను కలిసి వినతి పత్రం సమర్చించామన్నారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఉపాధ్యక్షులు కె.ఎస్.ఆనంద్ రావు, వేణు గోపాల్, కార్యదర్శులు ముఖేష్ యాదవ్, గాజుల రాహుల్ (గబ్బర్) లతో పాటు గౌలిపురా మహాంకాళి దేవాలయం కమిటి అధ్యక్షులు మల్లేష్ గౌడ్, మీరాలంమండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం కమిటి చైర్మన్ గాజుల అంజయ్య, లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయం కమిటి అధ్యక్షులు కె.వెంకటేష్, ఉప్పుగూడ మహాంకాళి దేవాలయం కమిటి అధ్యక్షులు జనగామ మధుసూదన్ గౌడ్, హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయం కమిటి చైర్మన్ ప్రవీణ్ కుమార్ గౌడ్ తదితురులు పాల్గొన్నారు.