areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

జీహెచ్ఎంసీ లో…ఎస్ఎఫ్ఎల అవినీతి అక్రమాలు

బల్దియా

ఆర్సీ న్యూస్ (హైదరాబాద్): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ( జీహెచ్ఎంసీ)ని ఇంతకు ముందు..మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్)..బల్దియా అనే వారు. నగరంలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో ముందున్న జీహెచ్ఎంసీ అధికారులు,సిబ్బందిలో కొంత మంది అప్పుడప్పుడు చేసే పొరపాట్లు తెరపైకి వస్తు బల్దియాకు చెడ్డపేరు తెస్తున్నారు. బల్దియాకు వాడుకలో కాయా ఫీయా చల్దియా..అనే నానుడి ఉంది. తిని.. తాగి.. వెళ్లి పోవడం.. అని అర్థం. కొంతమంది బాధ్యతలు లేని అధికార, సిబ్బంది కారణంగా ప్రజలు ఇలా పిలుస్తున్నారు. వాస్తవానికి ఇది నిజం కానప్పటికీ..బల్దియా లోని కొంత మంది సిబ్బంది చేసే అవినీతి, అక్రమాలతో నిజాయితీగా పని చేసే సిబ్బందికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎక్కడైనా అవినీతి జరిగినట్లు వెల్లడైతే..కింది స్థాయి సిబ్బందిపై నెట్టివేసే సంబందిత అధికారులు బల్దియాలో ఎక్కువయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పారిశుద్ధ్య పనుల్లో ఎప్పటి నుంచో అవకతవకలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాల్సిన అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్  (ఏఎంహెచ్ఓ) లు, డిప్యూటీ కమిషనర్( డీసీ)లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. కాంట్రాక్ట్ పారిశుద్ధ్య పనుల్లో విధినిర్వహణ కొనసాగించే కార్మికుల్లో ఎప్పటికీ గోల్ మాల్ జరుగుతూనే ఉంది. తాజాగా పాతబస్తీలో దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో పెద్ద ఎత్తున మోసాలు, గోల్ మాల్ జరుగుతున్నట్లు వెల్లడైంది. ఇలాంటి  విషయాలు గతంలో కూడా సంబందిత ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ..పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 

ఇద్దరు జీహెచ్ఎంసీ  ఎస్ఎఫ్ఎల అరెస్ట్…

జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ పరిధిలో ఇద్దరు కాంటాక్ట్ ఎస్ఎఫ్ఎ ( శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్స్) అవినీతి,అక్రమాలకు పాల్పడినట్లు బుధవారం దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో బట్టబలైంది. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పకడ్బందీగా నిఘా పెట్టి నిందితుల బండారాన్ని బట్టబయలు చేసారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు, రెండు బయోమెట్రిక్ డివైస్లు, ఐదు నకిలీ బొటన వేలి ముద్రలు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం భవానీనగర్ పోలీసులకు అప్పగించారు. వివరాల ప్రకారం..తలాబ్ కట్టకు చెందిన మహ్మద్ హాజీ అహ్మద్ అలియాస్ అలీ(38), మొఘల్ పురాకు చెందిన మహ్మద్ లయూక్ ( 42)..వీరిద్దరూ బల్దియాలో ఏఎఫ్ఏ లుగా పని చేస్తున్నారు. తమ వద్ద 5 మంది పారిశుద్య కార్మికులు పని చేస్తున్నారంటూ తప్పుడు హాజరు వేస్తూ..అక్రమాలకు పాల్పడుతున్నారు. రోజు వారి పనులు చేయకుండానే పని చేస్తున్నట్లు నకిలీ వేలు ముద్రలు తయారు చేసి బయేమెట్రిక్ డివైస్ ద్వారా హాజరు వేస్తున్నారు. ఈ అటెండెన్స్ ద్వారా నెలకు రూ.14,000 కొట్టేస్తున్నారు. ఇలా గత ఎనిదేళ్లుగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న. వీరిద్దరూ జీహెచ్ఎంసీలో 12-15 ఏళ్ల నుంచి కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్నారు.

అక్రమాలను కనిపెట్టిన గ్రేటర్ మేయర్…

దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసుల సంఘటన పక్కన పెడితే..మరోవైపు గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బుధవారం సంబంధిత జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంహెచ్ఓ లతో కలిసి నగరంలో ఆకస్మిక పర్యటన నిర్వహించారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పంజగుట్ట,శ్రీనగర్ కాలనీ లలో గత 18 నెలల నుంచి ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు విధినిర్వాహణలో లేనప్పటికీ..సంబంధిత ఎస్ఎఫ్ఏ సాయిబాబా వారి హాజరు వేస్తు అక్రమాలకు పాల్పడుతున్న విషయాన్ని మేయర్ పసిగట్టింది. హాజరు కాని వారి స్థానంలో వేరే వారిని ఎవరిని నియమించకుండా వారికి నెలకు రూ. 4 వేలు ఇస్తూ..మిగిలిన రూ.11 వేలను తాను కొట్టేస్తున్న విషయాలను ఆమె తెలుసుకుని వెంటనే అతనిని విధినిర్వాహణ నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇలా బల్దియాలో అవినీతి,అక్రమాలు జరుగుతున్నప్పటికీ..సంబంధిత అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడం దేనికి సంకేతమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందుకే బల్దియా కాయా ఫీయా చల్దియా…అంటున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు అవినీతి అక్రమాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.