మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

అంగరంగ వైభవంగా ఆదివారం బోనాల జాతర సందడి..

అంగరంగ వైభవంగా ఆదివారం బోనాల జాతర సందడి..
  • సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి ఘనంగా బోనాలు
  • ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందజేసిన మంత్రులు
  • పాతబస్తీలో కన్నుల పండువగా ఘట స్థాపన సామూహిక ఊరేగింపు..
  • కాశీ విశ్వనాథ దేవాలయం నుంచి మొదలైన ఊరేగింపు
  • భాజా భజంత్రీల నడుమ ఆనందోత్సాహాలతో కొనసాగిన ఊరేగింపు
  • లాల్ దర్వాజ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఘటాలకు స్వాగతం పలికిన పలువురు ప్రముఖులు

 

ఆర్సీ న్యూస్, జూలై 25 (హైదరాబాద్): భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. పాతబస్తీలోని 19 మహాంకాళి అమ్మవారి దేవాలయాలకు చెందిన ఘటాలతో ఉత్సవాల నిర్వాహకులు పెద్ద ఎత్తున సామూహిక ఊరేగింపు నిర్వహించారు. శాలిబండలోని కాశీ విశ్వనాథ దేవాలయంలో అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవాలయాల కమిటి ప్రతినిధులు తమ తమ ఘటాలను ఊరేగింపుగా తరలించారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు కాశీ విశ్వనాథ దేవాలయం నుంచి సామూహిక ఊరేగింపుగా బయలు దేరిన ఘటాలు భాజా భజంత్రీల నడుమ పోతురాజుల నృత్యాలతో ముందుకు సాగాయి. లాల్ దర్వాజ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేధికపై నుంచి పలువురు అధికార,అనధికర ప్రముఖులు అమ్మవారి ఘటాలకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. లాల్ దర్వాజ సింహవాహిణీ దేవాలయం అమ్మవారి ఘటం ఊరేగింపుకు ముందుండగా…ఊరేగింపు చివరన అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం అమ్మవారి ఘటం ఉంది. 

ఊరేగింపు దారిపొడవునా స్వాగత వేదికలు..

ఊరేగింపు దారిపొడవునా ఏర్పాటు చేసిన వేదికలపై నుంచి పలువురు అమ్మవారి ఘటాలకు ఘనంగా స్వాగతం పలికారు. ఘటానికి బొట్టు పెట్టి టెంకాయలు కొట్టి హారతి ఇచ్చారు. దారిపొడవునా కళాకారులు నృత్యాలు చేశారు. పోతురాజుల విన్యాసాలు చిన్నారులతో పాటు యువకులను పరుగులు పెట్టించాయి. అమ్మవారి ఘటాల వెంట ఊరేగింపులో పాల్గొన్న నిర్వాహకులు చాలా వరకు అందరూ ఒకే విధంగా దుస్తులు వేసుకుని, తలకు ప్రత్యేకమైన పగిడిలను కట్టుకుని ఆకర్షణీయంగా కనిపించారు. గతేడాది కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలతో ఘట స్థాపన ఊరేగింపు సాదా సీదాగా ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా నిరాడంబరంగా జరిగింది. ఈసారి కరోనా ఆంక్షలు లేకపోవడంతో అమ్మవారి భక్తులు ఆనందోత్సాహాల నడుమ భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు నిర్వహించారు. లాల్ దర్వాజ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎం.అంజన్ కుమార్ యాదవ్,ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ రాజ్, గౌలిపురా కార్పోరేటర్ ఆలే భాగ్యలక్ష్మి, ఊరేగింపు కమిటి ఉపాధ్యక్షులు కె.ఎస్.ఆనంద్ రావు, ఆకుల వేణుగోపాల్, కార్యదర్శి గాజుల రాహుల్, ఊరేగింపు కమిటి మాజీ అధ్యక్షులు జనగామ మధుసూదన్ గౌడ్, గాజుల అంజయ్య, రాకేశ్ తివారీ, ప్రవీన్ కుమార్ గౌడ్, ఊరేగింపు కమిటి ప్రధాన కార్యదర్శి ఎం. మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.పాతబస్తీలో ఈ నెల 23న, జరిగిన కలశ స్థాపన తో ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రాంరంభమయ్యాయి. అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్దలతో ప్రారంభమైన బోనాల జాతర ఉత్సవాలలో పలువురు అధికార,అనధికార ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఆగస్టు 2 వరకు బోనాల జాతర ఉత్సవాలు…

పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు  ఆగస్టు 2వ తేదీ వరకు జరుగనున్నాయి. బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని సంబందిత దేవాలయాల నిర్వాహకులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. పూజల సందర్బంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉత్సవాల నిర్వాహకులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇక ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అంగరంగ వైభవంగా జరిగిన అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపుతో పాతబస్తీలో ఎక్కడ చూసినా ఆథ్యాత్మిక వాతావరణం నెలకొంది. గతేడాది కరోనా వైరస్ ఆంక్షల నడుమ భక్తులెవరు లేకుండా ఇళ్లల్లోనే అమ్మవారికి బోనాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో నగరంలోని అన్ని ప్రాంతాలలో భక్తులు ప్రభుత్వ ఆంక్షలను పాటిస్తూ అమ్మవారికి భక్తి శ్రద్దలతో బోనాలను సమర్పించారు. అయితే ఈసారి ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో బోనాల జాతర ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. అమ్మవారి భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్నారు.

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి భక్తి శ్రద్దలతో బోనాల సమర్పణ…

 ఇక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ భక్తి శ్రద్దలతో జరిగింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. కరోనా కట్టడికి జాగ్రత్తలు పాటిస్తూనే..అమ్మవారికి నైవేధ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు బంగారు పాత్రలో అమ్మవారికి బోనం సమర్పించారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ,ఎంపీ సంతోష్ రెడ్డిలతో పాటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి,ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.