మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

వారం రోజుల్లో 3010 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి

వారం రోజుల్లో 3010 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి ఈటెల రాజేందర్

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): వారం రోజుల్లో 3010 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.మంగళవారం నాడిక్కడ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ….రాష్ట్రంలో ప్రస్తుతం ఆక్సిజన్ బెడ్స్ కొరత లేదన్నారు. రాబోయే వారం రోజుల్లో యుద్ద ప్రాతిపదికన మూడు వేల పది ఆక్సిజన్ బెడ్స్ ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మలక్ పేట్, గోల్కొండ, వనస్థలిపురం,సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, అమీర్ పేట్,నాచారం, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో ఆక్సిజన్ బెడ్స్ ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.నాచారంలో రేపటి నుంచి 350 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ గాంధీ జనరల్ ఆస్పత్రిలో 600 ఐసీయు బెడ్స్ ఉన్నాయని..దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో ఆక్సిజన్, వెంటిలేటర్ల తో కూడిన మరో ఆసుపత్రి లేదన్నారు. దాదాపు 13-14 వందల ఆక్సిజన్ బెడ్స్అందుబాటులో ఉన్నాయన్నారు. మరో 400 బెడ్స్ కు అదనపు ఆక్సిజన్ లైన్లు వేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.గచ్చిబౌలిలోని ట్విమ్స్ ఆసుపత్రిలో 800 బెడ్స్ కు గానూ 300 అదనపు ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి వస్తున్నాయని ఆయన వెల్లడించారు. అలాగే వరంగల్లో 300,నిమ్స్,సూర్యపేట్,నల్లగొండ,మహబూబ్ నగర్,సిద్దిపేట్ లలో 200 చొప్పున బెడ్స్ తో పాటు మంచిర్యాల్లో 100 బెడ్స్ అందుబాటులోకి వస్తున్నాయన్నారు. హైదరాబాద్ నగరం హెల్త్ హబ్ గా పేరుగాంచిందని..అందుకే ఇక్కడ 50 శాతం మంది రోగులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు  వైద్య సేవలు పొందుతున్నార న్నారు. వైద్యం కోసం అంత దూరం నుంచి తమ వద్దకు వచ్చినప్పుడు ఆసుపత్రులలో చేర్చుకోకుండా తిరిగి పంపలేమని..అందుకే వారంతా నగరంలో వైద్య సేవలు పొందుతున్నారన్నారు. తమ వద్ద ఎక్కడా సిబ్బంది కొరత లేదన్నారు. సీఎం కేసీఆర్ మరో 755 మంది అదనపు వైద్య సిబ్బందిని కొత్తగా ఏర్పాటు చేయడం కోసం అనుమతించారన్నారు. కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు కోవిడ్ ప్యాండమిక్ పరిస్థితిని తమ వ్యాపారంగా మార్చుకుంటు ఉన్నాయన్నారు. ఇది మంచి పద్దతి కాదు. మానవత్వంతో వ్యవహరించాల్సిన సమయంలో వ్యాపార దృక్పథం తో పని చేయడం సిగ్గు చేటన్నారు. తాము గతంలోనే ఒక జీవో తెచ్చామని..దాని ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులలో రోజుకు రూ. నాలుగు వేలు, ఐసీయూ బెడ్ కైతే..రూ.7000, ఐసీయూ విత్ వెంటిలేటరైతే..రూ. 9000 గా నిర్దారించడం జరిగిందన్నారు. ఈ విధంగా కాకుండా అధికంగా డబ్బులు వసూలు చేస్తే..చర్యలు తప్పవన్నారు. కొంత మంది కోవిడ్ రోగులకు భీమా ఉన్నప్పటికీ..లకలలో డబ్బులు వసూలు చేయడం దురదృష్టకరమని..మరికొంత మంది చనిపోతే శవాన్ని సైతం ఇవ్వడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా కట్టడి కోసం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందన్నారు. అధిక శాతం మందికి కరోనా సోకినప్పటికీ వైద్య సేవలు పొంది నయమవుతున్నారన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ కొరత లేదన్నారు. దేశంలో ఎక్కడ చూసినా..ఆక్సిజన్ కొరత కనిపిస్తోందన్నారు. తాము అవసరమైన మేరకు ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకుంటున్నామన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరాను కేంద్ర ప్రభుత్వమే చూస్తుందన్నారు. దేశంలోని ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వానికి సమానమేననే భావనతో పని చేస్తే భావుంటుందన్నారు. టీకా పంపిణీ విషయంలో కేంధ్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్నారు. అందరికి టీకా పంపిణీ చేయాల్సిన భాధ్యత కేంద్రం దేనన్నారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా పంపిణీ చేస్తామన్నారు. 95 శాతం మందిలో కరోనా వైరస్ లక్షణాలు లేవన్నారు. కేవలం 0.5 శాతం మందికే కరోనా వైరస్ లక్షణాలున్నాయని.. వీరు మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారన్నారు. పీపీఈ కిట్లు,మందులు,అంబులెన్స్ లు సరిపడా అందుబాటులో ఉన్నాయన్నారు. వాక్సినేషన్ పంపిణీ సక్రమంగా జరుగుతోందని..అయితే తమకు అవసరమైన మేరకు కేంద్రం వ్యాక్సిన్ సరఫరా చేయడం లేదన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం టెస్టులు అధికంగా చేస్తున్నామన్నారు..కరోనా కట్టడిలో తమ రాష్ట్రం దేశంలోనే ముందున్నదని..దీని కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయన్నారు. దీంతో అక్కడి నుంచి మన రాష్ట్రానికి పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయని ఆయన తెలిపారు. ఎన్ని కేసులు పెరిగినా…అందరికి వైద్య సేవలు అందించడానికి వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు.