ఫిబ్రవరి 25, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

అంగరంగ వైభవంగా అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు..

అంగరంగ వైభవంగా అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు..
  • కరోనా వైరస్ ను లెక్క చేయని భక్తులు..
  • భక్తులలో ఎక్కడా కనిపించని కరోనా భయాందోళనలు
  • అత్యధిక సంఖ్యలో పాతబస్తీకి తరలి వచ్చిన భక్తులు
  • 2019లో వచ్చిన జనం..మళ్లీ 2021 ఆగస్టు 2ననే..కనిపించింది.
  • కన్నుల పండువగా సోమవారం పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు
  • బందోబస్తును పర్యవేక్షించిన నగర పోలీసు కమిషనర్ నుంచి హోం గార్డు ఆఫీసర్లు.
  • అంబారిపై ఉన్న అక్కన్న మాదన్న దేవాలయం అమ్మవారి ఘటానికి సీపీ పూజలు..
  • చార్మినార్ వద్ద ఘటాలకు స్వాగతం పలికిన మంత్రి తలసాని, మాజీ ఎంపీ అంజన్ కుమార్ 

 

ఆర్సీ న్యూస్, ఆగస్టు 02 (హైదరాబాద్): ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని చివరి ఘట్టమైన అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ ఘటాల సామూహిక ఊరేగింపులో అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి ఘటాలను తిలకించారు. 2019లో జరిగిన ఊరేగింపుకు హాజరైన భక్తులు తిరిగి ఆగస్టు 2న, జరిగిన ఊరేగింపులో పాల్గొన్నారు. భక్తులలో ఎక్కడా కరోనా వైరస్ భయాందోళనలు కనిపించ లేదు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు తండోప తండాలుగా పాతబస్తీకి తరలి వచ్చారు. పాతబస్తీలో  ఘటాల సామూహిక ఊరేగింపు కు చార్మినార్ వద్ద భక్తుల జన సందోహాం కనిపించింది. ఎటు చూసినా జనమే..జనం. అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపును పురస్కరించుకుని నగర పోలీసు కమిషనర్ స్థాయి నుంచి హోం గార్డు ఆఫీసర్ల వరకు  ఘటాల సామూహిక ఊరేగింపు బందోబస్తును నిర్వహించారు. సోమవారం పాతబస్తీలో నిర్వహించిన అమ్మవారి ఘటాల ఊరేగింపు సందర్బంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అంచంలంచెలుగా ట్రాఫిక్ ను దారి మళ్లించారు. పాతబస్తీ వీధుల్లో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఘటాల సామూహిక ఊరేగింపు వైభవంగా కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బోనాల జాతర ఉత్సవాలను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఘటాల ఊరేగింపును సెలవు దినంగా ప్రకటించడంతో అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున మధ్యాహ్నం నుంచే చార్మినార్ కు చేరుకోవడం ప్రాంభించారు. ఆలస్యంగా వెళితే కూర్చోవడానికి..నిలుచోవడానికి జాగలు దొరకవని భావించిన భక్తులు ముందుగానే పాతబస్తీకి చేరుకున్నారు. పాతబస్తీ వీధుల్లో నిర్వహించిన అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపులో ఉత్సవాల నిర్వాహకులు ఏర్పాటు చేసిన కళాకారులు,శకటాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాతబస్తీలో గతేడాది కరోనా  వైరస్ కారణంగా అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు నిరాడంబరంగా కొనసాగింది. భక్తుల హడావుడి లేకుండా మూసి నది వరకు కొనసాగిన ఊరేగింపు సాదా సీదాగా జరిగింది. ఈసారి అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరగడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. కళా బృందాలు చేసిన వివిధ రకాల నృత్య విన్యాసాలకు మంత్ర ముగ్గ్దులయ్యారు. ముఖ్యంగా మీరాలంమండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం కమిటి గాజుల అంజయ్య ఆధ్వర్యంలోని కళా బృందాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం 6.30 గంటల వరకు కూడా మీరాలంమండి అమ్మవారి ఘటాలు చార్మినార్ వద్దకు చేరుకోకపోవడంతో భక్తులు కొంత మంది నేరుగా మీరాలంమండికి చేరుకుని ఘటాల సామూహిక ఊరేగింపును తిలకించారు. చార్మినార్ వద్ద మంత్రి తలసాని, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్, ఉఫాధ్యక్షులు కె.ఎస్. ఆనంద్ రావు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ యాదవ్ తదితరులు  ఘటాలకు ఘనంగా స్వాగతం పలికారు. వీరితో పాటు పలువురు అధికార,అనధికార ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఎస్ బసవ కేంధ్రం అధ్యక్షులు నాగ్ నాథ్ మాశెట్టి మీరాలంమండిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబస్తీలో లాల్ దర్వాజ,ఉప్పుగూడ, గౌలిపురా, సుల్తాన్ షాహీ, బేల ముత్యాలమ్మ, హరిబౌలి ( బంగారు మైసమ్మ, అక్కన్న మాదన్న) మీరాలంమండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయాలకు చెందిన 8 ప్రధాన దేవాలయాల అమ్మవారి ఘటాలతో పాటు  ఉమ్మడి దేవాలయాలలోని మరికొన్ని అమ్మవారి ఘటాలు ఈ సామూహిక ఊరేగింపులో పాల్గొన్నాయి.