areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్…

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్...
  • బ్రెజిల్,రష్యా, బ్రిటన్, ఇరాన్ తదితర దేశాలతో సహా పలు దేశాల్లో పెరుగుతున్న కేసులు
  • ఇండోనేషియాలో పెరుగుతున్న మరణాల సంఖ్య.. 
  • అమెరికాలో గత మూడు రోజులుగా లక్షకు పైగా రోజు వారి కేసులు..
  • తెలంగాణలో 6 తేదీ వరకు 577 కేసుల నమోదు..
  • జిహెచ్ఎంసిలో 79 కేసులు.. కరీంనగర్లో 66, ఖమ్మంలో 42 కేసులు  

 

ఆర్సీ న్యూస్, ఆగస్టు 8(హైదరాబాద్): ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మళ్లీ అమెరికాలో అనూహ్యంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. చైనా లోనూ కొత్త కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దాదాపు రెండున్నర నెలలు ఎన్నడూ లేని విధంగా ఈనెల ఐదో తేదీన ఇండోనేషియాలో మరణాల సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో గత మూడు రోజులుగా లక్షకు పైగా రోజు వారి కేసులుప్రపంచవ్యాప్తంగా ఏడు లక్షలకు పైగా రోజువారి కేసులు నమోదయ్యాయి. “వరల్డ్ మీటర్” గణాంకాల ప్రకారం మే నెల 14వ తేదీ తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అంటున్నారు. ప్రధానంగా సాంక్రమిక శక్తి ఎక్కువగా ఉన్న కరోనా వైరస్ డెల్టా రకం 135 దేశాల్లో వ్యాప్తి చెందింది. బ్రెజిల్,రష్యా, బ్రిటన్, ఇరాన్ తదితర దేశాలతో సహా పలు దేశాల్లో కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇండోనేషియాలో మరణాల సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో గత మూడు రోజులుగా లక్షకు పైగా రోజు వారి కేసులు నమోదవుతున్నాయి. డెల్టా రకం వ్యాప్తి పెరుగుతోంది. గత నెల రోజుల్లో ఆసుపత్రి పాలయ్యే బాధితుల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరగటం అమెరికా ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్( సి డి సి) సమాచారం ప్రకారం ఈ సంఖ్య సగటున పన్నెండు వేల నుంచి 43 వేల వరకు పెరిగింది. దేశవ్యాప్తంగా గురువారం 24 గంటల్లో 1.20 లక్షల మందికి పైగా కోవిడ్ బారిన పడ్డారు. అత్యధికంగా ఫ్లోరిడాలో 20 వేలకు పైగా కొత్త కేసులు బయటపడగా… టెక్సాస్, కాలిఫోర్నియా లలో ఈ సంఖ్య 10,000 దాటింది. ఫిబ్రవరి రెండో వారం తర్వాత మళ్లీ ఈ వారంలోనే రోజు వారి కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. ఆసుపత్రుల పాలవుతున్న వారిలో ఫ్లోరిడా, జార్జియా, లూసియానా లలో 40 శాతం మంది ఉన్నారు. ఇదిలా ఉండగా చైనా లోనూ డెల్టా రకం కేసులు పెరుగుతున్నాయి. ఈనెల ఆరో తేదీన 80 మంది కోవిడ్ బారిన పడగా.. వీరిలో 58 కేసులు జియాంగ్స్ ప్రావిన్స్ లోని యాంగ్ ఝౌ నగరంలోనే బయటపడ్డాయి. చైనాలో గత ఏడాది కోవిడ్ అదుపులోకి వచ్చిన తర్వాత ఇటీవల మళ్లీ వైరస్ పెరుగుతోంది.ఈ మేరకు కొద్దిరోజులుగా బయటపడిన కేసుల సంఖ్య 1200 దాటింది. దీంతో చైనా మళ్లీ కట్టుదిట్టమైన చర్యలను ప్రారంభించింది. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు విధించింది. ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడంతో పాటు అన్ని రకాల ప్రయాణాలపై నిషేధం విధించింది. బ్రెజిల్ లో రోజు వారి కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఈనెల ఐదో తేదీన 24 గంటల్లో 40 వేల మందికి పైగా కోవిడ్ బారిన పడగా… 1086 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియాలో 1700 మందికి పైగా మృతి చెందారు. రోజు వారి కేసులు సగటున 35 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఇరాన్ లోనూ ఒక్కరోజులో 38,674 కేసులు బయటపడ్డాయి. బ్రిటన్లో తాజాగా 30,216 మందికి కోవిడ్ సోకింది. రష్యా, ఫ్రాన్స్,టర్కీ, మెక్సికో లలో 20 వేలకు పైగా రోజువారి కేసులు నమోదవుతున్నాయి. ఇక భారతదేశంలో ఇప్పటి వరకు మూడు కోట్ల 19 లక్షలు కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,28,000 మంది మృత్యువాత పడ్డారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈనెల ఆరో తేదీ సాయంత్రం ఐదున్నర గంటల వరకు…  577 కేసులు నమోదు కాగా.. 645 మంది కోవిడ్ రోగులు కోలుకున్నారు. ఇందులో ఇద్దరు చనిపోయారు. జిహెచ్ఎంసి పరిధిలో 79 కేసులు నమోదు కాగా.. కరీంనగర్లో 66, ఖమ్మంలో 42 కేసులు నమోదయ్యాయి. ఇక నారాయణపేట వనపర్తి లలో 22 కేసులు నమోదు కాగా… నిర్మల్ జిల్లాలో కేవలం ఒక కేసు మాత్రమే నమోదు అయ్యింది. ఇదిలా ఉండగా ఆగస్టు ఒకటో తేదీన తెలంగాణ రాష్ట్రంలో 455 కేసులు మాత్రమే నమోదు కాగా..6వ,తేదీన 577 కేసులు నమోదయ్యాయి.